‘వార్నింగ్ బెల్స్’ను పసిగట్టటంలో ఫెయిల్యూరే కారణమా?

Update: 2020-08-08 06:30 GMT
కోజికోడ్ విమాన దుర్ఘటనకు సంబంధించిన విశ్లేషణలు ఇప్పుడు మొదలయ్యాయి. ప్రమాదానికి కారణం ఏమిటి? అసలేం జరిగింది? ఎందుకు జరిగింది? లాంటి అంశాలతో పాటు.. ప్రమాదానికి కాస్త ముందుగా ఏం జరిగిందన్న అంశంపై ఇప్పుడు పలువురు ఫోకస్ చేస్తున్నారు. అదే సమయంలో.. గ్లోబల్ ఫ్లైట్ ట్రాకర్లు కొందరు ఈ ప్రమాదానికి దారి తీసిన పరిస్థితుల్ని జాగ్రత్తగా అధ్యయనం చేస్తున్నారు. ఈ సందర్భంగా కొత్త విషయాలు తెర మీదకు వస్తున్నాయి.

లాక్ డౌన్ నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయుల్ని వందే భారత్ కార్యక్రమంలో భాగంగా స్వదేశానికి తీసుకురావటం తెలిసిందే. అదే రీతిలో దుబాయ్ నుంచి 191 మంది(సిబ్బందితో కలుపుకొని) బయలుదేరిన విమానం శుక్రవారం రాత్రి ఏడున్నర గంటల ప్రాంతంలో కోజికోడ్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యింది. ఆ వెంటనే వర్షపునీరు కారణంగా కారణంగా అదుపు తప్పి.. పక్కనున్న లోయలో పడటంతో భారీ ప్రమాదానికి కారణమైంది.

విమానం రెండుముక్కలుగా అయ్యిందంటేనే ప్రమాద తీవ్రత ఎంత ఎక్కువన్న విషయం అర్థం కాక మానదు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 19 మంది మరణించినట్లుగా తేలింది. కోజికోడ్ ఎయిర్ పోర్టు టేబుల్ టాప్ రన్ వే అన్న విషయాన్ని మర్చిపోకూడదు. దేశంలో ఇలాంటివి మూడు మాత్రమే ఉన్నాయి. ఇలాంటి చోట్ల విమానాల్ని ల్యాండ్ చేయటం చాలా కష్టమైనది. వాస్తవానికి తాజా బోయింగ్ 737 విమానాన్ని కోజిడ్ ఎయిర్ పోర్టుకు అనుమతించకూడదు. మరెందుకు అనుమతించారన్నది ప్రశ్న. అదే సమయంలో.. వర్షం జోరుగా ఉన్న వేళ.. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు.

మరో కీలక అంశం ఏమంటే.. విమానం ల్యాండ్ కావటానికి ముందు పైలెట్ రెండుసార్లు ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నించి.. కుదర్లేదని.. మూడో ప్రయత్నంలో తాజా ప్రమాదం చోటు చేసుకుందని చెబుతున్నారు. వాస్తవానికి రెండుసార్లు ల్యాండ్ చేయటానికి కుదరకపోవటం.. వాతావరణం ప్రతికూలంగా ఉన్న విషయాల్ని చూసినప్పుడు పైలెట్ కు డేంజర్ బెల్స్ మోగాల్సిన అవసరం ఉంటుంది. తన మీద.. తన సామర్థ్యం మీద ఉన్న నమ్మకంతో మూడో ప్రయత్నం చేశారా? అన్నది ప్రశ్న. ఈ సందేహానికి సమాధానం చెప్పేవారే లేరు. ఎందుకంటే.. ఇద్దరు పైలట్లు ప్రమాదంలో కన్నుమూయటం తెలిసిందే.

విమానం క్రాష్ కావటానికి ముందు రెండుసార్లు ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నించిన విషయాన్ని తాజాగా ఫ్లైట్ ట్రేడర్ 24 అనే స్వీడిష్ సంస్థ ఒక మ్యాప్ లో రియల్ టైమ్ కమర్షియల్ ఫ్లైట్ ట్రాకింగ్ చేసిన సందర్భంగా గర్తించారు. ఈ నేపథ్యంలో.. పైలట్ తన మీద... తన సామర్థ్యం మీద.. తనకున్నవిశేష అనుభవం మీద ఉన్న నమ్మకంతో ఉండి ఉంటారన్న అభిప్రాయం కలుగక మానదు. ఏ మాత్రం ముప్పును పసిగట్టినా.. ఆయన మూడోసారి ల్యాండ్ చేసే ప్రయత్నం చేసి ఉండేవారు కాదన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News