మంత్రి జయరాం ఏకాకి అవుతున్నారా?

Update: 2020-09-24 06:30 GMT
ఏపీ కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాంను కొద్దిరోజులుగా వివాదాలు చుట్టుమట్టాయి.   మంత్రి సొంతూరు గుమ్మనూరులో భారీ పేకాట క్లబ్‌ బయటపడడం.. స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో అధికారులు దాడులు చేయడం.. మంత్రికి వరుసకు సోదరుడైన వ్యక్తిపై కేసు నమోదు తీవ్ర విమర్శలకు దారితీసింది. అలాగే కొన్ని భూములను బలవంతంగా రిజిస్టర్‌ చేయించుకున్నారని.. అందులో కొన్ని నకిలీ పత్రాలు ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. భూములు అమ్మిన వ్యక్తిపై బెంగళూరు కోరమంగళం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైనట్టు మీడియాలో వార్తలు వచ్చాయి.. ఈ రెండు ఘటనలపై చాలాకాలంగా  చర్చ కొనసాగుతోంది. ఇలా వరుస వివాదాలు జయరాంను వెంటాడుతూనే ఉన్నాయి. దీంతో ఆయనకు అటు ప్రభుత్వం నుంచి పెద్దగా సపోర్టు దొరకడం లేదనే చర్చ ఆ పార్టీలో సాగుతోంది. ఇప్పుడు ఆయన కేబినెట్‌లో ఒంటరి అయ్యారా అనే అనుమానాలు వస్తున్నాయి.  
 
ఈ వివాదాలు ఇలా నడుస్తుండగా ఈఎస్‌ఐ స్కామ్‌లో 14వ నిందితుడిగా ఉన్న కార్తీక్‌ నుంచి మంత్రి కుమారుడు ఈశ్వర్‌ బెంజికారు గిఫ్ట్‌గా తీసుకున్నారని టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు సంచలన ఆరోపణలు చేశారు. మంత్రి కుమారుడు షోరూమ్‌లో కారు తాళాలు తీసుకోవడం.. ఆ కారు తీసుకుని ఇంటికి రావడం వంటి ఫొటోలను కూడా విడుదల చేశారు. పేకాట క్లబ్‌, భూముల రిజిస్ట్రేషన్లపై వచ్చిన ఆరోపణలను ఎలా అయితే ఖండించారో.. పై ఆరోపణల్లాగే అదే విధంగా బెంజికారు గిఫ్ట్‌ ఆరోపణలను సైతం తోసిపుచ్చారు మంత్రి జయరాం. అయినా.. టీడీపీ నేతలు మాత్రం తమ ఆరోపణలను ఆపడం లేదు.

ఈ ఆరోపణలు తిప్పికొట్టడానికి మంత్రికి అండగా ఎవరూ లేరు. ఆయనపై వచ్చిన ఆరోపణలకు ఆయనే సమాధానం ఇస్తున్నారే తప్ప కేబినెట్‌లోని ఏ మంత్రి కానీ.. ఏ ఎమ్మెల్యే కానీ సపోర్టుగా నిలవడం లేదు. సహజంగా ఏ మంత్రి పైనా ఆరోపణలు వచ్చినా.. ప్రతిపక్షాలు విమర్శలు చేసినా.. వాటిని సహచర మంత్రులు కొట్టిపారేస్తుంటారు. ఈ ఎపిసోడ్‌లో జయరాంపై టీడీపీ నేతలు అయ్యన్న, లోకేష్‌, బుద్దా వెంకన్న తీవ్ర ఆరోపణలు చేసినా ఎవరూ సహకరించడం లేదు. కనీసం కర్నూలు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు మంత్రికి మద్దతుగా నిలవడం లేదని చెవులు కొరుక్కుంటున్నారు. కేవలం మంత్రి నియోజకవర్గంలోని ఆస్పరి మండలంలో మాత్రమే బర్రెకు అయ్యన్న ఫొటోపెట్టి చిన్నపాటి కార్యక్రమం చేశారు తప్పితే పెద్దగా ఆయనకు మద్దతు దక్కలేదు.
 
తోటి మంత్రులు స్పందించకపోవడాన్ని చూస్తుంటే.. జయరాంపై వచ్చిన ఆరోపణలు నిజమని వారు నమ్ముతున్నారా..? లేక ఈ ఆరోపణలు ఆయన వ్యక్తిగతమని వదిలేస్తున్నారా..? అని చర్చ నడుస్తోంది. గుమ్మనూరు పేకాట క్లబ్‌ ఘటనపై  వైపీపీలో ముఖ్య నేతలు, ప్రభుత్వంలోని పెద్దలు ఆగ్రహంతో ఉన్నారన్న ప్రచారంతో అంతా సైలెంట్‌ అయ్యారని అనుకుంటున్నారట. పైగా స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరోను సీఎం జగనే ప్రత్యేకంగా ఏర్పాటు చేసి.. అక్రమార్కులపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. అలాంటిది మంత్రి సొంతూరులోనే అంతా బయటపడటంతో దీనిపై చాలా కామెంట్స్‌ వచ్చాయట. అందుకే ఈఎస్‌ఐ స్కామ్‌లోనూ ఇతర మంత్రులు జయరాంకు అండగా మాట్లాడే సాహసం చేయడం లేదని ఆ పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
Tags:    

Similar News