రైతును అవమానించిన ఉదంతం పై ఆనంద్ మహీంద్రా స్పందన ఇదే

Update: 2022-01-26 05:48 GMT
కారు కొనటానికి వచ్చిన రైతును.. కర్ణాటకలోని మహీంద్రా షోరూం ఉద్యోగి ఒకరు అవమానించటం.. జేబులో రూ.10 ఉండవుకానీ రూ.10లక్షల కారు కొనేందుకు వస్తారంటూ ఎటకారం ఆడిన ఉదంతం తెలిసిందే. మహీంద్రా షోరూం ఉద్యోగి మాటల్ని సీరియస్ గా తీసుకున్న సదరు రైతు గంట వ్యవధిలో రూ.10లక్షల తీసుకురావటం.. బండి డెలివరీ ఇవ్వాలని డిమాండ్ చేయగా.. వెయిటింగ్ పిరియడ్ లో ఉందని చెప్పటం తెలిసిందే.

దీంతో.. తనకు జరిగిన అవమానంపై క్షమాపణలు చెప్పాలని సదరు రైతు డిమాండ్ చేయగా.. షోరూం ఉద్యోగి అందుకు ససేమిరా అనటం.. వాగ్వాదం చోటు చేసుకోవటంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. విషయం మొత్తం విని.. షోరూం ఉద్యోగి చేత సదరు రైతుకు సారీ చెప్పించారు. దీనికి సంబంధించిన వీడియోల్ని పలువురు మహీంద్రా కంపెనీ అధినేత ఆనంద్ మహీంద్రా ట్విటర్ ఖాతాకు జత చేశారు.

ఈ ఉదంతంపై తాజాగా ఆనంద్ మహీంద్రా స్పందించారు. రైతుకు అవమానం జరిగిన ఉదంతంపై ఆయన ట్వీట్ చేస్తూ.. కస్టమర్లకు మర్యాద ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని.. బాధ్యులపై త్వరితగతిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తన ట్విటర్ ఖాతాలో ట్వీట్ చేసిన ఆయన.. ‘‘మా కంపెనీ ప్రధాన ఉద్దేశం.. అన్ని వర్గాల వారిని డెవలప్ చేయటమే. వ్యక్తుల మర్యాదను కాపాడటం మా ప్రధానమైన నైతిక విలువ. మా సిద్ధాంతాన్ని ఎవరు అతిక్రమించినా.. వారిపై తక్షణమే చర్యలు ఉంటాయి’’ అని పేర్కొన్నారు. వైరల్ గా మారిన ఈ ఉదంతంపై మహీంద్రా షోరూం ఉద్యోగి తీరును నెటిజన్లు తీవ్రంగా తప్పు పట్టారు. ఆనంద్ మహీంద్రా స్పందనతో ఈ ఇష్యూ ఇక్కడితో  సమిసిపోయినట్లేనని చెబుతున్నారు. మరి.. దీనికి సంబంధించిన అప్డేట్ ను ఆనంద్ మహేంద్ర ఏమైనా చెబుతారేమో చూడాలి.
Tags:    

Similar News