రాయదుర్గం భూముల వేలం....హైకోర్టులో ఎస్‌బిఐ పిటిషన్?

హైదరాబాద్ లో రాయదుర్గం భూముల వేలం మీద బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి సంచలనం రేకెత్తించింది.

Update: 2026-06-17 19:03 GMT

హైదరాబాద్ లో రాయదుర్గం భూముల వేలం మీద బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి సంచలనం రేకెత్తించింది. రాయదుర్గం భూమి వేలంలో తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం తమకు చెందిన అయిదు ఎకరాల భూమిని విక్రయించిందని ఆరోపిస్తూ తెలంగాణ హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ ని ఎస్బీఐ దాఖలు చేసింది. ఈ పిటిషన్ మీద విచారణను హైకోర్టు గురువారం చేపట్టనుంది.

ఎకరం 234 కోట్లు :

ఇదిలా ఉంటే రాయదుర్గం భూముల వేలం ఎంతటి సంచలనం సృష్టించాయో అందరికీ తెలిసిందే. ఏకంగా ఎకరం 234 కోట్ల రూపాయలుగా అదిరిపోయే ధరతో రెండు తెలుగు రాష్ట్రాలలో వైరల్ అయింది. ఇక ఈ భూముల వేలం ద్వారా తెలంగాణా ప్రభుత్వానికి వేలాది రూపాయల ఆదాయం కూడా సమకూరింది. ఇక హైదరాబాద్ నగరంలోనే అత్యంత ఖరీదైన ప్రాంతంగా రాయదుర్గం మారిపోయింది కూడా. ఈ భూములకు ఇంతటి విలువ ఉందా అన్నది టీజీఐఐసీ వేలం పాటను చూసిన తరువాతనే అందరికీ అర్థం అయింది. అలాంటి భూముల విషయంలో బ్యాకింగ్ దిగ్గజ సంస్థ ఎస్బీఐ కేసు వేయడమే మరో విశేషం. ఈ భూములలో తమకు కూడా కొంత భాగం ఉందని ఎస్బీఐ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది.

సరిగ్గా ఇరవై రోజుల క్రితం :

ఇదిలా ఉంటే రాయదుర్గం పరిధిలోని నాలెడ్జ్ సిటీలో ఉన్న సర్వే నంబర్ 83/1లోని అత్యంత విలువైన ప్రభుత్వ భూములను తెలంగాణ ప్రభుత్వం మే నెల 28న బహిరంగ వేలం ద్వారా విక్రయించింది. టీజీఐఐసీ ద్వారా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ఈ వేలం లో రాయదుర్గంలోని 11.38 ఎకరాల భూమి ముందు పెట్టింది. అలా ఈ మొత్తం వేలం ద్వారా ప్రభుత్వ ఖజానాకు 2,529 కోట్ల రూపాయలు సమకూరాయి అన్న మాట. నిజానికి టీజీఐఐసీ ఒక్కో ఎకరానికి కనీస ధరగా 170 కోట్ల రూపాయలను మాత్రమే నిర్ణయించింది. కానీ అనూహ్యంగా వేలం పాటలో అది కాస్తా 234 కోట్ల రూపాయలు పై దాటేసింది. ఈ భూమిని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ గౌరా వెంచర్స్ ఎకరం భూమిని ఏకంగా 237 కోట్ల రూపాయలకు దక్కించుకుని ఉభయ తెలుగు రాష్ట్రాలలో అతి పెద్ద సంచలనం రేపింది.

ఆ భూమి మాదంటూ :

ఇంతలా సంచలన సృష్టించడం ఒక ఎత్తు అయితే ఒక ప్రభుత్వం వేసిన వేలం పాటలోని భూమిలో కొంత భాగం తమదే అంటూ ఎస్బీఐ ఇపుడు కోర్టులో కేసు వేయడం మరో సంచలనంగా మారింది. సర్వే నంబర్ 83/1 పరిధిలోని భూమిలో తమ బ్యాంక్‌కు అయిదుఎకరాల స్థలం ఉందని ఎస్బీఐ క్లెయిం చేస్తూ కోర్టులో పిటిషన్ వేయడం విశేషం. అంతే కాదు ఈ భూమికి సంబంధించిన హక్కుభుక్తాలు అన్నీ తమ వద్దనే ఉన్నాయని కూడా ఎస్బీఐ చెబుతోంది. తమకు ఏ మాత్రం సమాచారం ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ భూమిని వేలం వేయడమేంటని ఎస్బీఐ అంటోంది. అందుకే ఈ మొత్తం వేలం ప్రక్రియనే రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేసింది.

కోర్టు వైపు చూపు :

మరి ఎస్బీఐ దాఖలు చేసిన పిటిషన్ మీద హైకోర్టు ఏ విధంగా తీర్పు చెబుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. రాయదుర్గం భూములలో ఎస్బీఐకి చెందినవి ఉన్నాయన్న సంగతి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదా అన్నది ఒక ప్రశ్న అయితే దిగ్గజ బ్యాంక్ అయిన ఎస్బీఐ ఈ విషయంలో అన్ని ఆధారాలూ ఉన్నాయని చెప్పడం మరింత ఆసక్తిని పెంచుతోంది. మొత్తానికి ఏమి జరుగుతుంది అన్నది చూడాల్సి ఉంది అని అంటున్నారు.

Tags:    

Similar News