కన్నీళ్లు తెప్పించే యాక్సిడెంట్

Update: 2021-03-28 17:24 GMT
రహదారుల రక్తదానానికి అంతుపొంతూ లేకుండా పోతోంది. వాహనదారుల నిర్లక్ష్యం.. అజాగ్రత్త.. అతి వేగంతో పాటు.. రోడ్ల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలు.. వెరసి నిత్యం పెద్ద ఎత్తున ప్రమాదాలు జరగటమే కాదు.. ప్రాణాలు పోతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. అన్ని ప్రమాదాలు ఒకలా ఉండవన్న దానికి నిదర్శనంగా విశాఖలోని ఎన్ ఏడీ జంక్షన్ లో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదం గురించి విన్నంతనే కన్నీళ్లు రావటం ఖాయం.

ఎయిర్ పోర్టు పోలీసులు వెల్లడించిన సమాచారం ప్రకారం.. గాజువాకకు చెందిన గీతాకుమారిని బీఈడీలో చేర్చేందుకు ఆమె తండ్రి ఈ రోజు ఉదయం టూవీలర్ మీద ఎంవీపీ కాలనీకి బయలుదేరారు. వారి ప్రయాణం సాఫీగా సాగుతున్న వేళ.. అనుకోని రీతిలో ఎన్ఏడీ జంక్షన్ సమీపంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి దాటిన తర్వాత వెనుక నుంచి వస్తున్న ప్రైవేటు బస్సు వీరి వాహనాన్ని ఢీ కొంది. దీంతో టూవీలర్ మీద కూర్చున్న గీతా కుమారి అదుపు తప్పి కుడివైపుగా బస్సు వెనుక చక్రాల కింద పడిపోయింది.

జరిగిన ప్రమాదాన్ని గుర్తించే విషయంలో జరిగిన ఆలస్యం.. బస్సు డ్రైవర్ భారీ తప్పిదంతో.. ఆమె నడుము మీదుగా బస్సు వెళ్లిపోవటంతో పాటు.. కొంతదూరం ఈడ్చుకెళ్లింది. దీంతో.. ఆమె కడుపు భాగమంతా తీవ్ర గాయాలు అయ్యాయి. రోడ్డుకు మరో వైపున ఆమె తండ్రి పడిపోయి స్వల్ప గాయాలు అయ్యాయి. ప్రమాదంతో చోటు చేసుకున్న షాక్ తో.. తనకేం జరిగిందో గుర్తించలేని గీతా కుమారి.. ‘నాన్న.. నన్ను వచ్చి విడిపించు.. విడిపించు’ అంటూ రోదించిన తీరు అక్కడి వారిని కళ్లు చెమ్మగిల్లేలా చేయటమే కాదు.. విన్న వారంతా వేదనకు గురయ్యే పరిస్థితి. ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స చేసే సమయానికి మరణించారు. కడుపు భాగంలో రక్తస్రావం తీవ్రంగా కావటంతో ఆమె మరణించినట్లుగా వైద్యులు వెల్లడించారు. గీతా కుమారికి అన్న.. తమ్ముడు ఉన్నారు. ఇంట్లో ఒక్కతే ఆడపిల్ల కావటంతో అల్లారుముద్దుగా పెంచారు. ఇంటికి మహాలక్ష్మిగా చూసుకోవటమే కాదు.. ఆమెను అలానే ట్రీట్ చేసేవారు. అలాంటి మహలక్ష్మి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవటాన్ని తట్టుకోలేని కుటుంబ సభ్యుల రోదన చుట్టుపక్కల వారిని తీవ్రంగా కదలించి వేస్తోంది. ఉన్నత చదువుకు వెళుతూ.. ఊహించని విధంగా ప్రాణాలు పోయిన తీరును జీర్ణించుకోలేకపోతున్నారు.


Tags:    

Similar News