టెలిగ్రామ్ బ్యాన్ : ప్రభుత్వం చెప్తున్న రీజన్ చాలా సీరియస్... సీనియర్ జర్నలిస్టు రవిప్రకాష్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

పాపులర్ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ పై తాత్కాలిక నిషేధం విధించడం దేశవ్యాప్తంగా కాకరేపుతోంది. ఈ విషయమై ప్రభుత్వ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య తీవ్రమైన డైలాగ్ వార్ నడుస్తోంది.

Update: 2026-06-17 15:30 GMT

పాపులర్ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ పై తాత్కాలిక నిషేధం విధించడం దేశవ్యాప్తంగా కాకరేపుతోంది. ఈ విషయమై ప్రభుత్వ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య తీవ్రమైన డైలాగ్ వార్ నడుస్తోంది. బలమైన కారణాలు లేకుండానే ప్రభుత్వం తమ ప్లాట్‌ఫారమ్‌ను బ్యాన్ చేసిందని టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ చేసిన ఆరోపణలపైనా విస్తృత చర్చ జరుగుతోంది. లక్షల మంది విద్యార్థుల శ్రేయస్సును కోరే టెలిగ్రామ్ పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుందని ప్రముఖ జర్నలిస్టు రవిప్రకాష్ చేసిన ట్వీట్ ఆలోచనలు రేకెత్తిస్తోంది. నీట్ పేపర్ లీక్ తోపాటు టెలిగ్రామ్ పై చర్యలు తీసుకోవడంపై రవిప్రకాష్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ఈ నిషేధం వెనుక ఉన్న అసలు తీవ్రతను, విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న ఒక పెద్ద మాఫియా నెట్‌వర్క్‌ను ఆయన తన విశ్లేషణలో ఎండగట్టారు.

ఇదో భారీ ఫ్రాడ్ నెట్‌వర్క్

టెలిగ్రామ్‌ను ఇండియా రీజన్ లేకుండానే బ్యాన్ చేసిందని పావెల్ దురోవ్ ఆరోపణలను జర్నలిస్టు రవిప్రకాష్ కొట్టిపడేశారు. ఈ సమస్య కేవలం కొన్ని క్వశ్చన్ పేపర్లు లీక్ అవ్వడానికో, లేక ఎవరో నలుగురు వ్యక్తులు వాటిని షేర్ చేసుకోవడానికో పరిమితమైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. దీని వెనుక ఒక పక్కా ప్లానింగ్‌తో నడుస్తున్న పెద్ద నెట్‌వర్క్ ఉందని ఆరోపించారు. టెలిగ్రామ్‌లో ‘‘పేపర్ లీకుడ్ నీట్, రీ నీట్-2026” లాంటి పేర్లతో బహిరంగంగానే ఛానళ్లు వెలిసిన అంశాన్ని రవిప్రకాశ్ ఎత్తిచూపారు. పరీక్షల టెన్షన్‌లో, ఒత్తిడిలో ఉన్న అమాయక స్టూడెంట్స్, వారి తల్లిదండ్రుల బలహీనతలను ఆసరాగా చేసుకుని ఈ కేటుగాళ్లు వేలల్లో, లక్షల్లో డబ్బులు గుంజారని, నకిలీ ప్రశ్నపత్రాలను నిజమైన లీక్డ్ పేపర్లుగా నమ్మించి భారీ దోపిడీకి తెరలేపారని ఆరోపించారు.

టెలిగ్రామ్ ఫీచర్లే వీరికి వరం..

టెలిగ్రామ్‌లో ఉన్న 'మెసేజ్ ఎడిట్' ఆప్షన్‌ను ఈ ఫ్రాడ్ గ్యాంగ్స్ తమకు అనుకూలంగా మార్చుకున్నాయని రవిప్రకాష్ వాదిస్తున్నారు. పరీక్ష ముగిసిన తర్వాత, అంతకుముందు పెట్టిన పాత పోస్టులను ఎడిట్ చేసి, ఒరిజినల్ క్వశ్చన్ పేపర్‌ను అక్కడ ప్లేస్ చేశారు. దీనివల్ల పరీక్షకు ముందే పేపర్ లీక్ అయిందనే భ్రమను కల్పించి, తదుపరి పరీక్షల కోసం విద్యార్థుల నుంచి మరింత పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడ్డారని తెలిపారు. చాలా ఛానల్స్‌ను డిలీట్ చేశామని, ఎడిట్ లేబుల్స్ మార్చామని పావెల్ దురోవ్ సమర్థించుకుంటున్నా.. కేవలం ఆ పైపై చర్యలు చాలవని ఎన్టీఏ చెప్పడాన్ని రవిప్రకాష్ సమర్థించారు. దేశంలో అత్యంత కీలకమైన రీ-ఎగ్జామ్‌కు ముందు ఇంత స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోకపోతే లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుందని తెలిపారు.

