మళ్ళీ కిరోసిన్ ....గ్యాస్ కొరత వేళ !

వెనకటి రోజులు గుర్తున్నాయా. కట్టెల పొయ్యి నుంచి కాస్తా ఉపశమనం కోసం వచ్చినవే కిరోసిన్ స్టవ్ లు.;

Update: 2026-03-21 10:59 GMT

వెనకటి రోజులు గుర్తున్నాయా. కట్టెల పొయ్యి నుంచి కాస్తా ఉపశమనం కోసం వచ్చినవే కిరోసిన్ స్టవ్ లు. అవును ఒక సమయంలో కిరోసిన్ స్టవ్ లకు ఎంతో డిమాండ్ ఉండేది. జనాలు కూడా కిరోసిన్ కోసం రేషన్ షాపుల వద్ద క్యూ కట్టే వారు. కట్టెల పొయ్యి పెట్టే పొగ మంటలకు కళ్ళ వెంబడి నీరు కారుతూంటే ఆ బాధలు భరించలేక కిరోసిన్ వైపు మళ్ళారు. అయితే తరువాత కాలంలో జనాలందరినీ ప్రభుత్వాలు గ్యాస్ సిలిండర్ల వైపు నడిపించాయి. ఇపుడు పశ్చిమాసియా యుద్ధం పుణ్యమాని అలాంటి పరిస్థితులు తిరిగి రాబోతున్నాయి.

సిలిండర్ భయాలు :

గ్యాస్ కొరత పట్టి పీడిస్తోంది. హర్మూజ్ జల సంధి అవతల రెండు పదుల సంఖ్యలో భారత్ నౌకలు ముడి చమురుతో నిలిచిపోయాయి. యుద్ధం చూస్తే ఇప్పట్లో ఆగేట్లు లేదు, దాంతో గ్యాస్ మీద ఆధారపడకండి అని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచిస్తోంది. అంతే కాదు ఆల్టర్నేషన్ వైపు చూడమంటోంది. ఇండక్షన్ స్టవ్ లను వాడాలని కూడా కోరుతోంది అలాగే ఇపుడు రాష్ట్రాలకు కిరోసిన్ ని కూడా సరఫరా చేసేందుకు ముందుకు వస్తోంది. దాంతో మళ్ళీ జనాలు క్యూలు కడుతూ కిరోసిన్ ని ఇంటికి పట్టుకెళ్ళే రోజులు వచ్చేశాయన్న మాట.

రేషన్ షాపుల్లో పంపిణీ :

ఇదిలా ఉంటే ఏపీలోని అన్ని రేషన్ షాపులలో ఈ నెల 23 నుంచి కిరోసిన్ ని పంపిణీ చేయడానికి కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అంతే కాదు ప్రతీ రేషన్ కార్డు దారుడికి లీటరు చొప్పున కిరోసిన్ పంపిణీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. హార్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతల ప్రభావంతో విశాఖపట్నానికి ఈ నెల 21వ తేదిన రావాల్సిన గ్యాస్ నౌక 26వ తేదిన చేరనున్నట్టు కేంద్రం సమాచారం ఇచ్చిందని మంత్రి నాదెండ్ల మనోహర్ తాజాగా పేర్కొన్నారు. దాంతో అప్పటి వరకూ గ్యాస్ సరఫరాలో అంతరాయం లేకుండా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు చర్యలు తీసుకుంటున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం గ్యాస్ కొరత నేపథ్యంలో కేంద్రం కేటాయించిన 2800 కిలో లీటర్ల కిరోసిన్ ను వచ్చే సోమవారం నుంచి రేషన్ ద్వారా గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లో లీటరు చొప్పున పంపిణీ చేయనున్నట్టుగా మంత్రి నాదెండ్ల తెలిపారు.

ఆలోచించాల్సిందే :

కేంద్రం సూచనలు కానీ రాష్ట్రాలు చేపడుతున్న చర్యలు కానీ చూస్తే గ్యాస్ కొరత బాగానే ఉంది. ఈ కష్టాలని అధిగమించేందుకు ప్రజలు కూడా ఆల్టర్నేషన్ మార్గాలు అనుసరించాలని అంటున్నారు. అంతే కాదు గ్యాస్ ని చాలా పొదుగుపా వాడుకోవాలని కూడా సూచిస్తున్నారు. ఇక అందుబాటులో కిరోసిన్ ని కూడా ఉంచుకోవడం మంచిదని చెబుతున్నారు. వీలైతే కాస్తా ఆరు బయలు ప్రదేశం కలిగి ఉన్న వారు అయితే కట్టెల పొయ్యి వంటకు కూడా సిద్ధపడడం మేలు చేస్తుంది అని అంటున్నారు. ఏది ఏమైనా ఇది అందరికీ ఇబ్బందికరమైన కాలంగానే ఉంది అని అంటున్నారు. దాంతో ప్రతీ ఒక్కరూ సహకరించడమే కాదు తాము కూడా వీలైనంత పొదుపు అదుపు చర్యలు తీసుకుంటేనే ప్రభుత్వాల మీద కూడా ఒత్తిడి తగ్గుతుంది అని అంటున్నారు.

Tags:    

Similar News