అవసరమైతే ఒంటరిగానే.. వైసీపీలో సంచలనం.. !
గత ఎన్నికల్లో అధినేత మాట విన్నారు. నియోజకవర్గాలు మారాలి అని శాసిస్తే ఆయన చెప్పినట్టుగానే నియోజకవర్గాలను వదులుకొని వేరే నియోజకవర్గాలకు వెళ్లి పోటీ చేశారు.;
గత ఎన్నికల్లో అధినేత మాట విన్నారు. నియోజకవర్గాలు మారాలి అని శాసిస్తే ఆయన చెప్పినట్టుగానే నియోజకవర్గాలను వదులుకొని వేరే నియోజకవర్గాలకు వెళ్లి పోటీ చేశారు. గెలిచిన వాళ్ళ కంటే కూడా ఈ లెక్కలో భారీగా నష్టపోయిన నాయకులు చాలామంది ఉన్నారు. క్షేత్రస్థాయిలో బలమైన సామాజిక వర్గం ఉండి కూడా ఆ నియోజకవర్గాలను వదులుకొని వేరే నియోజకవర్గానికి వెళ్లి పోటీ చేసిన అనేకమంది వైసీపీ నాయకులు గత ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు.
ఉదాహరణకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో బలమైన వ్యాపార వర్గం ఉంది. ఈ వర్గం అప్పటి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు మద్దతు పలికింది. పైగా బాండింగ్ కూడా బాగానే ఉంది. ఆయన అక్కడ పోటీ చేసి ఉంటే గెలిచేవారు అన్న చర్చ కూడా కొన్నాళ్లు నడిచింది. అయితే అనూహ్యంగా ఆయనను తీసుకువెళ్లి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి కేటాయించడం ఇదే సమయంలో అప్పటివరకు అసలు ఉనికిలో కూడా లేని ఒక ముస్లిం మైనారిటీ వ్యక్తిని తీసుకువచ్చి కొత్తగా నిలబెట్టడం తెలిసిందే.
ఇది వైసీపీకి భారీ ఎదురు దెబ్బ తగిలేలా చేసింది. ఇలా ఈ ఒక్క చోటే కాదు రాష్ట్రవ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో వైసిపి ఇలాంటి ప్రయోగాలు చేసింది. అప్పట్లో సర్దుకుపోయిన నాయకులు మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు అనేది ప్రశ్న. వచ్చే ఎన్నికల నాటికి ఖచ్చితంగా తాము ఎంచుకున్న నియోజకవర్గాల్లోనే పోటీ చేయాలని మెజారిటీ నాయకులు అంచనాకు వచ్చేశారు. ఈ దఫా అధినేత కాదంటే ఒంటరి పోరాటం చేసేందుకైనా సిద్ధంగా ఉన్నామని సీమలో ఇద్దరు ముగ్గురు నాయకులు ఆఫ్ ది రికార్డుగా మీడియాకు చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగించింది.
వచ్చే ఎన్నికల్లో ప్రయోగాలకు అవకాశం లేకుండా బలమైన క్షేత్రస్థాయిలో ఓటు బ్యాంకు ఉన్న నాయకులను ఎంపిక చేయాలనేది నాయకులు సూచిస్తున్న విషయం. అలా కాకుండా ఎవరో సలహాదారులు చెప్పారని, రాజకీయ వ్యూహకర్తలు చెప్పారని తమ రాజకీయ భవితవ్యాన్ని బలిచేయవద్దని కోరుతున్నారు. వైసీపీ నేతలు వచ్చే ఎన్నికలు నాటికి తాము ఎంచుకున్న చోటే పోటీ చేసేలా అధిష్టానం పై ఒత్తిడి తీసుకువచ్చినా ఆశ్చర్యం లేదు. జగన్ కు కూడా ఈ విషయంలో తప్పని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మరి ఆయన ఏం చేస్తారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది చూడాలి.