రాష్ట్రంలో మరో కొత్త పార్టీ.. ముఖ్యమంత్రి ఏం చేయబోతున్నారు?

Update: 2021-02-15 16:30 GMT
త్వ‌ర‌లో కేర‌ళలో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో రాష్ట్రంలో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. కేరళ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ)నేత మణి సీ కప్ప‌న్ తీసుకున్న నిర్ణ‌యం హాట్ టాపిక్ గా మారింది. ఆయ‌న కొత్త పార్టీ పెట్టేందుకు సిద్ధ‌మ‌య్యారు. కేరళలో అధికార కూటమి లెఫ్ట్ డెమోక్ర‌టిక్ ఫ్రంట్ (ఎల్‌డీఎఫ్)‌లో భాగస్వామిగా ఉన్న ఎన్‌సీపీకి చెందిన కొందరు నేతలతో క‌లిసి బ‌య‌ట‌కు వ‌చ్చిన మ‌ణి సీ క‌ప్ప‌న్‌.. సొంత కుంప‌టి పెట్టేందుకు సిద్ధ‌మ‌య్యారు.

కొత్త పార్టీ నిర్మాణం కోసం 10 మందితో కమిటీని కూడా ఏర్పాటు చేశారు క‌ప్ప‌న్‌. ఆయ‌న‌ అధ్యక్షతనే ఏర్పాటైన‌ ఈ క‌మిటీ.. పార్టీ పేరు, చిహ్నం ఎంపికపై  కసరత్తు చేస్తోంది. వారం రోజుల్లో ఇవ‌న్నీ ఓ కొలిక్కి రానున్న‌ట్టు స‌మాచారం. ఎన్సీపీకి చెందిన తొమ్మిది జిల్లాల అధ్య‌క్షుల నేతల మద్దతు త‌న‌కు ఉంద‌ని ప్రకటించుకున్న ఎమ్మెల్యే మణి సీ కప్పన్.. తాము యునైటెడ్ డెమొక్ర‌టిక్ ఫ్రంట్ (యూడీఎఫ్)లో చేరుతున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

అయితే.. దీనంత‌టికీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎల్ డీఎఫ్ త‌ర‌పున టిక్కెట్ ద‌క్క‌క‌పోవ‌డ‌మే కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. 2019లో కాంగ్రెస్ నేత మ‌ర‌ణంతో పాల అసెంబ్లీ నియోజకవర్గం ఖాళీకాగా.. ఆ ఉపఎన్నికల్లో మణి సీ కప్పన్ ఎల్‌డీఎఫ్ టిక్కెట్ పై గెలిచారు. అయితే.. రాబోయే ఎన్నికల్లో పాల నియోజ‌క‌వ‌ర్గ‌ టికెట్‌ను వేరే అభ్యర్థి ఇవ్వనున్నట్టు సీపీఎం సారథ్యంలోని ఎల్‌డీఎఫ్ నిర్ణయించింది. దీంతో అలిగిన మణి సీ కప్పన్.. యూడీఎఫ్ కు మ‌ద్ద‌తు ఇచ్చి, సొంత పార్టీ పెట్టుకొనేందుకు సిద్ధ‌మ‌య్యారు.

మ‌రి, ఈ ప‌రిణామాల‌ను సీపీఎం ఎలా ఎదుర్కొంటుంద‌న్న‌ది ఆస‌క్తిగా మారింది. కేర‌ళలో ఏ పార్టీ కూడా రెండోసారి అధికారంలోకి వ‌చ్చే సంప్ర‌దాయం లేదు. ఓట‌ర్లు ఒక కూట‌మికి ఒకే సారి ఛాన్స్ ఇస్తున్నారు. అయితే... ఈ సారి ఎలాగైనా వ‌రుస‌గా రెండోసారి గెలిచి తీరాల‌ని చూస్తోంది ఎల్డీఎఫ్‌. ఈ ప‌రిస్థితుల్లో సీ క‌ప్ప‌న్ షాక్ ఇచ్చారు. దీంతో.. కేర‌ళ రాజ‌కీయాలు హాట్ హాట్ గా మారాయి.
Tags:    

Similar News