తలసరి ఆదాయం 2026లో బంగ్లాదే పైచేయి కానుందా..?

ఆర్థిక వ్యవస్థలో అగ్రరాజ్యం అమెరికాను తలదన్నేలా భారత్ దూసుకుపోతోందని సండురపడుతున్న వేళ, అంతర్జాతీయ ద్రవ్యనిధి వెల్లడించిన గణాంకాలు మనలను కొంత ఆలోచనలో పడేస్తున్నాయి.;

Update: 2026-04-24 19:30 GMT

ఆర్థిక వ్యవస్థలో అగ్రరాజ్యం అమెరికాను తలదన్నేలా భారత్ దూసుకుపోతోందని సండురపడుతున్న వేళ, అంతర్జాతీయ ద్రవ్యనిధి వెల్లడించిన గణాంకాలు మనలను కొంత ఆలోచనలో పడేస్తున్నాయి. పొరుగున ఉన్న చిన్న దేశం బంగ్లాదేశ్, తలసరి ఆదాయంలో భారత్‌ను మించిపోనుందన్న వార్త ఆర్థిక వర్గాల్లో చర్చనీయాంశమైంది. భారత్ ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నప్పటికీ, జనాభా ప్రాతిపదికన లెక్కించే ‘తలసరి ఆదాయం’ విషయంలో బంగ్లాదేశ్ గట్టి పోటీనిస్తోంది. ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం, 2026-27 ఆర్థిక సంవత్సరం నాటికి బంగ్లాదేశ్ తలసరి జీడీపీ $2,911కు చేరుకోనుంది, అదే సమయంలో భారత్ తలసరి జీడీపీ $2,812 వద్దే నిలిచిపోనుంది. అంటే సగటు భారతీయుడి కంటే సగటు బంగ్లాదేశ్ పౌరుడు ఎక్కువ సంపాదిస్తున్నాడని ఈ గణాంకాలు చెబుతున్నాయి. గతంలో వరుసగా ఏడేళ్ల పాటు (2018 నుంచి 2025 వరకు) బంగ్లాదేశ్ ఈ విషయంలో భారత్ కంటే ముందుండడం, మధ్యలో భారత్ పుంజుకున్నా మళ్లీ బంగ్లాదేశ్ ముందడుగు వేయడం గమనార్హం.

బంగ్లాదేశ్ పుంజుకుంటోందా..?

బంగ్లాదేశ్ ఆర్థిక వృద్ధికి ప్రధానంగా ఆ దేశ ఎగుమతుల రంగం వెన్నుముకగా నిలుస్తోంది. ముఖ్యంగా రెడీమేడ్ దుస్తుల ఎగుమతుల్లో బంగ్లాదేశ్ ప్రపంచ వ్యాప్తంగా చైనా తర్వాత రెండో స్థానంలో ఉంది. ఆ దేశ ఆర్థిక వ్యవస్థలో మహిళల భాగస్వామ్యం ఎక్కువగా ఉండడం, ఉత్పాదక రంగంపై వారు పెట్టిన శ్రద్ధ ఈ వృద్ధికి కారణమైంది. భారత రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే పతనం అవుతున్న తరుణంలో, బంగ్లాదేశ్ తన ఎగుమతుల ద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని సమర్థవంతంగా ఆర్జించగలుగుతోంది.

భారత్‌కు ఎదురవుతున్న సవాళ్లు?

భారత జీడీపీ మొత్తం విలువ పరంగా చాలా పెద్దదైనప్పటికీ, తలసరి ఆదాయంలో వెనుకబడేందుకు జనాభా ప్రధాన కారణం. దేశ సంపద పెరుగుతున్నా, అది అధిక జనాభాపై విస్తరించడం వల్ల సగటు ఆదాయం తక్కువగా కనిపిస్తోంది. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి పతనం భారత్ తలసరి ఆదాయాన్ని డాలర్ల రూపంలో లెక్కించినప్పుడు తగ్గించి చూపుతోంది. వ్యవసాయ రంగంపై ఆధారపడడం తగ్గించి, ఉత్పాదక రంగంలో బంగ్లాదేశ్ తరహాలో వేగం పెంచాల్సిన అవసరం భారత్‌కు ఉందని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

ఇది తాత్కాలికమేనా?

అయితే, ఈ గణాంకాలు కేవలం తలసరి ఆదాయానికి మాత్రమే పరిమితం. కొనుగోలు శక్తి సామర్థ్యం పరంగా చూస్తే భారత్ ఇప్పటికీ బంగ్లాదేశ్ కంటే చాలా మెరుగైన స్థితిలో ఉంది. అలాగే మౌలిక సదుపాయాలు, సాంకేతిక రంగం, అంతరిక్ష పరిశోధనల వంటి భారీ ప్రాజెక్టుల్లో భారత్ బంగ్లాదేశ్ కంటే ఎంతో ముందుంది. కానీ, సామాన్యుడి సగటు ఆదాయం పెరగడం అనేది దేశాభివృద్ధికి నిజమైన కొలమానం కాబట్టి, బంగ్లాదేశ్ సాధిస్తున్న ఈ వృద్ధిని భారత్ ఒక హెచ్చరికగా తీసుకోవాలి.

Tags:    

Similar News