తండ్రీ.. కొడుకుల లొల్లి తేలకుంటే సై‘కిల్లే’

Update: 2017-01-09 05:46 GMT
తండ్రీ కొడుకుల మధ్య లొల్లి ఒక కొలిక్కి రాలేదు. రాజీ కోసం వారిద్దరి మధ్య ఓ పక్క ప్రయత్నాలు సా..గుతూనే.. మరోపక్క పార్టీ ఎన్నికల గుర్తు సైకిల్ కోసం హోరాహోరీగా ప్రయత్నాలు చేసుకుంటున్నాయి. ఇందుకోసం పార్టీకి చెందిన ఎంపీలు.. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలలో తమకే అధిక్యత ఉందన్న విషయాన్ని చాటుకునే ప్రయత్నాల్ని చేస్తున్నారు. ఢిల్లీ కేంద్రంగా సాగుతున్న ఈ బలప్రదర్శనకు సంబంధించిన లెక్క ఎప్పటికి ఒక కొలిక్కి వస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

ఫిబ్రవరి 2న మొదటి దశ ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో.. ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 17న విడుదల కానుంది. ఆ లోపు కానీ.. తండ్రీ కొడుకుల మధ్య తగదా ఒక కొలిక్కి రాకుంటే.. అది ఇద్దరికి నష్టమేనన్న వాదన వినిపిస్తోంది. పార్టీలో ఎవరి అధిక్యత ఎంతన్న విషయంపై ఈ రోజు (సోమవారం) ఎన్నికల సంఘం ముందు తేల్చుకునే దిశగా ప్రయత్నాలు సాగుతున్నట్లుగా చెబుతున్నారు. ఈ ప్రదర్శన మొత్తం పార్టీ గుర్తు ‘సైకిల్’ కోసమేనని చెప్పక తప్పదు.
Read more!

తండ్రీ కొడుకుల మధ్య సాగుతున్న లడాయిలో ప్రజాప్రతినిధులు ఎవరి పక్షాన ఎక్కువ ఉంటే వారికే సైకిల్ గుర్తును కేటాయిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకునే వీలుందనిచెబుతున్నారు. ఒకవేళ.. ఇద్దరి బలం సమానం అయితే మాత్రం పార్టీ గుర్తు ఎవరికి కేటాయించాలన్నది తేల్చలేని పరిస్థితి ఏర్పడితే మాత్రం సైకిల్ గుర్తును స్తంభింపచేస్తూ నిర్ణయం తీసుకునే వీలుందని తెలుస్తోంది.

అదే సమయంలో.. తండ్రీ కొడుకుల మధ్య అధిక్యత ఎపిసోడ్ ఈనెల17 లోపు తేలకున్నా.. సైకిల్ గుర్తును ఫ్రీజ్ చేయటం పక్కా అని చెబుతున్నారు. ఎంత త్వరగా ఎవరైతే తమ బలాన్ని ఎన్నికల సంఘం ముందు ప్రదర్శిస్తారో వారిదే పార్టీ ఎన్నికల గుర్తు సొంతమయ్యే వీలుందని చెబుతున్నారు. ఒక పక్క సయోధ్య కోసం ప్రయత్నాలు సాగుతూనే.. మరోవైపు పార్టీ గుర్తుకోసం ఎవరిప్రయత్నాలు వారు చేస్తున్న వైనం నేపథ్యంలో.. తండ్రీ కొడుకుల మధ్య రాజీ జరిగే అవకాశం లేదని చెబుతున్నారు. ఏది ఏమైనా.. ఎన్నికల గుర్తు కోసం జరుగుతున్న ప్రయత్నాలు.. ఇరు వర్గాలు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాయి. అంతిమంగా సైకిల్ ఎవరి సొంతం అవుతుందో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News