తక్షణమే ఫరూక్ భద్రత తొలగిస్తే బెటర్

Update: 2015-11-29 04:38 GMT
వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాకు కొత్తేం కాదు. కలలో కూడా ఊహించని మాటలు ఆయన నోటి వెంట అలవోకగా వచ్చేస్తుంటాయి.  ఇష్టారాజ్యంగా నోరు పారేసుకున్నా..  పెద్దగా ఖండిపులు లేకపోవటం.. ఇంత బాధ్యతారాహిత్యంతో ఎలా మాట్లాడతారన్న ప్రశ్నలు ఎవరూ అడగని పరిస్థితి. మిగిలిన అంశాల మీద స్పందించటంతో పాటు.. దేశంలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయంటూ ఆందోళన వ్యక్తం చేసే వారిలో చాలామంది ఫరూక్ అబ్దూల్లా లాంటి వారు చేసే వ్యాఖ్యలపై కిక్కురమనరు.

ఇదొక్కటే కాదు.. బాలీవుడ్ సెలబ్రిటీలు.. మానవహక్కుల గురించి మాట్లాడే పెద్ద పెద్ద పోటుగాళ్లకు సైతం ఫరూక్ లాంటి వారు చేసే వ్యాఖ్యలు అస్సలు వినిపించకపోవటం గమనార్హం. రెండు రోజుల కిందట పాక్ అక్రమిత కశ్మీర్ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసి.. ఆ ప్రాంతం పాక్ దేనని తేల్చేసిన ఈ పెద్దమనిషి ఈసారి మరింత పెట్రేగిపోయారు.

భారత సైన్యమంతా కలిసినా.. జమ్మూకశ్మీర్ లోని ఉగ్రవాదులు.. మిలిటెంట్లను ఎదుర్కొనలేరంటూ వ్యాఖ్యానించారు. తనతో సహా ఎవరినైనా ఉగ్రవాదులు చంపేస్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదుల మీద పోరాడే సైన్యం.. వారితో పోరాటం చేస్తూ ప్రాణాలు కోల్పోయిన ఎంతోమంది అమరులను అవమానించేలా వ్యాఖ్యలు చేసిన ఫరూక్ ఏం చెప్పదలుచుకున్నారన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.

తన చుట్టూ ఉన్న భద్రతా సిబ్బంది ఉన్నా.. లెక్కచేయకుండా ఉగ్రవాదులు తనను చంపేస్తారని.. భారత సైన్యం మొత్తం మొహరించిన ఉగ్రవాదుల్ని నిలువరించలేమన్నారు. మరిన్ని నిజాలు తెలిసిన ఫరూక్ లాంటి నేతలకు కల్పిస్తున్న భద్రతను ఉపసంహరిస్తే బెటర్. ఎందుకంటే.. ఉగ్రవాదులు అనుకోవాలే కానీ.. ఆయన చుట్టూ ఉన్న భద్రతా సిబ్బందిని దాటుకొని మరీ చంపేస్తారని ఆయనే చెబుతున్నప్పుడు.. ఆయన బతుకు మొత్తం ఉగ్రవాదుల దయ మీదన్న విషయాన్ని ఆయన చెప్పకనే చెప్పేశారు. అలాంటప్పుడు.. ఆయన తన భద్రతను ఉపసంహరించుకోవటం ద్వారా.. ప్రభుత్వ ఖజానా మీద కాస్త భారం తగ్గించిన వారు అవుతారు. ఉగ్రవాదుల సామర్థ్యం గురించి చెప్పే క్రమంలో.. తనను కంటికి పాపలా భద్రత కల్పిస్తున్న పోలీసు సిబ్బంది మనో ధైర్యాన్ని కుంగదీసేలా మాట్లాడటం సమంజసమా..?
Tags:    

Similar News