మమత వర్సెస్ సువేంధు.. ఏం జరిగినా ఓ హిస్టరీనే?
రాష్ట్రాన్ని 15 ఏళ్లుగా పాలిస్తున్న మమత సర్కార్ ను గద్దె దించాలని ఢిల్లీ బీజేపీ పెద్దలు కంకణం కట్టుకున్నారు.;
పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో అధికార తృణమూల్, బీజేపీ మధ్య పోటీ తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. రాష్ట్రాన్ని 15 ఏళ్లుగా పాలిస్తున్న మమత సర్కార్ ను గద్దె దించాలని ఢిల్లీ బీజేపీ పెద్దలు కంకణం కట్టుకున్నారు. ఏదిఏమైనా మమతను ఓడిస్తామంటూ భారీ ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్రంలో మమత అధికారాన్ని లాక్కోవడమే కాదు, ఆమెను ఎమ్మెల్యేగా గెలవనీయమంటూ సవాల్ విసురుతున్నారు. గత ఎన్నికల్లో నందిగ్రామ్ లో మమత ను ఓడించిన సువేంధు అధికారిని మరోసారి ప్రయోగిస్తున్నారు. ముఖ్యమంత్రి మమత ప్రాతినిధ్యం వహిస్తున్న భవానీపూర్ నియోజకవర్గంలో పోటీకి సిద్ధమైన సువేంధు పెద్ద సవాలే విసురుతున్నారు. దీంతో ఈ ఇద్దరి మధ్య పోటీ తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఇక్కడ ఎవరు గెలిచినా ఓ చరిత్రే అవుతోందని అంటున్నారు.
అప్పుడు మమతకు షాక్
భవానీపూర్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ సొంత నియోజకవర్గం. ఇక్కడ నుంచి ఆమె వరుసగా గెలుస్తూ వస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో తన వెంటే ఉంటూ బీజేపీలో చేరి ప్రత్యర్థిగా మారిన సువేంధు అధికారిపై ప్రతీకారం తీర్చుకోవాలని భావించిన మమత భవానీపూర్ ను వేరొకరికి అప్పగించారు. సువేంధు అధికారికి రాజకీయం స్థానం లేకుండా చేయాలని పంతం పట్టి ఆయన సొంత నియోజకవర్గం నందిగ్రామ్ లో పోటీకి దిగారు. అప్పటికి పదేళ్లుగా ముఖ్యమంత్రిగా పనిచేసిన మమత కొత్త నియోజవర్గాన్ని ఎంచుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తన హవా ముందు సువేంధు తేలిపోతారని భ్రమతో ఎన్నికల్లో దెబ్బతిన్నారు ముఖ్యమంత్రి.
వ్యూహాత్మక వైఫల్యం!
బీజేపీ నేత సువేంధు అధికారి స్థానబలాన్ని సరిగా అంచనా వేయకుండా తన సొంత నియోజవకర్గాన్ని వదులుకుని నందిగ్రామ్ లో గెలుస్తామని మమత బొక్కబోర్లా పడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో మమత పార్టీ గెలిచినా ఆమె నందిగ్రామ్ లో ఓటమి చెందడం అప్పట్లో సంచలనంగా మారింది. ఇక ఈ పరిణామంతో బీజేపీలో సువేంధు అధికారి ప్రతిష్ట పెరిగింది. ఒకప్పుడు తన పార్టీలో పనిచేసిన సువేంధు ప్రత్యర్థిగా మారడాన్ని జీర్ణించుకోలేని మమత ఆయనకు స్థానబలం ఉన్న చోట పోటీ చేసి చేతులు కాల్చుకున్నారు. అయితే ఇదంతా గతం.. ఇప్పుడు వర్తమానంలో కూడా మళ్లీ అదే పరిణామాలు చోటుచేసుకునేలా కనిపిస్తున్నాయి. అయితే ఈ సారి స్థలం మారింది. ఫలితం ఉత్కంఠకు గురిచేస్తోంది. గత ఎన్నికల్లో మమత తన ప్రత్యర్థి నియోజకవర్గంలో పోటీ చేస్తే ఇప్పుడు సువేంధు అదే పనిచేస్తున్నారు. అయితే ఆయన కాస్త జాగ్రత్త పడి రెండు చోట్ల పోటీ చేస్తుండటం గమనార్హం.
సువేంధు దూకుడు
గతంలో ముఖ్యమంత్రి మమత తన ప్రత్యర్థి సువేంధు నియోజకవర్గంలో పోటీ చేస్తే, ఈ సారి సువేంధు అధికారి భవానీపూర్ లో కూడా నామినేషన్ వేసి సవాల్ విసిరారు. నా ప్లేస్ లో ఓడించడం కాదు.. మీ ప్లేస్ లోనూ విజేతను నేనే అంటూ దూకుడు చూపుతున్నారు సువేంధు. కోల్ కతాలోని కీలక నియోజకవర్గమైన భవానీపూర్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీకి పెట్టని కోట. గత ఎన్నికల్లో పొరపాటునో అతి నమ్మకమో కానీ ఆమె భవానీపూర్ ను విస్మరించి తగిన ఫలితం ఎదుర్కొన్నారు. కానీ, ఈ సారి భవానీపూర్ లో సువేంధు రూపంలో సవాల్ ఎదురవుతుందని మమత కూడా ఊహించలేదని అంటున్నారు. ఇక ఢిల్లీ పెద్దల అండదండలతో ముఖ్యమంత్రి మమతను నిలువరించే వ్యూహాలను అమలు చేస్తున్న సువేంధు భవానీపూర్ లో నెగ్గుకు రాగలరా? అన్నదే ఆసక్తికరంగా మారింది. మమత కోటలో పాగా వేయడం అంటే అంత ఈజీ కాదని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. మొత్తానికి ఇద్దరు ఉద్దండుల పోటీతో భవానీపూర్ నియోజకవర్గం దేశవ్యాప్తంగా సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ గా మారింది.