ఆప్ బుకాయింపులు నో యూజ్ !

Update: 2018-02-22 06:18 GMT
ఎమ్మెల్యేలు కాగానే.. వీధి రౌడీ కూడా తనకు కొమ్ములు వచ్చేసినట్లుగా భావిస్తాడు. అధికారుల మీద హూంకరించడం, విచక్షణ లేకుండా చేయి చేసుకోవడానికి ప్రయత్నించడం ఇలాంటి వాటికి కూడా బరితెగించే వాళ్లుంటారు. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు చివరికి మహిళా అధికారుల పట్ల కూడా ఎంత లేకిగా ప్రవర్తించిన సందర్భాలు మనకున్నాయో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు.

అయితే ఢిల్లీలో జరిగిన సంఘటన వేరు. ఇద్దరు ఎమ్మెల్యేలు సీఎం కేజ్రీవాల్ ఇంట్లో - ఆయన సమక్షంలో ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ మీద చేయి చేసుకుని కొట్టారు. ఇది అనూహ్యమైన సంగతి. ఆయన ఫిర్యాదు మేరకు ప్రస్తుతం వారిద్దరూ అరెస్టు అయ్యారు. పోలీసు కస్టడీకి మాత్రం కోర్టు అనుమతించకపోవడంతో.. జ్యుడీషియల్ కస్టడీలోనే వారి విచారణ జరగనుంది.

వివాదం రేగిన తర్వాత సహజంగానే ఆప్ దీనిని ఖండించింది. ఇలాంటి విషయాల్లో ముందుండి తన వాదన ఏమిటో స్పష్టంగా తెలియజేయాల్సిన నవతరం రాజకీయవేత్త కేజ్రీవాల్ అనుమానాస్పదమైన మౌనాన్ని ఆశ్రయించారు. ఆప్ పార్టీ ఆరోపిస్తున్నది ఏంటంటే.. ఇదంతా కేంద్రం ఆప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నడిపిస్తున్న కుట్ర అంటోంది. చీఫ్ సెక్రటరీ అన్షు ప్రకాష్ భాజపా తరఫున పనిచేస్తున్నారని ఆరోపణలు గుప్పిస్తోంది. ఇలాంటి ఆరోపణలు కూడా సహజమే అని అనుకోవచ్చు.
Read more!

కాకపోతే.. అసలు దాడిచేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ ఎమ్మెల్యే అమానుతుల్లా ఖాన్ మరో అడుగు ముందుకేసి.. రాష్ట్రంలోని ఆప్ సర్కారును రద్దు చేయడానికే ఇలాంటి ఆరోపణలు తెరమీదికి తెచ్చారని మరో విమర్శ చేస్తున్నారు. ఒక చీఫ్ సెక్రటరీ పై ఎమ్మెల్యే దాడిచేసినంత మాత్రాన ప్రభుత్వాన్ని రద్దు చేసేట్లయితే.. ఈ దేశంలో చాలా ప్రభుత్వాలు అల్పాయుష్షుతోనే పోతుండేవి. ఇలాంటి పలాయనవాద ప్రత్యారోపణలు దిగడం వల్ల ఆప్ క్రెడిబిలిటీ పెరగదు అనే సంగతిని ఈ ఎమ్మెల్యేలు గుర్తించాలి.

మరోవైపు ఐఏఎస్ అధికారులు ఎమ్మెల్యేలపై చర్య తీసుకోవడం గురించి రాష్ట్రపతి రాంనాధ్ కోవింద్ ను కలవడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. కేంద్రం హోంమంత్రి రాజ్ నాధ్ సింగ్ కు ఇప్పటికే ఫిర్యాదు చేశారు. కాకపోతే పోలీసులు ఎంత విజ్ఞప్తి చేసినప్పటికీ.. నిందితులను రెండు రోజుల విచారణకు కూడా పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించకపోవడం అనేది వారికి భంగపాటుగా ఉంది. మొత్తానికి కేజ్రీవాల్ పెదవి విప్పితే మరో రకంగా ఉండగల ఈ కేసు పీటముడి బిగుస్తున్నట్లుగా ఉన్నదని అనిపిస్తోంది.
Tags:    

Similar News