చరిత్ర చూపించి మరీ జీవన్ రెడ్డికి చురక వేసిన సీఎం రేవంత్
పార్టీలో చేరిన జీవన్ రెడ్డి పై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ ఆసక్తికర వ్యాఖ్య చేశారు.;
కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి తాజాగా బీఆర్ఎస్ లో చేరటం తెలిసిందే. సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ లో ఉన్న ఆయన.. ఇటీవల కాలంలో సీఎం రేవంత్ తో పొసగక.. ఎట్టకేలకు గులాబీ కారు గూటికి చేరుకోవటం తెలిసిందే. పార్టీలో చేరిన జీవన్ రెడ్డి పై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ఏదో మాట వరసకు అన్నట్లు కాకుండా.. తన మాటలోని లాజిక్ ను చూపించిన వైనం చర్చనీయాంశంగా మారింది.
జీవన్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరిన వైనంపై గులాబీ ముఖ్యనేతల్లో ఒకరు కేటీఆర్ సీఎం రేవంత్ పై విమర్శలు గుప్పించారు. దీనికి కౌంటర్ గా సీఎం రేవంత్ రియాక్టు అయ్యారు. కాంగ్రెస్ ను విడిచి పెట్టి.. బీఆర్ఎస్ లోకి చేరిన జీవన్ రెడ్డిది లాస్ట్ సప్పర్ గా పేర్కొనటం గమనార్హం. తాను అన్న మాటలకు లాజిక్ చెబుతూ.. ఆలె నరేంద్ర.. దేశిని చిన మల్లయ్య.. ఈటల రాజేందర్.. విజయశాంతి.. పొన్నాల లక్ష్మయ్య పరిస్థితి ఏమైందో అందరికి తెలుసన్న ఆయన.. ‘పొన్నాల లక్ష్మయ్యను ఎప్పుడైనా బీఆర్ఎస్ లో చూశారా?’ అంటూ చురక వేశారు.
జూపల్లి క్రిష్ణారావు.. తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిన తర్వాత వారిని మీద గెలిచిన వారిని పార్టీలో చేరుకున్న విషయాన్ని గుర్తు చేసిన సీఎం రేవంత్.. ‘జూపల్లి.. తుమ్మలకు కనీసం తమ నియోజకవర్గం పరిధిలోని వార్డు మెంబర్ అభ్యర్థిని ఎంపిక చేసుకునే అవకాశం కూడా ఇవ్వలేదు’ అంటూ నాటి సంగతుల్ని చెప్పుకొచ్చారు. సీఎం రేవంత్ చెప్పిన ఉదాహరణ వాస్తవానికి దగ్గరగా ఉండటం తెలిసిందే. బీఆర్ఎస్ లోకి వెళ్లే వరకు తమకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఉన్న వారు.. ఆ తర్వాతి కాలంలో ఆ ఇమేజ్ ను కాపాడుకునే విషయంలో ఘోరంగా ఫెయిల్ అయిన సంగతి తెలిసిందే. అందుకే.. ఇదే విషయాన్ని సమయానికి తగ్గట్లు సీఎం రేవంత్ ప్రస్తావించారని చెప్పాలి.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. అసలు జీవన్ రెడ్డికి.. రేవంత్ కు మధ్య గ్యాప్ ఎక్కడ మొదలైంది? అదెందుకు భర్తీ కాలేదన్నది ఆసక్తికరంగా చెప్పాలి. జగిత్యాల నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను కాంగ్రెస్ లో చేర్చుకోవటం ద్వారా నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేయాలన్నది సీఎం రేవంత్ ఆలోచన. సీనియర్ నేత జీవన్ రెడ్డి బలమైన నేత అయినప్పటికీ.. ప్రస్తుత ఎమ్మెల్యేను పార్టీ వైపు తిప్పుకోవటం ద్వారా ప్రత్యర్థి పార్టీని దెబ్బ కొట్టొచ్చన్నది రేవంత్ ఆలోచనగా చెబుతారు. అదే సమయంలో.. జీవన్ రెడ్డి తనకు గౌరవప్రదమైన పోస్టును ఆశించారు. అది రేవంత్ సర్కారులో రాకపోవటం ఆయనకు మరింత అసంత్రప్తికి కారణమైంది.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. రేవంత్ తన టీంను తయారు చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు చెబుతారు. అదే సమయంలో తనతో కలిసేందుకు.. తనతో పొసగనట్లుగా ఉండే జీవన్ రెడ్డి లాంటి వారిని దగ్గరకు తీసుకునే కన్నా.. ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని సిద్ధం చేసుకునే వ్యూహంలో ఉన్నారు. వెరసి.. ఇద్దరి మధ్య దూరం పెరగటమే కాదు.. ఇప్పుడు పార్టీకి దూరమయ్యే పరిస్థితి. సీనియర్లతోకలిసి పని చేసేందుకు సీఎం రేవంత్ సిద్ధమవుతున్నా.. ఆయన్ను తక్కువగా చూడటం.. కలిసి పని చేసే విషయంలో ఆసక్తి లేని నేతలకు దూరంగా ఉంటూ.. వారిస్థానంలో కొత్త వారిని.. బలమైన వారిని రీప్లేస్ చేసుకోవటం సీఎం రేవంత్ లో కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితులు జీవన్ రెడ్డిని ఉక్కిరిబిక్కిరి చేసి.. గులాబీ కారులో ఎక్కేలా చేశాయని చెప్పొచ్చు.