వివాదాలతో వార్తల్లో నిలవడమే గొప్ప నాయకత్వ లక్షణమా?

ఉదయనిధి స్టాలిన్ వివాదాలకు కేంద్రబిందువుగా మారడం ఇదే మొదటిసారేమీ కాదు.

Update: 2026-08-04 19:30 GMT

రాజకీయాల్లో నిరంతరం ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్య చేస్తూ వార్తల్లో నిలవడమే గొప్ప నాయకత్వ లక్షణమా? ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిపై వ్యక్తిగత దాడి చేస్తూ..అభ్యంతరకర కామెంట్లు చేస్తే ప్రజలు నిజంగానే మెచ్చుకుంటారా? ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు ఇదే పెద్ద ప్రశ్నగా మార్చాయి. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ - నటి త్రిషను ఉద్దేశించి డీఎంకే యువనేత ఉదయనిధి స్టాలిన్ చేసిన తీవ్ర వ్యాఖ్యలు.. ఆ తర్వాత ఆయన అరెస్టు కావడం వంటి పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద దుమారాన్నే రేపాయి. అయితే ఈ తరహా దూకుడు రాజకీయాలు యువనాయకుడికి సీఎం పీఠాన్ని తెచ్చిపెడతాయా లేక ప్రతికూలంగా మారుతాయా అనేది విశ్లేషించాల్సిన అంశం.

ఉదయనిధి స్టాలిన్ వివాదాలకు కేంద్రబిందువుగా మారడం ఇదే మొదటిసారేమీ కాదు. గతంలో ఏఐఏడీఎంకే నేత శశికళ కాళ్లను తాకడానికి అప్పటి సీఎం పళనిస్వామి ప్రయత్నించారని వ్యాఖ్యానించి పరువు నష్టం దావాను ఎదుర్కొన్నారు. ఆ తర్వాత సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులతో పోల్చి దేశవ్యాప్తంగా పెద్ద వివాదానికి తెరలేపారు. తాజాగా ఇప్పుడు సీఎం విజయ్ వ్యక్తిగత జీవితంపై చేసిన వ్యాఖ్యలతో అరెస్టు వరకు వెళ్లారు. శశికళ, సనాతనం నుంచి నేటి త్రిష ఎపిసోడ్ వరకు ఆయన నిరంతరం వివాదాలకు కేరాఫ్ గా వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు.

వరుస వివాదాలతో మీడియా దృష్టిని, ప్రజల శ్రద్ధను తనవైపు తిప్పుకోవడంలో ఉదయనిధి సక్సెస్ అయి ఉండవచ్చు. ఈ అరెస్టుతో పాజిటివ్‌గానో... నెగెటివ్‌గానో ఆయన పేరు తమిళనాడు అంతటా గట్టిగా మార్మోగింది. అయితే కేవలం సంచలనాత్మక వ్యాఖ్యలు చేయడం... ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వ్యక్తిగత దూషణలకు దిగడం వల్ల ఒక నాయకుడికి పరిణతి ఉందనే భావన ప్రజల్లో కలుగుతుందా అనేది సందేహమే. కేవలం వివాదాలు సృష్టించడం వల్ల తాత్కాలికంగా పబ్లిసిటీ వచ్చినా... అది ఒక నాయకుడికి ఆమోదయోగ్యతను.. ముఖ్యమంత్రి స్థానానికి కావాల్సిన గౌరవాన్ని తెచ్చిపెట్టదు.

ఈ కొత్త రాజకీయ పరిణామాల నుంచి నేటి తరం యువత.. వర్ధమాన రాజకీయ నాయకులు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ప్రజా సమస్యలపై పోరాడటం... విధానపరమైన విమర్శలు చేయడం రాజకీయాల్లో ఆరోగ్యకరమైన పద్ధతి. కానీ ప్రత్యర్థుల వ్యక్తిగత జీవితాలను, మహిళల గౌరవాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం ఏమాత్రం శ్రేయస్కరం కాదనే సందేశం ఈ ఘటన ద్వారా స్పష్టమవుతోంది. రాజకీయం అనేది వ్యక్తిగత కక్షసాధింపుల వేదికగా కాకుండా ప్రజా సంక్షేమం చుట్టూ తిరిగినప్పుడే నాయకుడికి నిజమైన గుర్తింపు లభిస్తుంది.

భవిష్యత్తులో సీఎం విజయ్ తర్వాత స్థానాన్ని భర్తీ చేసే అర్హత లేదా సీఎం అయ్యే అవకాశాలు ఉదయనిధికి ఉన్నాయా అంటే.. అది కేవలం ఆయన చేసే వివాదాస్పద వ్యాఖ్యలపై కాకుండా.. ఆయన చూపించే పాలనా పరిణతి, ప్రజాదరణపైనే ఆధారపడి ఉంటుంది. ప్రతిపక్ష నాయకుడిగా నిలకడైన వ్యూహాలు, ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారిస్తేనే ప్రజలు ఆయనను కాబోయే సీఎంగా స్వీకరిస్తారు. అలా కాకుండా కేవలం నోటి దూకుడు, వివాదాస్పద శైలినే నమ్ముకుంటే అది ఉద‌య‌నిధి రాజకీయ భవిష్యత్తుకే ముప్పుగా మారే ప్రమాదం ఉంది.

Tags:    

Similar News