జగన్ కు వేదాశ్వీరచనం.. అర్చకులకు షోకాజ్, ప్రతికారేచ్ఛేనా?

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి ఒంటిమిట్ట రామాలయం అర్చకులు వేదాశీర్వచనం ఇవ్వడం రాజకీయంగా తీవ్ర వివాదాస్పదమవుతోంది.;

Update: 2026-04-24 17:20 GMT

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి ఒంటిమిట్ట రామాలయం అర్చకులు వేదాశీర్వచనం ఇవ్వడం రాజకీయంగా తీవ్ర వివాదాస్పదమవుతోంది. టీటీడీ నిబంధనలు అతిక్రమించి ముగ్గురు అర్చకులు వ్యవహరించారని, ఇది ఆలయ క్రమశిక్షణ నియమాలు ఉల్లంఘనేనంటూ ఆలయ అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని, ఆ వివరణ సంతృప్తికరంగా లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని ఆ నోటీసుల్లో హెచ్చరించారు. దీంతో ఈ ఘటన రాజకీయంగా తీవ్ర దుమారానికి కారణమవుతోంది. అంతేకాకుండా ప్రతికారేచ్ఛతో ఏపీ రాజకీయాలు పరాకాష్టకు చేరుకున్నాయని వ్యాఖ్యానిస్తున్నారు.

ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల కారణంగా ప్రతి చిన్న విషయం వివాదాస్పదమవుతోంది. ముఖ్యంగా ఆలయ మర్యాదలు, సంప్రదాయాలు కూడా రాజకీయ యుద్ధానికి వేదికగా మారుతున్నాయని వ్యాఖ్యానిస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఈ సంస్కృతి పెరిగిపోతోందని వ్యాఖ్యానిస్తున్నారు. నేతలు తమ రాజకీయం కోసం మతాన్ని కూడా వాడుకుంటడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోందని అంటున్నారు. గతంలో ఇలాంటి పద్ధతి ఉండేది కాదని అంటున్నారు. ప్రస్తుతం అధికార, ప్రతిపక్షాల మధ్య ఉన్న రాజకీయ వైరం కారణంగా ఒంటిమిట్ట ఆలయానికి చెందిన ముగ్గురు అర్చకులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.

అసలేం జరిగింది అంటే..?

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి కడప జిల్లా పర్యటనలో భాగంగా గత మంగళవారం తన సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటించారు. ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సమయంలో టీటీడీ పరిధిలో నడుస్తున్న ఒంటిమిట్ట రామాలయానికి చెందిన ముగ్గురు అర్చకులు పులివెందుల వెళ్లి మాజీ సీఎం జగన్మోహనరెడ్డికి వేదాశ్వీరవచనం అందజేశారు. దీనిపై ఫొటోలు వైరల్ కావడంతో ప్రభుత్వం సీరియస్ అయింది. అర్చకులు ఏ కారణంతో మాజీ సీఎం నివాసానికి వెళ్లారు. ఆలయంలో పనిచేయాల్సిన అర్చకులకు పులివెందుల వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందనే అంశంపై ప్రభుత్వం సీరియస్ అయినట్లు చెబుతున్నారు. దీనిపై అర్చకుల వివరణ కోరుతూ నోటీసులు ఇవ్వాల్సిందిగా డిప్యూటీ ఈవోను ఆదేశించినట్లు సమాచారం.

ప్రభుత్వ సూచనలతో ముగ్గురు అర్చకులకు డిప్యూటీ ఈవో ఎ.ప్రశాంతి నోటీసులు జారీ చేశారు. దీంతో ఈ అంశం రాజకీయంగా దుమారం రేపింది. మాజీ సీఎం జగన్మోహనరెడ్డిని అర్చకులు ఆశీర్వదిస్తే, తప్పేముందని విపక్షం ప్రశ్నిస్తోంది. అయితే ఆలయ నిబంధనలు అతిక్రమిస్తూ బయటకు వెళ్లి వేదాశీర్వచనం ఇవ్వడంపై టీటీడీ సీరియస్ అయింది. టీటీడీ పరిధిలోని ఆలయాల్లో పనిచేసే అర్చకులు, సిబ్బంది ఇలాంటి కార్యక్రమాలకు వెళ్లాలంటే ముందుగా అనుమతి తీసుకోవాలని నిబంధనలు చూపుతున్నారు. అర్చకులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పులివెందుల వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారులు షోకాజ్ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని ఆదేశించారు.

టీటీడీ అభ్యంతరం ఏంటి?

టీటీడీ నిబంధనల ప్రకారం, ఆలయ పవిత్ర వస్తువులను బయటకు తీసుకెళ్లడం లేదా ప్రోటోకాల్ లేకుండా వ్యక్తుల నివాసాలకు వెళ్లి ఆశీర్వచనాలు ఇవ్వడం నిషిద్ధమని చెబుతున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారిక హోదాలో ఉన్నవారికి మాత్రమే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుందని చెబుతున్నారు. మాజీ సీఎం జగన్ ప్రస్తుతం ఏ అధికారిక పదవిలో లేనందున, ముందస్తు అనుమతి లేకుండా అర్చకులు ఆయన ఇంటికి వెళ్లడాన్ని టీటీడీ 'అత్యుత్సాహం'గా పరిగణిస్తున్నట్లు చెబుతున్నారు.

రాజకీయ ప్రతీకారేచ్ఛేనా?

కాగా, ఈ ఘటనపై రాజకీయ విశ్లేషకులు భిన్నంగా స్పందిస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు పెద్దగా స్పందించని యంత్రాంగం, ఇప్పుడు షోకాజ్ నోటీసులు జారీ చేయడం వెనుక 'రాజకీయ కక్ష సాధింపు' ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు, ఆలయ పవిత్రతను కాపాడటానికి నిబంధనలు కచ్చితంగా అమలు చేయాల్సిందేనని కూటమి మద్దతుదారులు వాదిస్తున్నారు. కాగా, ఆలయ నిబంధనల ప్రకారం షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో అర్చకులపై క్రమశిక్షణా చర్యలో భాగంగా విధుల్లోంచి తాత్కాలికంగా తొలగించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. అదేసమయంలో ఇంక్రిమెంట్ల కోత, మెమో జారీ చేయడం, బదిలీ చేయడం వంటి ప్రత్యామ్నాయ శిక్షలు విధించే అవకాశాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. మరోవైపు ఆలయ అధికారులు జారీ చేసిన షోకాజ్ నోటీసులకు అర్చకులు ఎలాంటి సమాధానం చెబుతారనేది ఉత్కంఠ రేపుతోంది.

Tags:    

Similar News