ఆస్ట్రేలియా ఇంకో షాకిచ్చింది బాస్‌

Update: 2017-04-21 07:59 GMT
వ‌ల‌స దారులకు ఫేవ‌రెట్ అయిన మ‌రో దేశంలో క‌ఠిన నిబంధ‌న‌లు తెర‌మీద‌కు వ‌చ్చాయి. వృత్తి నిపుణులు ముఖ్యంగా భారతీయులు అధికంగా ఉపయోగించుకునే 457 వీసాను ఆస్ట్రేలియా ఇటీవలే రద్దు చేసిన సంగ‌తి తెలిసిందే. దీనికి కొన‌సాగింపులు ఆస్ట్రేలియా ప్రభుత్వం పౌరసత్వ నిబంధనలను కఠినతరం చేసింది. ఇంగ్లిష్ ధారాళంగా రావడం, ఆస్ట్రేలియాలో ఎక్కువ రోజులు నివాసముండటం వంటి కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. ఆస్ట్రేలియా విలువలను గౌరవించడం అనేది మరో షరతు! ఆస్ట్రేలియా ప్రధాని మాల్కం టర్న్‌బుల్ ఈ నూతన పౌరసత్వ నిబంధనలను ప్రకటించారు. కొత్తగా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునేవారు కనీసం నాలుగేళ్లు ఆస్ట్రేలియాలో నివసించిన వారై ఉండాలి. ఇప్పటివరకు ఏడాది నివాసముంటే పౌరసత్వానికి దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇక పౌరసత్వం నిమిత్తం నిర్వహించే పరీక్షలకు పరిమితులు విధించారు. ఇప్పటివరకు అపరిమిత అవకాశాలు ఇచ్చేవారు. కొత్త నిబంధనల ప్రకారం మూడుసార్లు పరీక్ష తప్పితే రెండేళ్ల‌ దాకా ఆగాల్సిందే. చీటింగ్‌ కు పాల్పడితే ఫెయిల్ చేస్తారు. పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునేవారు ప్రత్యేక ఇంగ్లిష్ పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది. అందులో మహిళల పట్ల గౌరవం, పిల్లల పట్ల ఆదరణ వంటి అంశాలు విశేషించి ఉంటాయి. ఆస్ట్రేలియా విలువలు, పౌరులుగా బాధ్యతల గురించి దరఖాస్తుదారు అవగాహన, అంకితభావాన్ని అంచనా వేసే దృష్టితో ప్రశ్నలు రూపొందిస్తారు.

ఆస్ట్రేలియా పౌరసత్వం ఎంతో విలువైందని, దాన్ని అపురూపంగా చూసుకోవాలని ప్రధాని టర్న్‌బుల్ అన్నారు. దేశ విలువలను, చట్టాలను గౌరవించి, దేశ అభ్యున్నతికి కృషి చేయాలనే తపన ఉన్నవారికే పౌరసత్వం దక్కాలని నొక్కిచెప్పారు. కుటుంబ హింస, సంఘటిత నేరాలతో సహా అన్ని నేరపూరిత కార్యకలాపాలు ఆస్ట్రేలియా విలువలకు ఏమాత్రం సరిపడవని పేర్కొన్నారు. ఆస్ట్రేలియా సమాజంతో మమేకం కావడానికి ఇంగ్లిష్ భాష ఎంతో ముఖ్యమని టర్న్‌బుల్ చెప్పారు. కాగా, పోలీసు పరిశీలనలు, తనిఖీలు ఇకనుంచి ముమ్మరం చేస్తామని వలసల శాఖమంత్రి పీటర్ డట్టన్ అన్నారు. వలసలను కట్టుదిట్టం చేసి పౌరసత్వ నిబంధనలను ఆధునీకరిస్తున్నామని చెప్పారు. పౌరసత్వం కోరుకునేవారు అన్ని నిబంధనలు పాటిస్తూ పన్నులను సరిగా కట్టి ఉండాలని కూడా స్పష్టం చేశారు. కనీస నివాస గడువు నాలుగేళ్ల‌ కాలంలో 12 మాసాలకు మించి దేశం బయట ఉండరాదని డట్టన్ తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News