ప్లాట్‌ఫారమ్ బాధ్యత కాదా?

ఇది టెలిగ్రామ్ వర్సెస్ ఇండియా మధ్య జరుగుతున్న యుద్ధం కాదని రవిప్రకాష్ తన ట్వీట్ లో అభిప్రాయడ్డారు. కళ్ల ముందే ఇంత పెద్ద ఫ్రాడ్ జరుగుతుంటే, దేశ భవిష్యత్తు అయిన విద్యార్థులు మోసపోతుంటే.. సదరు ప్లాట్‌ఫారమ్ చేతులు ముడుచుకుని కూర్చోవచ్చా? అంటూ ఫైర్ అయ్యారు. 'ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్' లేదా 'యూజర్ ప్రైవసీ' పేరుతో నేరగాళ్లకు అడ్డాగా మారుతుంటే యాజమాన్యం బాధ్యత వహించాలా వద్దా? అనేదే ఇక్కడ అసలైన పాయింట్ అంటూ ఆయన ఎత్తిచూపారు. ఈ తాత్కాలిక బ్యాన్‌ను కొందరు సపోర్ట్ చేయకపోవచ్చు, కానీ ప్రభుత్వం చెప్తున్న రీజన్ మాత్రం అత్యంత సీరియస్ అయినదిగా తేల్చిచెప్పారు.

ఈ నిషేధం జరిగిన కొన్ని గంటలకే దురోవ్ ఈ వివాదాన్ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లారని రవిప్రకాష్ ఆరోపించారు. భారత టెలికాం దిగ్గజం రిలయన్స్ బీజీపీ హైజాకింగ్ కి పాల్పడిందని, ఇండియా వెలుపల కూడా టెలిగ్రామ్ పనిచేయకుండా అడ్డుకుందని ఆరోపించారు. ఈ గవర్నమెంట్ యాక్షన్ వెనుక కొన్ని పెద్ద కంపెనీల బిజినెస్ ఇంట్రెస్ట్‌లు ఉన్నాయా? అని కూడా ఆయన ప్రశ్నించిన విషయాన్ని రవిప్రకాష్ తన ట్వీట్ లో ప్రస్తావించారు. కాకపోతే ఈ ఆరోపణలకు సంబంధించి ఎలాంటి ప్రూఫ్స్ లేవని,

రిలయన్స్ కూడా దీనిపై ఇప్పటివరకు రియాక్ట్ అవ్వలేదని తన ట్వీట్ లో వివరించారు రవిప్రకాష్. ఇక మొత్తానికి దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న టెలిగ్రామ్ నిషేధంపై సీనియర్ జర్నలిస్టుగా రవిప్రకాశ్ లేవనెత్తిన అంశాలు ఆలోచనలకు గురిచేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ ట్వీట్ ప్రభుత్వానికి కూడా పెద్ద ఓదార్పుగా భావించాలని వ్యాఖ్యానిస్తున్నారు.

కానీ, పావెల్ దురోవ్ చేసిన ఈ సంచలన ఆరోపణలకు సంబంధించి ఎలాంటి టెక్నికల్ ప్రూఫ్స్ గానీ, ఆధారాలు గానీ ఆయన బయటపెట్టలేదు. అటు రిలయన్స్ సంస్థ కూడా ఈ ఆరోపణలపై ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.

ముగింపు:

సాంకేతిక పరిజ్ఞానం అనేది సమాచార మార్పిడికి ఉపయోగపడాలి కానీ, నేరాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారకూడదు. దురోవ్ ఆరోపిస్తున్నట్టుగా ఇందులో కార్పొరేట్ రాజకీయం ఉందా లేదా అనేది పక్కన పెడితే.. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న టెలిగ్రామ్ ఫ్రాడ్ నెట్‌వర్క్‌ను అణచివేయడానికి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వెనుక బలమైన, నైతికమైన కారణాలు ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. జర్నలిస్ట్ రవిప్రకాష్ అన్నట్టు.. ప్లాట్‌ఫారమ్‌ల బాధ్యత ఎక్కడ మొదలవుతుందనే దానికి ఇప్పుడు సమాధానం దొరకాల్సి ఉంది.



Tags:    

Similar News