బాబుది రియల్ ఎస్టేట్..నాది అభివృద్ధి వికేంద్రీకరణ..!!

Update: 2020-09-10 05:45 GMT
‘గుడ్లన్నీ ఒకే బుట్టలో ఉంటే తీవ్రంగా నష్టపోతాం.. చెన్నై, హైదరాబాద్ నగరాల విషయంలో ఏపీకి తీరని అన్యాయం జరిగింది. అమరావతిలో జరిగింది రియల్ ఎస్టేట్ వ్యాపారం మాత్రమే. తాను, తన మనుషులు భూములు కొన్న చోట అభివృద్ధి చేయాలని చంద్రబాబు చెబితే ఎలాగని’ జగన్ సూటిగా ప్రశ్నించారు. తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న విధానానికి తాము కట్టుబడి ఉన్నామని.. ఒకే చోట అభివృద్ధి కేంద్రీకృతమై ఉండాలనడం సరికాదని జగన్ అన్నారు.

ఇక జాతీయ రాజకీయాలపై తమకు ఏ మాత్రం ఆసక్తి లేదని జగన్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీకి అంశాల వారీగా మద్దతునిస్తామని జగన్ తేల్చిచెప్పారు.

మూడు రాజధానులతో ఏపీకి లాభమని శివరాకృష్ణ కమిటీ కూడా అదే తేల్చిచెప్పిందని జగన్ అన్నారు.  రియల్ ఎస్టేట్ కోసమే చంద్రబాబు విలువైన అమరావతి భూములపై రాజధాని కడుతున్నారని జగన్ ఆరోపించారు. పేద రైతుల భూములను కొందరు కొని లాభపడ్డారన్నారు.

కేరళలో పెద్ద నగరాలు లేకున్నా ఆ రాష్ట్రం ఇప్పుడు అనేక ప్రామాణికల్లో దేశంలో ముందంజలో ఉందని జగన్ అన్నారు. అమరావతిని మేం వదలడం లేదని.. అక్కడ శాసన రాజధాని ఉంటుందని  తెలిపారు. అభివృద్ధి వికేంద్రీకరణకే మా మద్దు అని స్పష్టం చేశారు. 29 గ్రామాల్లోని పదివేల మంది రైతులు మినహా యావత్ రాష్ట్ర ప్రజలు మా వెనుక మద్దతుగా ఉన్నారని జగన్ అన్నారు.

చంద్రబాబు ఆరోపిస్తున్నట్టు తాము ఫోన్ కాల్స్ ట్యాప్ చేస్తున్నామన్నది అబద్ధం.. అర్థరహితం అని జగన్ అన్నారు. సాక్ష్యాలుంటే ఇవ్వాలని డిమాండ్ చేశారు. డీజీపీ అడిగినా బాబు ఇవ్వలేదన్నారు.

చంద్రబాబు, ఆయన అనుయాయులు అమరావతిలో పెట్టిన పెట్టుబడుల కోసం అమరావతి ఉద్యమాన్ని చేపట్టారని జగన్ ఆరోపించారు.కరోనాతో పోరాడుతున్న సమయంలోనూ రైతులను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.మార్చి తర్వాత బాబు ఏపీలోనే కరోనా భయానికి అడుగు పెట్టలేదని జగన్ ఎద్దేవా చేశారు.

ఆంధ్రలో తాము బలమైన ప్రాంతీయ పార్టీ అని.. జాతీయ స్తాయి రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయిలో మాకు సంఖ్యాబలం లేదని జగన్ అన్నారు. ఏపీని అభివృద్ధి చేసుకోవడం వరకే మా పాత్ర ఉంటుందని జగన్ అన్నారు. జాతీయస్థాయిలో తమకు ఎలాంటి ఆసక్తి లేదని జగన్ స్పష్టం చేశారు.

బీజేపీకి అంశాల వారీగానే మద్దతిస్తామని.. ఏపీ ప్రయోజనాల కోసమే కేంద్రంలో ఏ పార్టీతోనైనా కలుస్తామని జగన్ స్పష్టం చేశారు.
Tags:    

Similar News