దళపతి Vs ఉదయనిధి.. అసెంబ్లీ లోపల, బయట మాటల యుద్ధం
ఇక అసెంబ్లీలో సినీ సన్నివేశాలు నెటిజన్లను ఆకట్టుకున్నాయి. పార్టీ ఫండ్స్ పేరిట డీఎంకే డబ్బులు కూటబెట్టుకుందని ముఖ్యమంత్రి విజయ్ ఆరోపించారు.
తమిళనాడు రాజకీయాలు ఆసక్తి రేపుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అధికార టీవీకే, విపక్ష డీఎంకే మధ్య డైలాగ్ వార్ పొలిటికల్ హీట్ పుట్టిస్తోంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడిన ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ విపక్షంపై మాటల దాడి చేశారు. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ ముఖ్యమంత్రి విజయ్ వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేశారు. ఆ తర్వాత అసెంబ్లీ నుంచి డీఎంకే సభ్యులు వాకౌట్ చేశారు. అనంతరం విపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ సీఎం ఒక యాక్టర్ అంటూ విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా తమిళనాడులో టీవీకే సినిమాకు స్పీకర్ డైరెక్టరుగా ఉన్నారని, మంత్రులు అంతా అసిస్టెంట్ డైరెక్టరులుగా వ్యవహరిస్తున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
తమిళనాడులో టీవీకే ప్రభుత్వంపై డీఎంకే నిప్పులు చెరుగుతోంది. ప్రధానంగా ఎమ్మెల్యేల కొనుగోలు చేసి అధికారం చేపట్టారని ధ్వజమెత్తుతోంది. దీనికి కౌంటరుగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి విజయ్ మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. రాజ్యాంగ సంక్షోభం తలెత్తకుండా తామే ఎమ్మెల్యేలను పంపామని డీఎంకే నేతలు చెబుతున్నారని, మళ్లీ వారే ఎమ్మెల్యేలను కొనుగోలు చేశామని అంటున్నారని ఎదురుదాడి చేశారు సీఎం. ఇక టీవీకేను నటుడి పార్టీ అంటూ చేస్తున్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు. క్షేత్రస్థాయిలో కొన్నేళ్లపాటు సేవా కార్యక్రమాలు చేసిన తర్వాతే తాను రాజకీయాల్లోకి వచ్చానని వెల్లడించారు.
స్టాలిన్ ను అనుకరించిన దళపతి
ఇక అసెంబ్లీలో సినీ సన్నివేశాలు నెటిజన్లను ఆకట్టుకున్నాయి. పార్టీ ఫండ్స్ పేరిట డీఎంకే డబ్బులు కూటబెట్టుకుందని ముఖ్యమంత్రి విజయ్ ఆరోపించారు. ఈ సమయంలో విపక్ష సభ్యులు తీవ్ర స్థాయిలో మండిపడుతూ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆరోపణలకు తగిన ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు. సీఎం వ్యాఖ్యలకు నిరసనగా వాకౌట్ చేశారు. ఆ తర్వాత కూడా సీఎం ప్రసంగిస్తూ డీఎంకే చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు. ప్రతిపక్షాల ఆరోపణల్లో పసలేదని, తమ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించామని తేల్చిచెప్పారు. ఇక ఈ వ్యవహారం ముగిసిందని అర్థం వచ్చేలా చేతితో సైగలు చేశారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ ఇలానే సైగలు చేయడంతో ముఖ్యమంత్రి విజయ్ మాజీ సీఎం స్టాలిన్ సైగలతో రిప్లై ఇచ్చారని అంటున్నారు. ఈ సమయంలో టీవీకే ఎమ్మెల్యేలు బల్లలు చరిస్తూ సీఎంకి మద్దతు తెలిపారు.
గతంలో స్టాలిన్ కూడా ఇదే తరహాలో సైగలు చేశారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ తో సీట్ల పంపకాల చర్చల అనంతరం డీఎంకే కార్యాలయం నుంచి తిరిగెళ్లే సందర్భంలో స్టాలిన్ మ్యాటర్ సెటిలైందని అర్థం వచ్చేలా చేతితో సైగలు చేశారు. అప్పట్లో ఇది తీవ్ర చర్చనీయాంశం అయింది. సీట్ల పంపకాల అంశం కొలిక్కి వచ్చిందనే ఉద్దేశంతోనే తాను అలా సైగ చేశానని స్టాలిన్ అప్పట్లో వివరణ ఇచ్చారు. అంతకుమించి మరే ఉద్దేశం లేదని అన్నారు. ఇప్పుడు సీఎం విజయ్ అదేవిధంగా సైగలు చేయడంతో వీడియో వైరల్ అవుతోంది.