మా నాన్నకు మీరిచ్చే మర్యాద ఇదేనా: జగన్‌కు ముద్రగడ కుమార్తె ప్రశ్న
రాజకీయంగా వైసీపీకి అన్నివిధాలా పనిచేసిన ముద్రగడను కనీసం పలకరించేందుకు కూడా జగన్‌కు మనసు రాలేదని క్రాంతి విమర్శించారు.
వైసీపీ అధినేత జగన్‌ను ఉద్దేశించి.. కాపు ఉద్యమ మాజీ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కుమార్తె.. జనసేన నాయకురాలు క్రాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తండ్రిని రాజకీయంగా మాత్రమే వాడుకోవడం తెలిసిన జగన్‌కు మానవత్వపు ఛాయలు కొంచెం కూడా లేకుండా పోయాయన్నా రు. రాజకీయంగా తనకు అవసరమైనప్పుడు.. ముద్రగడను వాడుకున్నారని వ్యాఖ్యానించారు.
కానీ.. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్‌పై ఉంటే.. కనీసం పలకరించేందుకు కూడా జగన్‌కు మనసు రాలే దా? అని నిలదీశారు. తన తండ్రి కేన్సర్ తో బాధపడుతున్నారని.. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారని క్రాంతి తెలిపారు. ఆయనను చూసేందుకు తనకు అనుమతి ఇవ్వలేదని.. తన అన్న గిరి నిర్బంధం విధించారని ఆరోపించారు. గత కొన్నాళ్లుగా ముద్రగడ కేన్సర్‌లో బాధపడుతున్నారని తెలిపారు.
రాజకీయంగా వైసీపీకి అన్నివిధాలా పనిచేసిన ముద్రగడను కనీసం పలకరించేందుకు కూడా జగన్‌కు మనసు రాలేదని క్రాంతి విమర్శించారు. ఎన్నికల వేళ జగన్ కోసం.. వైసీపీ గెలుపుకోసం.. తపించిన ఆయన.. చివరకు తన పేరును కూడా మార్చుకున్నారని గుర్తు చేశారు. గత వారం రోజులుగా ముద్రగడ గురించి చర్చ జరుగుతున్నా.. ఆయన ఆసుపత్రిలో ఉన్నారని తెలుస్తున్నా.. జగన్ ఏమాత్రం పట్టించు కోవడం లేదని క్రాంతి దుయ్యబట్టారు.
తన సోదరుడు గిరి.. తన తండ్రిని నిర్బంధించారని.. ఆయనను చూసేందుకు తనను అనుమతించడం లేదని క్రాంతి ఆరోపించారు. ``పరిస్థితి ఎలా ఉన్నా.. కనీసం ఆయనను పరామర్శించేందుకు వైసీపీ నాయకులు ఒక్కరు కూడా ముందుకు రాలేదు. జగన్ కోసం మా నాన్న పేరును కూడా మార్చుకున్నారు. ఇంత చేసినా.. మా నాన్నను పలకరించేందుకు జగన్‌కు మనసు రాలేదు.`` అని క్రాంతి వ్యాఖ్యానించారు. కాగా.. గతంలో తనకు క్యాన్సర్ అన్న వాదనను ముద్రగడ తోసిపుచ్చారు. తాను వయో సంబంధిత సమస్యలతోనే ఇబ్బంది పడుతున్నానని తెలిపారు.