వీఐపీలకు పొంచి ఉన్న ముప్పు.. అనంతపురం హనీట్రాప్ చెబుతుంది ఇదే..
అనంతపురం హనీట్రాప్ కేసు రాజకీయ వర్గాల్లో వణుకు పుట్టిస్తోంది. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఈ ఘటన గట్టి హెచ్చరికలు పంపుతోంది.;
అనంతపురం హనీట్రాప్ కేసు రాజకీయ వర్గాల్లో వణుకు పుట్టిస్తోంది. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఈ ఘటన గట్టి హెచ్చరికలు పంపుతోంది. 'హలో' అంటూ స్వీట్ వాయిస్ తో పలకరించే గొంతు వెనుక ఏముందో తెలియక ఏ మాత్రం టెమ్ట్ అయినా.. అడ్డంగా బుక్కయిపోవడం ఖాయమని అనంతపురం ఉదంతం రుజువు చేస్తోంది. ముఖ్యంగా ప్రజా ప్రతినిధులు, రాజకీయ నేతలు, కాస్త డబ్బు ఉండి సమాజంలో గౌరవంగా బతుకుతున్న వారే లక్ష్యంగా సాగుతున్న ఈ 'మాయాజాలం'పై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది.
అనంతలో ఏం జరిగింది అంటే..
అనంతపురంలో ఓ మహిళ మరికొందరితో కలిసి ముఠాగా ఏర్పడి హనీట్రాప్ తో భారీగా దందాలు చేస్తున్నట్లు తాజాగా బయటపడింది. ధనవంతులు, వృత్తి, ఉద్యోగాలు చేస్తున్నవారితోపాటు ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులను సైతం టార్గెట్ చేసిన ఈ ముఠా స్వీట్ వాయిస్ తో మగ్గులోకి దింపి, ఆ తర్వాత ఒంటరిగా ఉన్నామని ఇంటికి పిలిపించి నగ్న ఫొటోలు, వీడియోలు తీస్తూ బెదిరిస్తున్నట్లు వెల్లడైంది. ఓ బాధితుడు హనీట్రాప్ ముఠా దందాను తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగు చూసింది. దాదాపు వంద మందికి పైగా బాధితులు ఉండగా, కోట్ల రూపాయల మోసం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే కేవలం 20 మంది మాత్రమే ఫిర్యాదు చేయడంతో ఐదుగురిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.13 లక్షల నగదు, రెండు కత్తులు, ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ ముఠాతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో ఇద్దరు పోలీసులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
ప్రత్యర్థులు, పోటీదారులపై కుట్ర!
అనంతపురంలో వెలుగుచూసిన ఈ హనీట్రాప్ ఉదంతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా ఈ ఘటన రాజకీయ నాయకులకు తీవ్ర హెచ్చరికగా చెబుతున్నారు. ఏ పార్టీ వారైనా ఇలాంటి ట్రాప్ విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. అనంతపురంలో డబ్బు కోసం కక్కుర్తితో కొందరు నాయకులు కూడా లేడీ డాన్ తో చేతులు కలిపారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో రాష్ట్రంలో ఇలాంటి వ్యవహారాలు చాలానే చోటుచేసుకుంటున్నట్లు చెబుతున్నారు. రాజకీయ ప్రత్యర్థులను, పోటీదారులను అడ్డు తొలగించేందుకు కొందరు నాయకులు కూడా ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నట్లు ఆఫ్ ద రికార్డుగా చెబుతున్నారు.
ఎంతటి వారైనా కాంతదాసులే అన్న పెద్దల సామెతను గుర్తుచేస్తూ ప్రస్తుతం హనీట్రాప్ బాగోతాలు బయటపడుతున్నాయి. డబ్బుకు లొంగని వాళ్లు అమ్మాయిలకు లొంగక తప్పదని హనీట్రాప్ ముఠాలు బలంగా భావిస్తున్నాయని పోలీసులు చెబుతున్నారు. అందమైన ఫొటోలను డీపీలుగా పెట్టుకుని ముందు హాయ్ అంటూ పలకరించి, ఆపై మాటల్లో దింపి ఒంటరిగా ఇంటికి రప్పించుకుంటారని, చనువుగా ఉంటూ నగ్నంగా మార్చిన తర్వాత అప్పటికే మాటు వేసిన వారు వీడియోలు తీస్తున్నారని, ఆ తర్వాత విశ్వరూపం చూపుతున్నారని ఇటీవల వెలుగుచూసిన హనీట్రాప్ కేసుల్లో వెల్లడైంది. అనంతపురంలో కూడా దాదాపు అందరూ ఇలాంటి బాధితులుగానే చెబుతున్నారు.