అధికారులు నీళ్లమ్ముకుంటున్నారు..వైసీపీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్

Update: 2020-06-04 23:30 GMT
ఈ ఏడాది పాలనలో తన సొంత నియోజకవర్గం వెంకటగిరికి ఏమీ చేయలేకపోయానని సీనియర్ పొలిటిషియన్, వైసీపీ నేత, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామ నారాయణ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్ చెప్పిన మాటను సైతం అధికారులు వినడం లేదని, జలవనరుల శాఖలోని అధికారులే నీళ్లను అమ్ముకుంటున్నారని ఆనం సంచలన వ్యాఖ్యలు చేశారు. జిల్లా అధికారుల తీరు దారుణంగా ఉందని, వెంకటగిరి నియోజకవర్గాన్ని అధికారులు మర్చిపోయారని ఆనం ఆవేదన చెందారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంత దారుణమైన పరిస్థితులు ఎప్పుడూ చూడలేదని ఆనం అన్నారు. తన నియోజకవర్గ ప్రజలకు నేరుగా అందే సంక్షేమ కార్యక్రమాలు తప్ప...మిగతా ఏ కార్యక్రమాలనూ తాను చేయలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆనం చేసిన వ్యాఖ్యలు నెల్లూరు జిల్లాతో పాటు ఏపీ వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఆ వ్యాఖ్యలు దుమారం సద్దుమణగక ముందే....ఆనం మరోసారి అధికారుల తీరుపై మండిపడ్డారు. నియోజకవర్గ అభివృద్ధికి అధికారులు సహకరించడం లేదని ఆనం ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు గంగ జలాలను తన నియోజకవర్గంలోని కండలేరుకు కాకుండా వేరే ప్రాంతాలకు తరలించడం సరికాదని ఆనం అన్నారు. నీటి పారుదల శాఖాధికారులు నీళ్లు అమ్ముకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు తెలియకుండా తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేయడం వింతగా ఉందని, తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇటువంటి పరిస్థితులు ఎన్నడూ చూడలేదని ఆనం అన్నారు.
Tags:    

Similar News