కొణతాలకు ఛాన్స్: జనసేనలో చర్చ.. !
ఇది వాస్తవమే. ఎప్పుడో కాంగ్రెస్ హయాంలో కొణతాల మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత.. రాజకీయంగా ఆయన వెనుకబడ్డారు.;
మంత్రి వర్గ విస్తరణ జరిగితే.. జనసేనకు ఉన్న మూడు మంత్రి వర్గ స్థానాల్లో మార్పులపై కూడా చర్చ సాగుతోంది. అయితే.. పార్టీపరంగా అలాంటి దేమీ ఉండబోదని అంటున్నారు. నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. ఇప్పుడు మంత్రులుగా ఉన్నారు. పవన్ కల్యాణ్ ఉపముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు. కానీ, ప్రాంతాల వారీగా చూసుకుంటే.. సీమకు.. ఉత్తరాంధ్రకు జనసేనలో ప్రాధాన్యం లేదు.
ఈ విషయం తరచుగా చర్చకు వస్తోంది. ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో కందుల దుర్గేష్ తూర్పుగోదావరి, నాదెండ్ల తెనాలి, పవన్ కల్యాణ్.. కూడా తూర్పుగోదావరి జిల్లాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ, ఉత్తరాంధ్రలో పార్టీపరంగా పుంజుకునేందుకు వ్యూహాలు రచిస్తున్న పార్టీకి ఇక్కడ మంత్రి వర్గంలో చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో కొన్నాళ్లుగా కొణతాల రామకృష్ణను మంత్రివర్గంలోకి తీసుకుంటే బాగుంటుంద న్న చర్చ సాగుతోంది.
ఇది వాస్తవమే. ఎప్పుడో కాంగ్రెస్ హయాంలో కొణతాల మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత.. రాజకీయంగా ఆయన వెనుకబడ్డారు. జనసేనతో తిరిగి విజయం దక్కించుకున్నారు. ఆయనకు ఉత్తరాంధ్రలో ఉన్న పట్టు, పేరును దృష్టిలో పెట్టుకుంటే.. వచ్చే ఎన్నికల నాటికి సామాజిక వర్గం పరంగా కూడా కొణతాలకు.. మంత్రి పదవి ఇస్తే.. మేలు జరుగుతుందన్న చర్చ ఉంది. కానీ.. ప్రస్తుతం ఏమేరకు అవకాశం ఉందన్నదే ఇప్పుడు ప్రశ్న.
ఇక, సీమలో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. సీమ నుంచి జనసేనకు పెద్దగా ఎమ్మెల్యేలు లేరు. తిరుపతి నుంచి ఆరణి శ్రీనివాసులు, కడప జిల్లా రైల్వే కోడూరు నుంచి అవర శ్రీధర్ విజయం దక్కించుకున్నారు. వీరిలో ఆరణి ప్రస్తుతం అనారోగ్యం కారణంగా నియోజకవర్గం బాధ్యతలను తన అన్న కుమారులకు అప్పగించారన్న చర్చ సాగుతోంది. ఇక, అరవ శ్రీధర్ వివాదంలో చిక్కుకున్నారు. సో.. సీమ నుంచి మంత్రివర్గంలోకి తీసుకునేందుకు అవకాశం లేదు.
ఏదైనా అవకాశం ఉంటే.. అది కొణతాలకేనని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. వాస్తవానికి ఉత్తరాంధ్రలో జనసేనకు మిక్కిలిగానే ఎమ్మెల్యేలు ఉన్నారు. పాలకొండ, నెల్లిమర్ల, యలమంచిలి, పెందుర్తి, విశాఖ దక్షిణం, అనకాపల్లి(కొణతాల)లలో జనసేన విజయం దక్కించుకుంది. అయితే.. వీరిలో వివాద రహితంగానే కాకుండా.. సామాజికంగా కూడా మంచి పేరున్న నాయకుడిగా కొణతాల ఒక్కరే కనిపిస్తున్నారన్నది పార్టీ వర్గాలు చెబుతున్న మాట.