మోడీ పదవులకు 20 ఏళ్లు _ సీఎంలు - పీఎంల రికార్డులు చెరిపేశారు

Update: 2020-10-08 05:30 GMT
పాలనలో ఎన్నో రికార్డులు సాధిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ పాలకుడిగానూ ఓ అరుదైన రికార్డు సాధించారు. పాలకుడిగా ఆయన 20 ఏళ్లు పూర్తి చేసుకుని దేశంలో ఇంకే ప్రధానికీ లేని రికార్డు సాధించారు. భారత దేశానికి ప్రధానిగా పనిచేసినవారిలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాధినేతగా అత్యంత ఎక్కువ కాలం ఉన్న నాయకుడు మోదీనే. 20 ఏళ్ల కిందట గుజరాత్ ముఖ్యమంత్రి అయిన ఆయన 2014 వరకు ఆ పదవిలో ఉండి 2014లో భారత ప్రధానిగా ఎన్నికై అప్పటి నుంచి అదే పదవిలో కొనసాగుతున్నారు.

గత 6,941 రోజులుగా ఆయన పాలకుడిగానే ఉన్నారు. భారత ప్రధానుల్లో ఎవరూ ఇంత సుదీర్ఘకాలం పాలకులిగా లేరు. మోదీ మొత్తం తన 6,941 రోజుల పాలనా కాలంలో 4607 రోజులు ముఖ్యమంత్రిగా ఉండగా 2334 రోజులు ప్రధానిగా ఉన్నారు. తన ఈ పాలనాకాలంలో ఎక్కడా గ్యాప్ లేకుండా 20 ఏళ్లు నిరంతరాయంగా ఉండడం విశేషం.

భారత ప్రధానుల్లో మోదీ తరువాత స్థానంలో నెహ్రూ ఉన్నారు. ఆయన 6130 రోజులు పాలకుడిగా ఉన్నారు. అయితే, ఆ మొత్తం కాలం ఆయన ప్రధానిగానే ఉండడం విశేషం.
 నెహ్రూ తరువాత ఇందిరాగాంధీ 5829 రోజులు పాలనలో ఉన్నారు. ఆమె కూడా ప్రధానిగా మాత్రమే పనిచేశారు.
ఇందిర తరువాత స్థానంలో మన్మోహన్ సింగ్ 3656 రోజులు(మొత్తం ప్రధానిగానే), మొరార్జీ దేశాయ్ 2511 రోజులు(1655 రోజులు ముఖ్యమంత్రిగా 856 రోజలు ప్రధానిగా) ఉన్నారు.
మొరార్జీ దేశాయి తరువాత స్థానాల్లో వాజపేయి, పీవీ, రాజీవ్, వీపీ సింగ్, దేవె గౌడ, చరణ్ సింగ్, లాల్ బహుదూర్ శాస్త్రి, ఐకే గుజ్రాల్, చంద్రశేఖర్, గుల్జారీలాల్ నంద ఉన్నారు.
ముఖ్యమంత్రుల్లో...
అయితే, ప్రధాన మంత్రులుగా పనిచేసినవారిని మినహాయిస్తే మోదీ కంటే సుదీర్ఘ కాలం పాలకులుగా ఉన్న నేతలు భారత్‌లో ఉన్నారు.  20 సంవత్సరాలకు పైగా ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్నవారు ఆరుగురు ఉన్నారు.

పవన్ కుమార్ చామ్లింగ్:
వీరిలో మొట్టమొదటి పేరు పవన్ కుమార్ చామ్లింగ్‌ది. చామ్లింగ్ 1994 డిసెంబరు 12 నుంచి 2019 మే 26 వరకు సిక్కిం రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. మొత్తం 24 సంవత్సరాల 165 రోజులు వరుసగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. దేశంలో ఇదే ఇప్పటివరకు రికార్డు. 2019 ఎన్నికల్లో సిక్కింలో బీజేపీ గెలవడంతో ఆయన అప్రతిహత పాలనకు బ్రేక్ పడింది.

జ్యోతిబసు: పవన్ కుమార్ చామ్లింగ్ తరువాత స్థానంలో జ్యోతిబసు ఉన్నారు. సీపీఎంకు చెందిన జ్యోతిబసు 1977 జూన్ 21 నుంచి 2000 సంవత్సరం నవంబరు 5 వరకు 23 సంవత్సరాల 137 రోజులు పశ్చిమబెంగాల్‌కు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన కూడా ఎక్కడా గ్యాప్ లేకుండా ఆ పదవిలో ఉన్నారు.

గెగాంగ్ అపాంగ్: అరుణాచల్ ప్రదేశ్ సీఎంగా గెగాంగ్ అపాంగ్ 22 సంవత్సరాల 8 నెలల 5 రోజులు ఉన్నారు. అయితే, ఆయన ఏకధాటిగా కాకుండా రెండు వేర్వేరు విడతల్లో అంతకాలం పదవిలో ఉన్నారు.

లాల్ తన్హావ్లా: మిజోరం ముఖ్యమంత్రిగా తన్హావ్లా 21 సంవత్సరాల 55 రోజులు పనిచేశారు. ఈయన 5 వేర్వేరు విడతల్లో పనిచేశారు.
వీరభద్రసింగ్: హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా వీరభద్రసింగ్ 21 సంవత్సరాల 11 రోజులు పాలించారు. ఈయన కూడా 5 వేర్వేరు పర్యాయాలు పాలించారు.

నవీన్ పట్నాయిక్: ఒడిశా ముఖ్యమంత్రిగా నవీన్ పట్నాయిక్ 2000 మార్చ్ 5 నుంచి ఇప్పటివరకు 20 సంవత్సరాల 214 రోజులుగా ఉన్నారు.
Tags:    

Similar News