రైల్వే స్టేషన్ లో కడక్ ఛాయ్.. పల్లీ పట్టిలతో కడుపుకున్న నింపుకున్న సీఈవో

Update: 2022-06-03 03:29 GMT
క్షణం తీరిక లేకుండా కాలంతో పరుగులు తీసే అతగాడి ఆస్తులు ఏకంగా రూ.30వేల కోట్లు దాటిపోయాయి. అన్నేసి వేల కోట్లను ఏం చేసుకుంటారన్న భావన కొందరికి కలగొచ్చు. కానీ.. ఆయన బ్యాక్ గ్రౌండ్ గురించి తెలిస్తే.. ఆయనకున్న ఆస్తిపాస్తులకు ఆసూయ చెందే కన్నా.. స్ఫూర్తిని పొందటం ఖాయం. కష్టించి పని చేయాలో కానీ ఫలితం ఖాయమన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. ఆ కోవలోకే వస్తారు వేదాంత గ్రూప్ సీఈవో అనిల్ అగర్వాల్. ఆయన గురించి తెలియాలే కానీ.. బోలెడంత గౌరవ మర్యాదలుతన్నుకుంటూ వస్తాయి. తాజాగా ఆయన సోషల్ మీడియాలో వరుస పోస్టులు పెట్టటం ద్వారా.. కలలు కనే యువతకు సరికొత్త ఆదర్శమూర్తి అవుతున్నారు.

అలాంటి ఆయన ప్రారంభం చాలా చిన్నగా మొదలయ్యారు. ఆ మాటకు వస్తే కడుపు నిండా భోజనం కూడా తినలేని పరిస్థితి. అంతేకాదు ముంబయికి చేరిన నాటికి చేతిలో చిల్లిగవ్వ లేకపోవటం.. ఇంగ్లీష్ ముక్క రాని ఆయన టెలిఫోన్ కేబుళ్ల తయారీ మీద మాత్రం మంచి పట్టుంది. అలాంటి ఆయన ముంబయికి చేరుకున్నాక ఉదయం వేళలో కేబుళ్ల అమ్మకాలకు సంబంధించిన లావాదేవీలు.. రాత్రి వేళలో కేబుళ్ల తయారీకి అవసరమైన రాగి తీగ తయారీ యూనిట్ కార్మికులతో చర్చలు ఇలా.. రోజుకు 24 గంటల్లో అత్యధిక సమయం ఆయన పని చేస్తూనే గడిపేవారు. ఈ క్రమంలో ఆయన ఎదుర్కొన్న కష్టాలు అన్ని ఇన్ని కావు.

రాత్రి అయితే ఇంటికి వెళ్లటం చాలామంది చేసే పని కానీ.. అనిల్ అగర్వాల్ మాత్రం అందుకు భిన్నం. కడుపు నింపుకోవటానికి రైల్వే స్టేషన్ లో దొరికే కడక్ ఛాయ్ తాగటం.. పల్లీ పట్టీలు తింటూ కడుపు నింపుకునేవారు. నిద్ర పోవటానికి ఆయన చాలాసందర్భాల్లో రైల్వే ప్లాట్ ఫాం మీదనే నిద్ర పోయిన పరిస్థితి. అలా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వచ్చిన ఆయన టెలిఫోన్ కేబుళ్ల సరఫరా కోసం మెరైన్ లైన్ లో చిన్న ఆఫీసు షురూ చేసిన ఆయన.. అమెరికా నుంచి తెప్పించిన లేటెస్టు మిషనరీతో మొదటి కాపర్ రాడ్స్ తయారీ పరిశ్రమను స్థాపించారు.

ఉదయం నుంచి సాయంత్రం వరకు మెరైనలైన్ లో పని చేసి.. అనంతరం లోకల్ ట్రైన్ లో ప్రయాణించి లోనావాలకు వెళ్లేవారు. అక్కడికి చేరుకున్న తర్వాత పరిశ్రమలోని కార్మికులతో మాట్లాడేవారు. కాపర్ తయారీని స్వయంగా పరిశీలిస్తూ.. రాత్రంతా అక్కడే ఉండే.. తెల్లారిన వెంటనే మళ్లీ లోకల్ ట్రైన్ లో మెరైన్ లైన్ కు చేరుకునేవారు. ఈ నేపథ్యంలో రాత్రిళ్లు ఇంటికి వెళ్లే అవకాశం ఉండేది కాదు. కంటి నిండా నిద్ర పోయే వీలు ఉండేది కాదు. అందుకే ఆయన నిద్ర కోసం రైల్వే స్టేషన్ ఫ్లాట్ ఫాం మీద కునుకు తీసేవారు. అలా పని మీద తప్పించి మిగిలిన దేని మీదా ఫోకస్ చేయని ఆయనకు పెద్దగా ఆకలి కూడా వేసేది కాదని చెబుతారు.

ఆయన ఏర్పాటు చేసిన కాపర్ వైర్ పరిశ్రమ నిలదొక్కుకోవటంతో ఆ తర్వాత కాపర్ స్మెల్టర్ పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు అవసరమైన సాంకేతికత.. నిధుల సమీకరణ కోసం ఏడాదిలో 300 రోజులు విమానాల్లో తిరుగుతూ ఉండాల్సి వచ్చేది. తన వద్ద ఉన్న వనరులు.. తన కలలకు మ్యాచ్ కాని వేళలో.. సాధించాలనే పట్టుదల ఆయన్ను నిద్ర పోనిచ్చేది కాదంటారు. అదే ఆయన్ను ఈ రోజున వేలాది కోట్లకు అధిపతిని చేసిందని చెప్పాలి.

బ్యాంకు రుణాలు.. పబ్లిక్ ఇష్యూ ద్వారా కాపర్ మెల్టింగ్ పరిశమ్ర స్థాపనకు అవసరమైన రూ.600 కోట్ల నిధులను సమీకరించటమే కాదు.. ఏకంగా 24 వేల మందికి ఉద్యోగాల్ని ఇవ్వటం అనిల్ అగర్వాల్ కే చెల్లింది. ఆయన స్థాపించిన ఫ్యాక్టరీ ఉత్తత్పి సామర్థ్యం ఏడాదికి 60వేల టన్నుల నుంచి ఏకంగా 4 లక్షల టన్నులకు చేరుకోవటం చూస్తే.. ఆయన కష్టం ఎంతన్నది ఇట్టే అర్థమవుతుంది. సాధించాలనే పట్టుదల ఉన్న వారు శ్రమిస్తే సరిపోతుందని.. అందుకు అవసరమైన పెట్టుబడులు సైతం వస్తాయంటారు. ‘మీరెంత ఎత్తుకు వెళ్లాలనుకుంటే అంత ఎత్తుకు వెళ్లేందుకు ప్రయత్నించండి. మీరు వెళ్లటం ఖాయం’ అంటూ యువ పారిశ్రామికవేత్తలకు సూచనలు చేస్తుంటారు.
Tags:    

Similar News