తీవ్ర విషాదంలో టీడీపీ.. సీనియర్ నేత కన్నుమూత
టీడీపీ సీనియర్ నేత, అనంతపురం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి (80) కన్నుమూశారు.;
టీడీపీ సీనియర్ నేత, అనంతపురం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి (80) కన్నుమూశారు. వయోభారం, అనారోగ్యంతో ఆయన కొన్నాళ్లుగా బాధపడుతున్నారు. టీడీపీలో అనేక పదవులలో పనిచేసిన ఆయన మృతి టీడీపీ కార్యకర్తలను తీవ్ర విషాదానికి గురిచేసింది. ఆరోగ్యం క్షీణించడంతో కొన్నిరోజులుగా హనుమంతరాయ చౌదరి అనంతపురం నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శనివారం వేకువజామున ఆయన ప్రాణాలు విడిచినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
హనుమంతరాయ చౌదరి మరణం టీడీపీలో తీవ్ర విషాదానికి గురి చేసింది. 2014-19 మధ్య ఆయన కల్యాణదుర్గం ఎమ్మెల్యేగా పనిచేశారు. వార్డు మెంబరుగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన హనుమంతరాయ చౌదరి అంచెలంచెలుగా పార్టీలో ఎదిగారు. ఉమ్మడి ఏపీలో మార్క్ ఫెడ్ చైర్మనుగా పనిచేశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సుమారు 60 రోజుల పాటు ఆస్పత్రిలో వెంటిలేటర్ పైనే చికిత్స పొందారు. అయినా ఆయనను కాపాడుకోలేకపోయామని కుటుంబ సభ్యులు తెలిపారు.
టీడీపీలో క్షేత్రస్థాయిలో పనిచేసిన హనుమంతరాయ చౌదరి ఉమ్మడి అనంతపురం జిల్లా అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం పనిచేశారు. రాజకీయంగా వార్డు సభ్యుడిగా మొదలుపెట్టి ఏడు గ్రామాలకు ఏకగ్రీవ సర్పంచ్ పదవితో పట్టుపెంచుకున్నారు. ఈ క్రమంలోనే పార్టీలో మంచి గుర్తింపు తెచ్చుకుని టీడీపీ జిల్లా అధ్యక్షపదవి దక్కించుకున్నారు. 2014లో ఎమ్మెల్యే టికెట్ కైవసం చేసుకుని ఎమ్మెల్యేగా గెలిచారు. నియోజకవర్గంలో తన కంటూ ప్రత్యేక గుర్తంపును, చెరగని ముద్రను వేశారు.
దివంగత నేత హనుమంతరాయ చౌదరి భౌతికకాయానికి ఆయన స్వగ్రామం ఎర్రంపల్లిలో ఆదివారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆయన మృతి వార్త తెలిసిన వెంటనే టీడీపీ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేలు సంతాపం తెలిపారు. హనుమంతరాయ చౌదరి కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు.