సాయికృష్ణ మిస్ట‌రీ.. చంద్ర‌బాబు సీరియ‌స్‌.. ఏం జ‌రిగింది?

గాదె సాయికృష్ణ‌. గ‌త నాలుగు రోజుల నుంచి ఏపీలో పెద్ద ఎత్తున రేగుతున్న దుమారం. బుధ‌వారం.. సాయంత్రం మరింత‌గా ఈ కేసు వ్య‌వ‌హారం ముదిరింది.

Update: 2026-06-17 15:33 GMT

గాదె సాయికృష్ణ‌. గ‌త నాలుగు రోజుల నుంచి ఏపీలో పెద్ద ఎత్తున రేగుతున్న దుమారం. బుధ‌వారం.. సాయంత్రం మరింత‌గా ఈ కేసు వ్య‌వ‌హారం ముదిరింది. సాయికృష్ణ త‌ల్లి విజ‌య‌ల‌క్ష్మి.. మీడియా ముందుకు వ‌చ్చి భోరున రోదించారు. త‌న కుమారుడిని పోలీసులు చంపేశార‌ని.. క‌నీసం శ‌వాన్న‌యినా ఇవ్వాల‌ని ఆమె ప్రాధేయ ప‌డ్డారు. కాగా.. ఈ విష‌యానికి రాజకీయ రంగు కూడా పులుముకుంది. ఒక‌వైపు వైసీపీ నాయ‌కులు రాష్ట్ర వ్యాప్తంగా గురువారం నిర‌స‌న‌ల‌కు పిలుపునిచ్చారు. సాయికృష్ణ‌ను లాక‌ప్‌డెత్ చేశారంటూ..అంబ‌టి రాంబాబు స‌హా ప‌లువురు నాయ‌కులు ఆరోపించారు.

ఇక‌, మాజీ ఎంపీ కేశినేని నాని.. ఏకంగా విజ‌యవాడ పోలీసు క‌మిష‌న‌ర్‌ను స‌స్పెండ్ చేయాల‌ని డిమాండ్ చేశారు. దీంతో నేరు గా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఈ విష‌యంపై దృష్టి పెట్టారు. డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌హా.. డీజీపీని హుటాహుటిన త‌న క్యాంపు కార్యాల‌యానికి పిలుచుకుని.. సాయికృష్ణ వ్య‌వ‌హారంపై చ‌ర్చించారు. ఇంకోవైపు.. కొన్ని సోష‌ల్ మీడియాల‌లో సాయి కృష్ణ దారుణ‌మైన వ్య‌క్తి అంటూ.. అత‌నిపై 23 కేసులు ఉన్నాయ‌ని.. రౌడీషీట్‌కూడా ఉంద‌ని పేర్కొంటూ.. వైర‌ల్ అవుతున్న వీడియోను తొల‌గించాల‌ని ఆదేశించారు.

పోలీసుల‌పై విచార‌ణ చేయాల‌ని.. పేర్కొంటూ సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి నేతృత్వంలో ఓ క‌మిటీని నియ‌మించారు. ఈ మొత్తం వ్య‌వ‌హారంలో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న కృష్ణ‌లంక పోలీసు స్టేష‌న్ స‌ర్కిల్ ఇన్ స్పెక్ట‌ర్ నాగ‌రాజును వీఆర్‌కు పంప‌డం కాద‌ని.. స‌స్పెండ్ చేయాల‌ని ఆదేశించారు. పోలీసులు బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించ‌క‌పోతే.. తానే క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకుంటాన‌ని సీఎం చంద్ర‌బాబు డీజీపీని హెచ్చ‌రించిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. దీనిపై ఇప్ప‌టికే విచార‌ణ చేశామ‌ని, సాయికృష్ణకు భారీ నేర చ‌రిత్ర ఉంద‌ని పోలీసులు చెబుతున్నారు. మొత్తంగా ఈ వ్య‌వ‌హారం.. స‌ర్కారుకు తీవ్ర ఇబ్బందిగా మారింది.

అస‌లు ఏం జ‌రిగింది?

గాదె సాయికృష్ణ‌.. కృష్ణ‌లంక‌కు చెందిన 25 ఏళ్ల‌ యువ‌కుడు. అత‌నిపై రౌడీషీట్ ఉంద‌ని పోలీసులు చెబుతున్నారు. గంజాయి, మాద‌క‌ద్ర‌వ్యాల ర‌వాణా కేసులోనూ ఆయ‌న పేరు ఉంద‌ని అంటున్నారు. మ‌హిళ‌ల‌ను వేధించిన కేసులు, చైన్ స్నాచింగ్ స‌హా ప‌లు దొంగ‌త‌నాల కేసులు ఉన్నాయ‌ని పేర్కొంటున్నారు. అయితే.. ఈ కేసుల విచార‌ణ‌కు స‌హ‌క‌రించ‌డం లేద‌ని పేర్కొంటూ.. సీఐ నాగ‌రాజు.. గ‌త నెల‌లో మార్కాపురంలో ఉంటున్న సాయికృష్ణ‌ను పోలీసు స్టేష‌న్‌కు తీసుకువ‌చ్చార‌ని అత‌ని త‌ల్లి విజ‌య‌ల‌క్ష్మి చెబుతున్నారు. అప్ప‌టి నుంచి త‌మ కుమారుడు క‌నిపించ‌డం లేద‌ని.. చంపేశార‌ని ఆమె ఆరోపిస్తున్నారు. క‌నీసం త‌మ కుమారుడి శ‌వాన్న‌యినా అప్ప‌గించాల‌ని వేడుకుంటున్నారు.

హైకోర్టు జోక్యం

ఈ కేసు హైకోర్టు వ‌ర‌కు వెళ్లింది. పోలీసులు అరెస్టు చేశారా? లేదా? అనికోర్టు నిలదీసింది. దీనికి పోలీసులు భిన్న‌మైన వాద‌న వినిపించ‌డంతో కోర్టు ఆగ్ర‌హంవ్య‌క్తం చేసింది. ఈ నెల 29 లోగా త‌మ ముందు సాయికృష్ణను హాజ‌రు ప‌ర‌చాల‌ని ఆదేశించింది. పోలీసుల తీరుపై న్యాయ‌స్థానం తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించింది. ``మీకు కూడా క‌నిపించ‌నంత‌గా వ్య‌క్తులు అదృశ్య మ‌వుతున్నా రా?`` అని ఆగ్ర‌హించింది. ఈ విష‌యంంలో వైసీపీ జోక్యం చేసుకుంది. సాయికృష్ణ కాపుసామాజిక వ‌ర్గానికి చెందిన యువ‌కుడ‌ని .. పేర్కొంటూ అంబ‌టి రాంబాబు సుదీర్ఘ‌ప్రెస్‌మీట్ పెట్టారు. సాయికృష్ణ‌ను పోలీసులు చంపేశార‌ని త‌న‌కు స‌మాచారం ఉంద‌న్నా రు. ఆయ‌న శ‌వాన్ని కూడా వారే ద‌హ‌నం చేశార‌ని తెలుస్తోంద‌ని భారీ ఆరోప‌ణ‌లు గుప్పించారు. మొత్తంగా ఈ వ్య‌వ‌హారం స‌ర్కారుకు ఇబ్బందిగా మార‌డంతో నేరుగా సీఎం జోక్యం చేసుకోవాల్సి వ‌చ్చింది.

Tags:    

Similar News