టీడీపీ మహానాడు 2026 : వేదికగా ఉత్తరాంధ్ర.. ఈసారి ప్రత్యేకతలేంటో తెలుసా?

టీడీపీ కార్యకర్తలు ఘనంగా జరుపుకునే పసుపు పండుగ మహానాడును ఈ ఏడాది విజయనగరం జిల్లాలో నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది.;

Update: 2026-04-11 12:23 GMT

టీడీపీ కార్యకర్తలు ఘనంగా జరుపుకునే పసుపు పండుగ మహానాడును ఈ ఏడాది విజయనగరం జిల్లాలో నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. పార్టీ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా ఈ జిల్లాలో మహానాడు నిర్వహణకు నిర్ణయించడం ఆసక్తిరేపుతోంది. సహజంగా తెలుగుదేశం పార్టీ మహానాడును పెద్ద నగరాలు, రవాణా, ఇతర మౌలిక సదుపాయాలకు లోటు లేని ప్రాంతాల్లోనే నిర్వహించేవారు. అయితే కొద్దికాలం నుంచి ఈ విషయంలో పార్టీ ఆలోచన మారింది. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లోనూ ఈ వేడుక నిర్వహించాలనే భావనతో గ్రామీణ ప్రాంతాలకు పెద్దపీట వేస్తున్నారు.

గత ఏడాది కడపలో మహానాడు నిర్వహించారు. అంతకు ముందు ఎప్పుడూ కడప కేంద్రంగా మహానాడు నిర్వహించకపోవడం, రాష్ట్రవ్యాప్తంగా తరలివచ్చే కేడర్ కు వసతులు కల్పించడం పెద్ద సవాల్ గా మారే పరిస్థితుల కారణంగా కడప మహానాడు అందరినీ తీవ్ర ఉత్కంఠకు గురిచేసింది. అయితే కడప జిల్లాకు చెందిన నేతలు అంతా తీవ్రంగా శ్రమించి మహానాడును విజయవంతం చేశారు. దీంతో ఇతర గ్రామీణ ప్రాంతాల్లోనూ మహానాడు విజయవంతం చేయగలమని భావించిన టీడీపీ అధిష్టానం ఈ సారి ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం-విజయనగరం జిల్లాల సరిహద్దుల్లో పసుపు పండుగ నిర్వహణకు సిద్ధమైందని అంటున్నారు.

విజయనగరం జిల్లా నెల్లిమర్ల, శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గాల పరిధిలో మహానాడు నిర్వహణకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఉత్తరాంధ్ర కో-ఆర్డినేటర్ దామచర్ల సత్య, ముఖ్యమంత్రి కార్యక్రమాల పర్యవేక్షకుడు సత్యనారాయణ పరిశీలించారు. ఈ రెండు నియోజవకర్గాలలో మూడు స్థలాలను పరిశీలించిన ఈ బృందం 17వ తేదీన మరోసారి పర్యటించి తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. ఏదిఏమైనా ఈ ప్రాంతంలో మహానాడు నిర్వహణకు పార్టీ కట్టుబడి ఉన్నట్లు స్పష్టమైంది.

దీంతో విజయనగరం టీడీపీలో హడావుడి ఎక్కువైంది. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు విదేశాల నుంచి టీడీపీ అభిమానులు, కార్యకర్తలు మహానాడుకు తరలివచ్చే అవకాశం ఉందని అంటున్నారు. రెండు రోజులుపాటు జరిగే ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు పార్టీ యంత్రాంగం అంతా తరలిరానున్నారు. రెండు రోజులు అందరికీ వసతి కల్పించడం అంటే మామూలు విషయం కాదని అంటున్నారు. ఇప్పటివరకు మహానాడు నిర్వహణలో అంతగా అనుభవం లేని విజయనగరం టీడీపీ ఈ సవాల్ ను ఎలా తీసుకుంటుందనేది చూడాల్సివుంది.

Tags:    

Similar News