కేజ్రీవాల్‌కు కోలుకోలేని దెబ్బ! బీజేపీలోకి రాఘవ్ చడ్ఢా టీమ్.. రాజ్యసభలో భారీ ‘చీలిక’..

భారత రాజకీయాల్లో పెను సంచలనం జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి అత్యంత విధేయుడిగా, ఆ పార్టీ జాతీయ ముఖచిత్రంగా ఉన్న రాఘవ్ చడ్ఢా బీజేపీలో చేరడం చారిత్రక మలుపు.;

Update: 2026-04-24 17:44 GMT

భారత రాజకీయాల్లో పెను సంచలనం జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి అత్యంత విధేయుడిగా, ఆ పార్టీ జాతీయ ముఖచిత్రంగా ఉన్న రాఘవ్ చడ్ఢా బీజేపీలో చేరడం చారిత్రక మలుపు. 2026, ఏప్రిల్ 24వ తేదీ జరిగిన ఈ పరిణామం కేవలం ఒక వ్యక్తి మార్పు మాత్రమే కాదు, రాజ్యసభలో ఒక పార్టీ చీలికగా కనిపిస్తోంది. ఢిల్లీ రాజకీయాల్లో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఆవిర్భావం నుంచి కీలక పాత్ర పోషించిన రాజ్యసభ ఎంపీ రాఘవ్ చడ్డా తన అనుచర ఎంపీలతో కలిసి భారతీయ జనతా పార్టీలో చేరారు. కేవలం రాఘవ్ చడ్ఢా మాత్రమే కాకుండా, పార్టీ వ్యూహకర్తగా గుర్తింపు దక్కించుకున్న సందీప్ పాఠక్, పంజాబ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అశోక్ మిఠల్ కూడా కాషాయ కండువా కప్పుకున్నారు. ఆప్‌కు రాజ్యసభలో ఉన్న 10 మంది ఎంపీల్లో ఏడుగురు (2/3 వంతు) తమకు మద్దతిస్తున్నారని, తాము రాజ్యసభలో బీజేపీతో విలీనం అవుతున్నామని చడ్ఢా ప్రకటించడం విశేషం. దీనివల్ల ఫిరాయింపుల నిరోధక చట్టం నుంచి కూడా వారికి రక్షణ లభించే అవకాశం ఉంది.

‘తప్పుడు పార్టీలో ఉన్న సరైన వ్యక్తిని’ చడ్ఢా ఆవేదన!

బీజేపీలో చేరిన అనంతరం రాఘవ్ చడ్ఢా చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలోని అంతర్గత విభేదాలను ఎండగట్టాయి. ‘నేను తప్పుడు పార్టీలో ఉన్న సరైన వ్యక్తిని అని ఆయన అన్నారు. తాను 15 ఏళ్ల యవ్వనాన్ని, రక్తాన్ని ధారబోసి పెంచిన పార్టీ నేడు తన సిద్ధాంతాల నుంచి పక్కకు తప్పుకుందని, అవినీతి, వ్యక్తిగత స్వార్థం పెరిగిపోయాయని ఆరోపించారు. దేశ హితం కోసం పనిచేసే పార్టీలో చేరాలనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ పరిణామం అకస్మాత్తుగా జరిగిందేమీ కాదు. ఏప్రిల్ 2వ తేదీ రాఘవ్ చడ్ఢాను రాజ్యసభలో ‘డిప్యూటీ ఫ్లోర్ లీడర్’ పదవి నుంచి ఆప్ తొలగించి, ఆయన స్థానంలో అశోక్ మిఠల్‌ను నియమించింది. చడ్ఢా సభలో మాట్లాడకుండా ఆంక్షలు విధించాలని పార్టీ కోరడం ఆయనకు అవమానంగా అనిపించింది. తనకు హర్భజన్ సింగ్, స్వాతి మాలీవాల్, రాజిందర్ గుప్తా, విక్రమ్ సాహ్ని వంటి మరో నలుగురు ఎంపీల సంతకాలు ఉన్న పత్రాలను రాజ్యసభ ఛైర్మన్‌కు సమర్పించామని చడ్ఢా వెల్లడించారు. అంటే రాజ్యసభలో ఆప్ బలం 10 నుంచి 3కి పడిపోయే ప్రమాదం ఏర్పడింది.

పంజాబ్ పై ప్రభావం..

పంజాబ్ నుంచి ఎన్నికైన ఎంపీలు బీజేపీలోకి వెళ్లడం ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద మలుపు. భగవంత్ మాన్ ప్రభుత్వంపై ఇప్పటికే ప్రతిపక్షాలు ఒత్తిడి తెస్తున్న తరుణంలో, కీలక నేతలు పార్టీని వీడడం ఆప్‌కు మైనస్. ముఖ్యంగా హర్భజన్ సింగ్ వంటి సెలబ్రిటీ ఎంపీలు కూడా ఈ గ్రూపులో ఉండడం బీజేపీకి పంజాబ్‌లో కొత్త బలాన్ని ఇస్తుంది.

బీజేపీకి ఎందుకు వెళ్లారు..?

రాజ్యసభలో బీజేపీకి పూర్తి మెజారిటీ సాధించే దిశగా ఇది ఒక పెద్ద అడుగు. రాఘవ్ చడ్ఢా వంటి విద్యావంతుడు, ఆర్థిక అంశాలపై పట్టున్న నేత బీజేపీలోకి రావడం వల్ల ఆ పార్టీకి పార్లమెంటులో గట్టి గొంతుక లభిస్తుంది. సందీప్ పాఠక్ వంటి వ్యూహకర్త రావడంతో రాబోయే ఎన్నికల్లో బీజేపీ తన ఎత్తుగడలను మరింత పదును పెట్టవచ్చు.

పార్టీలో రెండో నంబర్ నేతలుగా చలామణి అయిన వారే ఇలా తిరుగుబాటు చేయడం ఆప్ నాయకత్వ లోపాన్ని ఎత్తిచూపుతోంది. ఒకప్పుడు కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదిగిన ఆప్, ఇప్పుడు తన సొంత ఎంపీలనే కాపాడుకోలేని స్థితికి చేరుకుంది. రాఘవ్ చడ్ఢా వేసిన ఈ అడుగు దేశ రాజకీయాల్లో ‘కింగ్ మేకర్’ పాత్ర పోషించే దిశగా సాగుతుందో లేదో చూడాలి.

Tags:    

Similar News