హర్మూజ్ లో సీమైన్స్ పెట్టి మరిచిపోయిన ఇరాన్.. నౌకలకు పెను ముప్పు

హర్మూజ్ జలసంధిలో ఇరాన్ పాతిపెట్టిన 'మృత్యుపాశాలు' ఇప్పుడు ఆ దేశానికే కాదు.. ప్రపంచ దేశాల నౌకాయానానికి పెను సవాల్‌గా మారాయి.;

Update: 2026-04-11 11:53 GMT

హర్మూజ్ జలసంధిలో ఇరాన్ పాతిపెట్టిన 'మృత్యుపాశాలు' ఇప్పుడు ఆ దేశానికే కాదు.. ప్రపంచ దేశాల నౌకాయానానికి పెను సవాల్‌గా మారాయి. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కొంతవరకు తొలగి రెండు వారాల కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినప్పటికీ సముద్ర గర్భంలో దాగి ఉన్న ముప్పు మాత్రం ఇంకా పొంచి ఉంది. ఇజ్రాయెల్, అమెరికా దాడులను ఎదుర్కోవడానికి వ్యూహాత్మకంగా హర్మూజ్ జలసంధిలో అమర్చిన సీమైన్స్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాయో తెలియక ఇరాన్ తల పట్టుకుంటోంది.

అదుపు తప్పిన ఆత్మరక్షణ చర్య

అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం ఉద్రిక్తతలు గరిష్ట స్థాయికి చేరుకున్న సమయంలో ఇరాన్ తన సముద్ర సరిహద్దులను రక్షించుకోవడానికి, శత్రు నౌకలను అడ్డుకోవడానికి వందల సంఖ్యలో సీమైన్స్‌ను హర్మూజ్ జలసంధిలో ప్రయోగించింది. అయితే తాజాగా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ మాటలను బట్టి చూస్తే ఆ మైన్స్‌ను తిరిగి తొలగించడం ఇప్పుడు ఆ దేశానికి సాధ్యం కావడం లేదని అర్థమవుతోంది. సాధారణంగా ఇలాంటి మైన్స్‌ను అమర్చినప్పుడు వాటి భౌగోళిక స్థానాలను రికార్డు చేస్తారు. కానీ ఇరాన్ దళాలు చిన్న పడవల ద్వారా అత్యంత వేగంగా చెల్లాచెదురుగా వీటిని వేయడం వల్ల వాటి ఖచ్చితమైన మ్యాపింగ్ జరగలేదని అమెరికా రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ముప్పు ఎందుకు పెరిగింది?

సముద్ర గర్భంలో మైన్స్ ఒకే చోట స్థిరంగా ఉండవు. దీనికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి. హర్మూజ్ జలసంధిలో నీటి ప్రవాహం చాలా వేగంగా ఉంటుంది. దీనివల్ల మైన్స్ తామున్న చోటు నుంచి కిలోమీటర్ల మేర కొట్టుకుపోయే అవకాశం ఉంది. ఇటీవల వచ్చిన తుఫాన్లు, సముద్రపు అలల ఉధృతికి ఈ మైన్స్ తమ గొలుసుల నుంచి తెగిపోయి 'ఫ్లోటింగ్ మైన్స్'గా మారినట్లు సమాచారం. కొన్ని మైన్స్ నిర్ణీత సమయం తర్వాత వాటంతట అవే నిర్వీర్యం కావాలి . కానీ సాంకేతిక లోపాల వల్ల అవి ఇంకా క్రియాశీలంగానే ఉండటం ప్రమాదకరంగా మారింది.

గ్లోబల్ ఎకానమీపై ప్రభావం

హర్మూజ్ జలసంధి ప్రపంచానికి 'ఎనర్జీ లైఫ్ లైన్' వంటిది. ప్రపంచవ్యాప్తంగా రవాణా అయ్యే 20 శాతం చమురు ఈ సన్నని మార్గం గుండానే వెళ్లాలి. ఇప్పుడు ఈ మార్గంలో మందుపాతరలు ఉన్నాయన్న వార్త నౌకాయాన సంస్థలను వణికిస్తోంది. నౌకల భద్రత దృష్ట్యా ఇన్సూరెన్స్ ప్రీమియంలు పెరగడం వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు పెరిగే అవకాశం ఉంది. డోనాల్డ్ ట్రంప్ వంటి నాయకులు హర్మూజ్‌ను వెంటనే తెరవాలని ఒత్తిడి చేస్తున్నప్పటికీ క్లియరెన్స్ సర్టిఫికేట్ లేకుండా భారీ నౌకలు ముందుకు రావడానికి భయపడుతున్నాయి.

నిర్వీర్యం చేయడం క్లిష్టతరం

సముద్రంలో మైన్స్‌ను గుర్తించి తొలగించడం అనేది అత్యంత ఖరీదైన, సమయంతో కూడుకున్న పని. ఇరాన్ దగ్గర ఉన్న పాతకాలపు మైన్-స్వీపింగ్ టెక్నాలజీతో వీటిని వెతకడం అసాధ్యమని నిపుణులు తేల్చి చెబుతున్నారు. అమెరికా లేదా ఇతర పాశ్చాత్య దేశాల సాయం కోరడం ఇరాన్‌కు రాజకీయంగా ఇబ్బందికరం. ప్రస్తుతానికి ఇరాన్ కొన్ని ప్రత్యామ్నాయ మ్యాప్‌లను విడుదల చేసినప్పటికీ అవి ఎంతవరకు సురక్షితమో ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఒకవేళ పొరపాటున ఏదైనా భారీ చమురు నౌక ఈ మైన్‌ను ఢీకొంటే అది కేవలం నౌక మునకకే కాదు.. భారీ పర్యావరణ విపత్తుకు కూడా దారితీస్తుంది.

యుద్ధం కోసం వేసిన ఎత్తుగడలు ఇప్పుడు శాంతి సమయంలో ఇరాన్‌కు శాపంగా మారాయి. హర్మూజ్ జలసంధిలో ఈ సస్పెన్స్ వీడనంత వరకు ప్రపంచ వాణిజ్యం మునివేళ్ల మీదనే ఉండక తప్పదు. ప్రాంతీయ శక్తులు విభేదాలను పక్కన పెట్టి సంయుక్తంగా ఈ మృత్యుపాశాలను తొలగించకపోతే పశ్చిమాసియాలో మరో ఆర్థిక సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉంది.

Tags:    

Similar News