తెలంగాణ ప్రజలకు బ్యాడ్ న్యూస్.. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు మరింత లేట్

Update: 2020-11-22 04:15 GMT
ఎందుకు చేస్తున్నారో? ఏం ఆశించి మార్పులు చేస్తున్నారో కానీ.. లక్షలాది మంది ప్రజలకు కొత్త తిప్పలు తెచ్చిపెడుతోంది ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం. ఆస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధించి సమూల మార్పులు చేయాలనుకోవటాన్ని ఎవరూ కాదనలేం. దేశంలో మరెక్కడా లేని రీతిలో అత్యంత సులువుగా ఆస్తుల రిజిస్ట్రేషన్ చేసేలా సీఎం కేసీఆర్ భారీ కసరత్తు చేయటం తెలిసిందే.

ఇందుకోసం ధరణి పేరుతో ఒక పోర్టల్ ను ఏర్పాటు చేయటం.. వ్యవసాయ భూముల  రిజిస్ట్రేషన్లను అందులో చేయించటం తెలిసిందే. ఇప్పటికే ప్రజలకు అందుబాటులోకి వచ్చినప్పటికి.. వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు చేయకుండా ఆపేసింది టీ సర్కారు. అది కూడా ఒకట్రెండు రోజులు.. వారాలు కాదు. ఏకంగా మూడు నెలలుగా ఇలాంటి పరిస్థితి నెలకొంది. దీంతో.. రియల్ ఎస్టేట్ వ్యాపారులు మొదలు.. సామాన్య ప్రజలంతా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

పిల్లల పెళ్లిళ్లు.. ఉన్నత చదువులు.. వైద్య ఖర్చుల కోసం.. ఇలా ఎన్నో కారణాల మీద ఆస్తులు అమ్మేవారు.. అదే సమయంలో కొనే వారు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. పలువురు ప్రవాసులు ఆస్తుల కొనుగోలు కోసం తెలంగాణకు వచ్చిన వారు.. అదేమీ లేకుండా పోవటంతో తిరిగి వెళ్లిపోతున్నారు. ఈకారణంగా వారు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు.

ఈ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నా.. ప్రభుత్వం నుంచి స్పందించని దుస్థితి. కొత్త మార్పులు చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు తప్పవు. అలా అని.. ప్రజలకు పెద్ద ఎత్తున సమస్యలు తలెత్తేలా వ్యవహరించటం కూడా సరైన పద్దతి కాదు. ఈ విషయాన్ని ప్రభుత్వం ఎందుకు పరిగణలోకి తీసుకోవటం లేదన్నది ప్రశ్న.ఇదిలా ఉంటే.. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లను ఈ నెల 23 నుంచి చేయాలన్న నిర్ణయాన్ని ఆ మధ్యన ప్రభుత్వం ప్రకటించింది. అయితే.. అదేమీ జరగటం లేదంటున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ నెలాఖరుకు మాత్రమే రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యే వీలుందని చెబుతున్నారు.

రిజిస్ట్రేషన్ల విషయంలో అనుసరించాల్సిన పద్దతులపై హైకోర్టులో కేసు విచారణలో ఉండటంతో పాటు మరికొన్ని సాంకేతిక అంశాలు కూడా ఉన్నట్లు చెబుతున్నారు. హైకోర్టు ఓకే చెబితే తప్పించి.. కొత్త విధానంలో రిజిస్ట్రేషన్లు ఉండవంటున్నారు. ఇదిలా ఉంటే.. ధరణి వెబ్ పోర్టల్ ను పకడ్బందీగా రూపొందించినట్లుగా అధికారులు చెబుతున్నారు. కారణాలు ఏమైనా.. 23 నుంచి మొదలవుతుందని చెప్పిన రిజిస్ట్రేషన్లు మరికొంత ఆలస్యం కావటం మాత్రం పెద్ద ఎత్తున ప్రభావం చూపుతుందన్న మాట వినిపిస్తోంది. ఆస్తులు అమ్మాలనుకునే వారికి..కొనుగోలు చేయాలనుకునే వారికి ప్రభుత్వ నిర్ణయం కచ్ఛితంగా బ్యాడ్ న్యూసే అవుతుందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News