వారికున్న కన్సర్న్.. కూడా మనకు లేకుంటే ఎలా?

Update: 2018-02-06 12:54 GMT
తెలుగు రాష్ట్రం విభజన వల్ల నష్టపోయింది ఆంధ్రప్రదేశ్ మాత్రమే. కేంద్రం నుంచి చేయూత అందవలసింది ఆంధ్రప్రదేశ్ కే. అందుకే విభజన చట్టంలోనే ప్రత్యేకహోదాను ప్రకటించారు. దీనిని పదేళ్లపాటూ అమలు చేస్తాం అనే ప్రగల్భాల హామీని గుప్పించి నరేంద్రమోడీ - పదిహేనేళ్లపాటూ అమలు చేయించడానికి ప్రయత్నిసాతం అనే హామీతో చంద్రబాబునాయుడు  అధికారంలోకి వచ్చారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఈ ఇద్దరు పాలకులూ దానిని తుంగలో తొక్కేశారు. ఉభయులూ కుమ్మక్కు అయినట్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు గండి కొట్టారు. కానీ.. ఇవాళ పరిణామాలను గమనిస్తే ‘‘ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరిగింది. వారికి జరిగిన అన్యాయాన్ని చక్కదిద్దడానికే ప్రత్యేకహోదా ఇస్తాం అని ఆరోజు సభలో ప్రధాని హామీ ఇచ్చారు. దాన్ని నెరవేర్చాల్సిందే’’ అని పంజాబ్ లోని అకాలీదళ్ కు చెందిన ఎంపీ నరేష్ గుజ్రాల్ వ్యాఖ్యానిస్తున్నారు. మన రాష్ట్రానికి ఏం అన్యాయం జరిగింది.. దేనికోసం మనం పోరాడాలి అనే విషయంలో.. మనతో ఏ సంబంధమూ లేని దూరప్రాంత రాష్ట్ర నేతకు ఉన్న కన్సర్న్ కూడా మన రాష్ట్రపాలకులకు లేకపోతే ఎలా అనే భావన ప్రజల్లో కలుగుతోంది.

నరేష్ గుజ్రాల్ ఓ జాతీయ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోడీ సర్కారు ద్వంద్వ ప్రమాణాలను ఎండగట్టారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తాం అని సభాముఖంగా చెప్పి.. తర్వాత మాట దాటేశారని.. జీఎస్టీ వచ్చాక కుదరదని బుకాయించారని అన్నారు. (జీఎస్టీ వచ్చాక కూడా కొన్ని రాష్ట్రాలకు హోదా కొనసాగుతోంది). ఆ రాష్ట్రానికి కేంద్రం చాలా సాయం చేయాల్సి ఉన్నదని తాను వ్యక్తిగతంగా భావిస్తున్నట్లు అకాలీదళ్ ఎంపీ స్పష్టం చేశారు.

ఎక్కడో ఉన్న పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఎంపీకి ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయంపై అంత కన్సర్న్ ఉన్నప్పుడు.. ఈ రాష్ట్రంలో పరిపాలన సాగిస్తున్న చంద్రబాబునాయుడుకు లేకపోతే ఎలా అనే ప్రశ్న ఇప్పుడు ప్రజల్లో ఉత్పన్నం అవుతోంది.

మరో కోణంలోంచి చూసినప్పుడు ఈ అకాలీదళ్ ఎంపీకి ఉన్న ధైర్యం కూడా మన ముఖ్యమంత్రి కి లేదని అర్థమవుతోంది. ఎందుకంటే.. ‘‘మిత్రపక్షాలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఉండే నిర్ణయం ఏకపక్షంగా ఆర్థికమంత్రి జైట్లీ తీసుకుని ఉంటారని తాను అనుకోవడం లేదని, ఇంకా ఉన్నత స్థాయిలో నిర్ణయాలు జరిగి ఉండవచ్చునని’’ నరేష్ గుజ్రాల్ అన్నారు. అంటే ఇండైరక్టుగా ఆయన ప్రధాని మోడీ ప్రమేయంతోనే ఏపీకి అన్యాయం జరిగిందని అన్నట్లుగానే ఈ వ్యాఖ్యలు ఉన్నాయి. పంజాబ్ ఎంపీ చెప్పినంత స్పష్టంగా మన రాష్ట్ర పాలకులు చెప్పలేకపోవడం ఘోరం అని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.
Tags:    

Similar News