ఎంఎస్ అబ్బాయిలూ జాగ్రత్త! ఒక్క పొరపాటు.. జీవితాంతం వీసా వేటు

విదేశీ విద్య, కోటి ఆశలు, లక్షల రూపాయల అప్పులు. కానీ క్షణికావేశం, అజాగ్రత్త కారణంగా మొత్తం జీవితాన్ని తలకిందులు చేస్తోంది.;

Update: 2026-04-24 17:33 GMT

విదేశీ విద్య, కోటి ఆశలు, లక్షల రూపాయల అప్పులు. కానీ క్షణికావేశం, అజాగ్రత్త కారణంగా మొత్తం జీవితాన్ని తలకిందులు చేస్తోంది. అమెరికా వంటి దేశాల్లో ఉన్నత చదువుల కోసం వెళ్లే భారతీయ విద్యార్థులు ఇటీవల కొన్ని అనవసర చిక్కుల్లో పడి తమ కెరీర్‌ను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక యథార్థ సంఘటన విదేశాల్లో ఉన్న మన 'అబ్బాయిలకు' ఒక కనువిప్పుగా చెబుతున్నారు. ఓ విద్యార్థి మూడు వరుస ట్వీట్లతో అమెరికాలో మన విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించడం నెటిజన్లను ఆలోచనలకు గురిచేస్తోంది. చదువు కోసం అమెరికాకు వెళ్లిన వారు, అమ్మాయిలను తమ రూములకు తీసుకువెళ్లి ఎలా నష్టపోతున్నారో వివరిస్తూ ఆ విద్యార్థి ‘ఎక్స్’లో చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

ఏం జరిగింది?

ఒక భారతీయ విద్యార్థి ఎంఎస్ చదువుకుంటూ పార్ట్ టైమ్ పని కోసం ఒక మాల్‌లో చేరాడు. అక్కడ పరిచయమైన ఒక నల్లజాతి అమ్మాయితో స్నేహం పెంచుకున్నాడు. ఇద్దరూ కలిసి బయట తిరగడం, సినిమాలకు వెళ్లడం వంటివి చేశారు. ఆ చనువుతోనే ఒకట్రెండు సార్లు ఆమెను తన రూమ్‌కు కూడా తీసుకువెళ్లాడు. అంతా సవ్యంగానే ఉందనుకున్న సమయంలో, ఒకరోజు అనూహ్యంగా ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతను తనపై బలవంతం చేశాడని కేసు పెట్టింది. పోలీసులు విచారణకు వచ్చే లోపే భయంతో సదరు విద్యార్థి ఇండియాకు పారిపోయి వచ్చాడు. ఫలితం? ఇప్పుడు అతని వీసా రద్దయింది, లీగల్ స్టేటస్ పోయింది. తిరిగి ఆ దేశంలో అడుగుపెట్టే అవకాశం శాశ్వతంగా మూసుకుపోయిందని అతడు ట్వీట్ చేశాడు.

ముఖ్యమైన మూడు సూత్రాలు

ఇలా అమెరికా వదిలిన విద్యార్థి సమస్యను ప్రస్తావిస్తూ చేసిన ఆ ట్వీట్ కు కొనసాగింపుగా మరో రెండు ట్వీట్లు చేసిన అతడు, ఎంఎస్ విద్యార్థులు ఎలాంటి పొరపాట్లు చేయకూడదో స్పష్టంగా వివరించాడు. ముఖ్యంగా పరిచయం అయిన ప్రతి ఒక్కరినీ గుడ్డిగా నమ్మొద్దని సలహా ఇచ్చాడు. విదేశాల్లో స్థానికులతో స్నేహం చేసేటప్పుడు వారి ప్రవర్తనను గమనించాలని, కేవలం మాల్స్‌, కెఫే ల్లో జరిగే పరిచయాలతో భవిష్యత్తును పణంగా పెట్టుకోవద్దని అప్రమత్తం చేశాడు.

అంతేకాకుండా ఎవరినైనా గదికి లేదా అపార్ట్‌మెంట్‌కు ఆహ్వానించినప్పుడు, అక్కడ ఏదైనా వివాదం జరిగితే అది చట్టపరంగా చాలా ఇబ్బందికరంగా మారుతుందని హెచ్చరించాడు. ఏవైనా మీటింగ్స్ లేదా డేట్స్ ఉంటే పబ్లిక్ ప్రదేశాల్లో హోటల్స్ లేదా పార్కులలో కలవడమే సురక్షితమని చెప్పాడు. ప్రైవేట్ ప్రదేశాల్లో జరిగిన సంఘటనలకు సాక్ష్యాలు ఉండవు కాబట్టి, అవతలి వారు చేసే ఆరోపణలే చట్టం ముందు బలంగా నిలుస్తాయని అతడు ఆ ట్వీట్ లో తెలిపాడు.

ఇక విదేశాల్లో 'సమ్మతి' అనే అంశంపై చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. ఆమెకు ఇష్టమే కదా అని అనుకుంటే భవిష్యత్తులో కోర్టులో ఇబ్బందులు ఎదురవవచ్చునని అంటున్నారు. చిన్న పొరపాటు జరిగినా అది 'క్రిమినల్ రికార్డ్'గా మారుతుంది. ఒక్కసారి ఆ దేశం విడిచి పారిపోతే, మీరు 'నిందితుడి'గానే ముద్ర పడతారు. మళ్లీ వీసా రావడం అసాధ్యమంటూ ఎక్స్ పోస్టులో రాసుకొచ్చాడు. లక్షల రూపాయల అప్పులు చేసి, తల్లిదండ్రుల కలలను మోస్తూ విదేశాలకు వెళ్లినప్పుడు మన మొదటి ప్రాధాన్యత చదువు, కెరీర్ మాత్రమే అయి ఉండాలని, క్షణికానందం కోసం చేసే పనులు జీవితకాలపు శిక్షగా మారకూడదని ఆ విద్యార్థి తోటివారికి సలహా ఇవ్వడం ఆకట్టుకుంటుంది.

Tags:    

Similar News