అరుదైన రికార్డు దిశగా అయోధ్య రామాలయం

Update: 2020-08-05 06:50 GMT
ఏళ్లకు ఏళ్లుగా ఎదురుచూస్తున్న అయోధ్య రామాలయం భూమిపూజ ఈ రోజు జరగనుంది. రాముడ్ని ఆరాధించే వారే కాదు.. ఆయన తత్త్వాన్ని ప్రేమించేవాళ్లు.. అభిమానించే వారంతా కూడా అయోధ్యలోని రామాలయ భూమిపూజను స్వాగతిస్తున్నారు. అశేష భారత ఉద్విగ్నంగా ఎదురుచూస్తున్న క్షణాలు వచ్చేశాయి. అయితే.. ఈ గుడి నిర్మాణ ఆరంభంలోనే అరుదైన రికార్డుల్ని సొంతం చేసుకోనుంది. ప్రపంచంలో మరెక్కడా లేని రీతిలో 69 ఎకరాల్లో.. మూడు అంతస్తుల్లో.. ఐదు గోపురాలతో 161అడుగుల ఎత్తులో ఆలయాన్ని నిర్మిస్తున్నారు. గర్భ గుడి వద్ద వెండితో పైకప్పును ఏర్పాటు చేస్తున్నారు. అయోధ్య రామాలయం ప్రపంచంలోనే మూడో అతి పెద్ద హిందూ ఆలయంగా నిలవనుంది.

ప్రస్తుతం కంబోడియాలోని అంగోకర్ వాట్ దేవాలయం తొలి స్థానంలో నిలవగా.. రెండోది తమిళనాడులోని తిరుచిరాపల్లి రంగనాథ స్వామి ఆలయం రెండో స్థానంలో ఉంది. మూడోది అయోధ్యే కావటం విశేషం. మూడున్నరేళ్ల వ్యవధిలో ఈ నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఆలయం వెడల్పు 140 అడుగుల నుంచి 270- 280 అడుగుల వరకు ఉండనుంది. పొడవు విషయానికి వస్తే 268 నుంచి 280 అడుగుల వరకు.. ఒకవేళ మరింత పెంచాల్సి వస్తే 300 అడుగుల వరకు కూడా పెంచనున్నారు. ఎత్తు 128 అడుగుల నుంచి 161 అడుగులకు పెరిగే అవకాశం ఉంది.

ఈ ఆలయం పూర్తి అయ్యాక.. ఒకేసారి పదివేల మంది భక్తులు రామయ్యను దర్శించుకునేలా రూపొందించనున్నారు. ఆలయ ప్రాంగణంలో లక్ష మంది భక్తులు ప్రార్థనలు చేసుకునేలా ప్లాన్ చేస్తున్నారు. మొత్తంగా రానున్న కొన్నేళ్లలో అయోధ్య ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా మారటమే కాదు.. ఇంతకాలం అయోధ్యవైపు పెద్దగా వెళ్లని వారు సైతం తాజా రామాలయాన్ని చూసేందుకు.. దాని విశేషాల్ని కనులారా వీక్షించేందుకు వెళ్లటం ఖాయం. రానున్న రోజుల్లో అయోధ్య మాత్రమే కాదు.. దాని కారణంగా ఉత్తరప్రదేశ్ లో అధ్యాత్మిక యాత్రలు పెద్ద ఎత్తున పెరగటం పక్కా అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News