పాయింట్ బ్లాంక్ రేంజ్ లో మావోల్నికాల్చినా.. చిన్న గాయం కాలేదట

Update: 2021-04-06 16:30 GMT
ఛత్తీస్ గఢ్ అడవుల్లో భద్రతా బలగాలకు.. మావోలకు మధ్య భీకర స్థాయిలోకాల్పులు జరపటం తెలిసిందే. కూంబింగ్ ఆపరేషన్లో కీలకంగా వ్యవహరించే జవాన్లు పెద్ద ఎత్తున మరణించటం.. అదే సమయంలో మావోలకు నష్టం తక్కువగా వాటిల్లటం తెలిసిందే. మావోల కాల్పుల్లో గాయపడి.. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జవాను ఒకరు మీడియాతో మాట్లాడిన సందర్భంగా చెప్పిన మాటలు సంచలనంగా మారాయి.

మావోలు అన్నంతనే అరకొర ఆయుధాలు.. సరైన ఆహారం లేక బక్కచిక్కినట్లుగా ఉండటం గతంలో చూశాం. తాజా ఎపిసోడ్ లో మాత్రం అందుకు భిన్నమైన అనుభవం తమకు ఎదురైనట్లుగా సదరు జవాను పేర్కొన్నారు. వాళ్లంతా పొడవుగా ఉన్నారని..వారిపై ఫైర్ చేస్తున్నా.. జంకు లేకుండా నిలబడినట్లు చెప్పాడు. అంతేకాదు.. వారంతా బుల్లెట్ ఫ్రూఫ్జాకెట్లు ధరించిన విషయాన్ని వెల్లడించారు.
‘‘ఒక్క ఒక్కరు పొట్టిగా లేరు. అంతా బలంగా ఉన్నారు. బారీ కసరత్తు చేసి..ప్రత్యేక శిక్షణ తీసుకున్న వారిలా కనిపించారు. అలాంటి వారిని మావోల్లో ఎప్పుడూ చూడలేదు. శారీరక వ్యాయామాల విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. గాయపడిన మావోల వద్దకు వారు కొండలు.. గుట్టలు.. అడవుల నుంచి పరుగెత్తికొచ్చిన తీరును చూస్తే ప్రత్యేక శిక్షణ తీసుకున్నట్లుగా అనిపించింది’’ అని జవాను పేర్కొన్నారు.

మావోలు గతంలో బక్కచిక్కినట్లుగా.. బలహీనంగా ఉండేవారని.. తాజాగా మాత్రం అందుకు భిన్నంగా బలంగా.. ఎత్తుగా ఉన్నట్లు చెప్పారు. ‘మాకు వాళ్లు అతి దగ్గరగా వచ్చారు సార్. పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్పులు జరిపాం. కానీ.. వాళ్లకు చిన్న గాయం కూడా కాలేదు. ముఖంలో భయం కనిపించలేదు. అంతా బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్లు ధరించారు’’ అని గాయపడిన జవాను చెప్పటం గమనార్హం. మావోల్లో ఇలాంటి వాళ్లను తామెప్పుడూ చూడలేని.. చూసేందుకే రాక్షసులుగా కనిపించారని.. కూంబింగ్ లో అనుభవం ఉన్నజవాన్లు చెప్పటం గమనార్హం.

ఇదంతా చూస్తే.. పీఎల్ జీఏ దళాలు ప్రత్యక్ష యుద్ధానికి అవసరమైన శిక్షణ తీసుకున్నారన్నది అర్థమవుతుంది. తాజా పరిణామం నేపథ్యంలో మావోల్ని ఎదుర్కొనేందుకు పాతకాలం పద్దతుల్ని పక్కన పెట్టేసి.. కొత్త తరహా పోరుకు భద్రతా సిబ్బంది సిద్ధం కావాలన్న విషయం అర్థమవుతుందని చెప్పక తప్పదు. తాజా ఎపిసోడ్ తర్వాత.. మావోలతో పోరు విషయంలో.. భద్రతా బలగాల్లో కాస్తంత తటపటాయింపు చోటు చేసుకునే వీలుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.



Tags:    

Similar News