దేశంలో ఫస్ట్: 'బూతులు' నిషేధం!
మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్ జిల్లా, బోర్‌సర్ గ్రామంలో బూతులు నిషేధిస్తూ.. గ్రామ పెద్దలు తీర్మానం చేశారు. ఈ గ్రామంలో 6 వేల మందికి పైగా జనాభా నివసిస్తున్నారు. వీరిలో మహిళలు ఎక్కువగా ఉంటున్నారు.;
బూతులు మాట్లాడడం.. వాటిని పోస్టులు చేయడం ఈ రోజుల్లో కామన్ అయిపోయింది. కుటుంబాలపైనా.. మహిళలపైనా బూతు మాటల గోల కూడా పెరిగిపోయింది. ముఖ్యంగా ఇద్దరు ఫ్రెండ్స్ కలిసినా.. ఏదైనా పార్టీ చేసుకున్నా.. బూతులు లేకుండా గడవడం లేదట!. కృతకపదాలు.. ముతక పదాలకు లెక్కే లేదు. ఇక, సోషల్ మీడియా పెరిగిపోయిన తర్వాత.. బూతులకు.. బూతు వీడియోలకు పరిమితి.. హద్దు అనేది లేకుండా పోయింది.
ప్రస్తుతం యూట్యూబ్ రీల్స్ నుంచి ఫేస్ బుక్ రీల్స్ వరకు.. ఓ పది రీళ్లను చూస్తే.. రెండు ఖచ్చితంగా బూతు రీల్స్ ఉంటున్నాయి. దీంతో సంప్రదాయ కుటుంబాల్లోని పెద్దలు ఒకింత ఇబ్బంది పడుతున్నా రు. ముఖ్యంగా ఈ బూతు రీళ్లను చూస్తున్న చిన్నారులు గాడి తప్పుతున్న పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా ఏపీ హైకోర్టు కూడా బూతు వీడియోలు.. రీల్స్, సోషల్ మీడియాలో పోస్టులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వీటిని అరికట్టకపోతే ఎలా? అంటూ ప్రభుత్వంపై కన్నెర్ర చేసింది.
ఇది ఒక్క ఏపీలోనో.. మరో రాష్ట్రంలోనో పరిమితం కాలేదు. దేశవ్యాప్తంగా కామన్‌గా మారిన ప్రధాన జాడ్యం. దీనిపై ఓ గ్రామ పెద్దలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. బూతులపై నిషేధం విధించారు. బూతులు మాట్లాడడమే కాదు.. వినడం కూడా.. తప్పేనని తీర్మానం చేశారు. ఇలా చేస్తే.. గ్రామ సంప్రదాయం దెబ్బతింటోందని భావించిన గ్రామ పెద్దలు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి బూతులు మాట్లాడినా.. విన్నా.. రీల్స్ చేసినా.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఎక్కడ?
మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్ జిల్లా, బోర్‌సర్ గ్రామంలో బూతులు నిషేధిస్తూ.. గ్రామ పెద్దలు తీర్మానం చేశారు. ఈ గ్రామంలో 6 వేల మందికి పైగా జనాభా నివసిస్తున్నారు. వీరిలో మహిళలు ఎక్కువగా ఉంటున్నారు. దీంతో వీరికి బూతుల సమస్య తీవ్రంగా మారింది. దీనిపై అందిన ఫిర్యాదుల మేరకు.. గ్రామ పెద్దలు తీర్మానం చేశారు. బూతులు మాట్లాడినట్టు రుజువు అయితే.. 500 రూపాయల జరిమానా విధిస్తారు.
జరిమానా కట్టకపోతే..
ఒకవేళ జరిమానా కట్టలేమని అంటే.. గ్రామంలో మురుగు కాల్వలు తీయడం, చెత్తను తొలగించడం.. రోడ్లు ఊడవడం వంటి పనులను చేయడం ద్వారా శిక్ష అనుభవించాలి. దేశంలో సారా నిషేధించిన గ్రామాలుఉన్నాయి. గంజాయిని నిషేధించిన గ్రామాలు కూడా ఉన్నాయి. ఇక, బాల్య వివాహాలు, కట్నాలు వంటి సాంఘిక దురాచారాలు నిషేధించిన గ్రామాలు ఉన్నాయి. కానీ, తొలిసారి ఈ గ్రామంలో బూతులు నిషేధించడం ద్వారా ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలవడం గమనార్హం. మరి ఏమేరకు సక్సెస్ అవుతారో చూడాలి.