సన్ రైజర్స్ కెప్టెన్ ఇషాన్.. సోషల్ మీడియా ఎంట్రీ అదుర్స్!
ఎంతలో ఎంత మార్పు.. సరిగ్గా మూడు నెలల కిందట అసలు అతడు టీమ్ ఇండియా దరిదాపుల్లోనే లేడు.;
ఎంతలో ఎంత మార్పు.. సరిగ్గా మూడు నెలల కిందట అసలు అతడు టీమ్ ఇండియా దరిదాపుల్లోనే లేడు. క్రమశిక్షణ తప్పి.. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఆగ్రహానికి గురయ్యాడు టీమ్ఇండియా వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ ఇషాన్ కిషన్. ఇప్పుడు కట్ చేస్తే.. టి20 ప్రపంచ కప్ గెలిచిన జట్టులో సభ్యుడు. అనూహ్యంగా చోటు దక్కించుకుని.. కీలక ఇన్నింగ్స్ లు ఆడిన బ్యాట్స్ మన్. అంతేకాదు, వారం రోజుల్లో మొదలయ్యే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్ హెచ్) కెప్టెన్. ఇది కనీసం ఊహించని పరిణామం. అభిషేక్ శర్మ వంటి సహచర ఓపెనర్ ఉండగా.. కిషన్ ను వరించింది కెప్టెన్సీ కిరీటం. తాత్కాలికంగానే అయినా, ఆస్ట్రేలియా ఆటగాడు ప్యాట్ కమ్మిన్స్ కోలుకుని వచ్చేవరకు ఎస్ఆర్ హెచ్ బాధ్యతలు ఇషాన్ వే. కమ్మిన్స్ గాయం పెద్దదే కాబట్టి, లీగ్ కు అంతడు ఎంతమేరకు అందుబాటులో ఉంటాడన్నదీ చెప్పలేం. అలాంటప్పుడు కిషన్ పై కీలక బాధ్యతలే ఉన్నట్లు లెక్క.
ఏ దేశవాళీనైతే కాదన్నాడో.. అదే రాత మార్చింది
జాతీయ జట్టు క్రికెటర్లు సిరీస్ లు, టూర్లు లేనప్పుడు దేశవాళీ క్రికెట్ ఆడాలన్న బీసీసీఐ నిబంధనతో 2023 వన్డే ప్రపంచ కప్ అనంతరం కిషన్ విభేదించాడు. గాయం పేరు చెప్పి, దుబాయ్ లో ప్రైవేటు పార్టీలో కనిపించాడు. ముంబై ఇండియన్స్ ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొన్నాడు. దీంతో అతడిపై బీసీసీఐ ఆగ్రహంగా ఉంది. ప్రతిభావంతుడు కాబట్టి మరిన్ని అవకాశాలు ఇవ్వాలని భావించింది. ఈ క్రమంలో రిషభ్ పంత్ దూరమైన సందర్భంలో కిషన్ కు పిలుపు వెళ్లినా అతడు బ్యాడ్ లక్ కొద్దీ గాయపడ్డాడు. ఇక, జాతీయ జట్టులోకి రావడం అసాధ్యం అనుకుంటుండగా దేశవాళీల్లో జార్ఖండ్ తరఫున దుమ్మురేపి తనను పక్కనపెట్టలేని పరిస్థితి కల్పించాడు.
ఇప్పుడు కెప్టెన్ కిషన్
కిషన్ ప్రస్తుత పరిస్థితికి తనను తాను గిల్లుకుని చూడాలేమో? టి20 ప్రపంచ కప్ విజేత జట్టులో భాగం కావడమే కాదు.. సన్ రైజర్స్ కెప్టెన్సీ కూడా చేపట్టడం అతడి కెరీర్ లో మైలురాయి. ఇది భవిష్యత్ లో మరిన్ని అవకాశాలకు బాటలు వేస్తుందనడంలో సందేహం లేదు. కాగా, కిషన్ ను తమ కెప్టెన్ గా ప్రకటించిన సన్ రైజర్స్.. తాజాగా సోషల్ మీడియాలో అతడి ఎంట్రీపై కెప్టెన్ ఇషాన్ తాండవం బిగిన్స్ అంటూ వీడియో విడుదల చేసింది. అందులో కుర్చీ (కెప్టెన్సీ)ని లాక్కోవడం.. పాకెట్ డైనమైట్ అని రాసి ఉన్న బోర్డు బ్యాక్ గ్రౌండ్ లో, మాజీ ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ పేరిట ఉన్న పేపర్ ను పక్కకు తప్పిస్తూ.. ఇక ఫైరింగ్ స్టార్ట్ చేద్దామా? అంటూ డైలాగ్ పలికాడు. దీనికి అభిమానులు లైకులు కొడుతూ.. ఎంట్రీ అదుర్స్ అని కామెంట్లు పెడుతున్నారు.