న‌టి గుండె అనేక‌సార్లు ఆగిపోయింది..!

Update: 2022-11-19 02:30 GMT
సినీప‌రిశ్ర‌మ‌ల్లో వ‌రుస విషాదాలు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. టాలీవుడ్ లో సూప‌ర్ స్టార్ కృష్ణ గుండె నొప్పితో మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే. వ‌య‌సు సంబంధ సమ‌స్య‌లు ఉన్నా హార్ట్ ఎటాక్ ఆయ‌న మ‌ర‌ణానికి కార‌ణం. ఇప్పుడు 25 ఏళ్ల‌ బెంగాలీ నటి ఐంద్రీలా శర్మ మంగళవారం పలుమార్లు గుండెపోటుతో బాధపడుతూ వెంటిలేటర్ సపోర్టుపై ఉన్నారు. ఆమె ప్రస్తుతం కోల్ కతా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆస్ప‌త్రి వైద్యుల‌ వివ‌రాల‌ ప్రకారం ఆమెకు కార్డియోపల్మోనరీ రిససిటేషన్ (CPR) ఇచ్చారు. త‌న‌ ఆరోగ్యం చాలా క్రిటిక‌ల్ గా ఉంది.

బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో నవంబర్ 1న ఐంద్రీలా శ‌ర్మ‌ ఆస్పత్రిలో చేరారు. ఆమెకు ఇంట్రాక్రానియల్ హెమరేజ్ ఉంది. ఎడమ ఫ్రంటోటెంపోరోపారిటల్ డి-కంప్రెసివ్ క్రానియోటమీ సర్జరీ చేయించుకోవలసి వచ్చింది. బెంగాళీ మీడియా క‌థ‌నాల ప్ర‌కారం.. స‌ద‌రు న‌టికి కొత్త CT స్కాన్ నివేదికలు త‌న‌ మెదడులో రక్తం గడ్డకట్టడాన్ని చూపించాయి. ఆ గ‌డ్డలు అప్ప‌టికే ఆపరేషన్ చేసిన మెదడుకు ఎదురుగా ఉన్నాయి. గడ్డకట్టడాన్ని ఆప‌డానికి వైద్యులు ఆమెకు మందులను అందించినా ఇన్ఫెక్షన్ ప్రమాదకరంగా మారింద‌ని ధృవీక‌రించారు.

ఆమె బాయ్ ఫ్రెండ్- నటుడు సభ్య‌సాచి చౌదరి సోషల్ మీడియాలో ఈ వార్త‌ను పంచుకున్నారు. త‌న‌ కోసం ప్రార్థనలు చేయాల్సిందిగా అభిమానులను అభ్యర్థించారు. సామాజిక మాధ్య‌మాల వేదిక‌గా అత‌డు త‌న ఆవేద‌న‌ను ఇలా రాసుకొచ్చారు. ``ఇక్కడ రాస్తానని ఎప్పుడూ అనుకోలేదు. అయితే ఈ రోజు.. ఐంద్రిలా కోసం ప్రార్థించండి.. ఒక అద్భుతం కోసం ప్రార్థించండి.. అతీంద్రియ శక్తుల కోసం ప్రార్థించండి... ఆమె మానవులకు అతీతంగా అన్ని అసమానతలకు వ్యతిరేకంగా పోరాడుతోంది``అని రాశాడు.

క్యాన్సర్ సర్వైవర్ అయిన ఐంద్రిలా శ‌ర్మ‌ ఈ నెల ప్రారంభంలో బ్రెయిన్ స్ట్రోక్ కు గురయ్యారు. ఆమె `ఝుమూర్` షోతో టీవీ రంగంలో అరంగేట్రం చేసింది.  జిబోన్ జ్యోతి - జియోన్ కతి వంటి ప్రముఖ షోలలో నటించింది. ఇప్పుడు పిన్న వ‌య‌సులోనే గుండె నొప్పి.. మెద‌డు సంబంధ స‌మ‌స్య‌ల‌తో వెంటిలేట‌ర్ పై కొన ఊపిరితో ఉండ‌డం అభిమానుల‌ను క‌ల‌చి వేస్తోంది. క్యాన్స‌ర్ వ‌ల్ల స‌మ‌స్య వెంట స‌మ‌స్య త‌న‌ని వెన్నాడాయి. ప‌లుమార్లు గుండె నొప్పి తీవ్ర‌త‌ర‌మైంది.

న్యూరాల‌జిస్టుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో..!

నేటి సాయంత్రం బులెటిన్ ప్ర‌కారం.. నటి ఐంద్రీలా శర్మ ఇప్పటికీ ఆసుపత్రిలో తీవ్రంగా పోరాడుతోంది. తాను కోలుకునేందుకు ఆరోగ్య ప‌రంగా ఏమాత్రం ఆశాజనక ఫ‌లితం లేదు. ఆమె శరీరంలో ఇంకా ఇన్ఫెక్షన్ ఉంది. ఆమె రక్తపోటు ఇంకా మారుతూనే ఉంది. అంతేకాకుండా ఆమె కంటి శరీర కదలికలో తక్కువ ప్రతిస్పందన కనిపించింది. ప్రభుత్వ- ప్రైవేటు ఆసుపత్రికి చెందిన న్యూరాలజిస్టుల బృందం ఆమెను నిశితంగా ప‌రిశీలిస్తోంది. బుధవారం కార్డియాక్ అరెస్ట్ తర్వాత పెద్దగా మెరుగుదల కనిపించలేదు.

అంతేకాదు... ఐంద్రిలా గ్లాస్గో కోమా స్కేల్ లో తక్కువ స్కోర్ ను కలిగి ఉంది. ఇది కంటికి సంబంధించి అలాగే శరీర అనుబంధంగా శబ్ద కదలికల చురుకుదనాన్ని సూచిస్తుంది. సాధారణ ఆరోగ్యవంతమైన వ్యక్తికి స్కోర్ 14/15 ఉండాలి. కానీ ఐంద్రిలాకు 3 స్కోరు ఉంది. దీని అర్థం ఆమె కంటి శరీర కదలిక చాలా బలహీనంగా ఉన్నాయ‌ని నిరూప‌ణ అయ్యింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News