జీవన్ రెడ్డి మైండ్ గేమ్‌.. పార్టీ మార్పు నిజమేనా?

తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలు మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డి చుట్టూ తిరుగుతున్నాయి. దాదాపు నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ లో కొనసాగిన జీవన్ రెడ్డి పార్టీతో తెగతెంపులు చేసుకోవాలని నిర్ణయించినట్లు జరుగుతున్న ప్రచారం హీట్ పుట్టిస్తోంది.;

Update: 2026-03-21 15:30 GMT

తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలు మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డి చుట్టూ తిరుగుతున్నాయి. దాదాపు నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ లో కొనసాగిన జీవన్ రెడ్డి పార్టీతో తెగతెంపులు చేసుకోవాలని నిర్ణయించినట్లు జరుగుతున్న ప్రచారం హీట్ పుట్టిస్తోంది. తన కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు, జెండాలను ఆయన తొలగించారు. దీంతో కాంగ్రెస్ అధిష్టానం సైతం అప్రమత్తమైంది. జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యే సత్యంకి బాధ్యతలు అప్పగించింది. ఈ ముగ్గురు శనివారం జీవన్ రెడ్డితో సుమారు గంటపాటు భేటీ అయ్యారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన జీవన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మంత్రులతో సమావేశం అయిన తర్వాత మీడియా ముందుకొచ్చిన జీవన్ రెడ్డి తన నిర్ణయంలో మార్పు లేదని ప్రకటించారు. అంతేకాకుండా పార్టీ మార్పుపై జరుగుతున్న ప్రచారంపై రేపు (ఆదివారం) పూర్తి వివరాలు వెల్లడిస్తానని వ్యాఖ్యానించారు. దీంతో జీవన్ రెడ్డి అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్ర ఉత్కంఠకు గురి అవుతున్నారు. మరోవైపు జీవన్ రెడ్డి ఆవేదనను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళతామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. ఈ పరిణామాల మధ్య జీవన్ రెడ్డి నిర్ణయం సస్పెన్స్ గా మారింది. తన నిర్ణయంలో మార్పు ఉండదని ఆయన చెప్పడంతో రాజీనామా ప్రకటన చేస్తారా? అన్న చర్చ ఎక్కువగా జరుగుతోంది.

జగిత్యాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో జీవన్ రెడ్డికి తీవ్ర విభేదాలు ఉన్నాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో ఎమ్మెల్యే చేరారు. అప్పటినుంచి జీవన్ రెడ్డి ఎమ్మెల్యేతో విభేదిస్తూనే వస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఈ విభేదాలు మరింత తీవ్రస్థాయికి చేరాయి. తన నియోజకవర్గంలో ఎమ్మెల్యే హవా ఎక్కువ అవడాన్ని జీవన్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ పరిణామాలతోనే కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పాలని జీవన్ రెడ్డి నిర్ణయించుకున్నారని అంటున్నారు. అయితే సుమారు 40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న జీవన్ రెడ్డి కేవలం బెదిరించడానికే పార్టీ మార్పు ప్రచారాన్ని తీసుకువచ్చారని కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు.

అయితే పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ ఫ్లెక్సీలు తొలగించడంతోపాటు వరుసగా కార్యకర్తలతో మాట్లాడుతూ పార్టీ మార్పుపై ఆయన సంకేతాలు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో అధిష్టానం సైతం రంగంలోకి దిగింది. జీవన్ రెడ్డిని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో గతంలో పార్టీని వీడిన సీనియర్లు పొన్నం లక్ష్మయ్య వంటివారిని కార్యకర్తలు గుర్తు చేసుకుంటున్నారు. పార్టీలో సుదీర్ఘంగా కొనసాగిన వారు చివరి దశలో పార్టీని వీడటంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. మరోవైపు జీవన్ రెడ్డి పార్టీ మార్పు ఖాయమైందని ఆయన బీఆర్ఎస్ లో చేరేందుకు ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయని అంటున్నారు. ఇదే సమయంలో జీవన్ రెడ్డిని తమ పార్టీలోకి తెచ్చేందుకు బీజేపీ ప్రయత్నాలు ఆరంభించినట్లు చెబుతున్నారు. మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో జీవన్ రెడ్డి ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారారు.

Tags:    

Similar News