రెండు ముక్కలైన విమానంలో నుంచి నిప్పు రాజుకోలేదెందుకు?

Update: 2020-08-08 17:30 GMT
అబద్ధం త్వరగా ప్రచారమవుతుంది. కానీ.. నిజం అంత త్వరగా బయటకు రాదు. అబద్ధానికి ఉన్నంత బలం కూడా ఉండదు. కానీ.. నిజానికి ఉన్న శక్తి ఒకసారి బయటకు వస్తే.. అప్పటివరకు పేరుకున్న అసత్యాల మేఘాలన్ని తేలిపోవటమే కాదు.. కళ్ల ముందుకు వచ్చిన నిజం చూపించే ప్రభావం అంతా ఇంతా కాదు. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన కోజికోడ్ విమాన దుర్ఘటనకు సంబంధించిన కొత్త నిజం తాజాగా బయటకు వచ్చింది. కోజికోడ్ లోని  టేబుల్ టాప్ రన్ వే మీద విమానాన్ని ల్యాండ్ చేయబోయి.. క్రాష్అయిన విమాన పైలెట్ ఎయిరిండియా పైలెట్.. కెప్టెన్ దీపక్ సాథె సాహసం.. ఆయన చేసిన ప్రాణ త్యాగం తాజాగా బయటకు వచ్చింది.

కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న ఆయన.. తనకున్న విశేష అనుభవంతో ఎందరి ప్రాణాలో కాపాడారు. ఆ క్రమంలో తన ప్రాణాల్ని పణంగా పెట్టిన వైనం తాజాగా బయటకు వచ్చింది. దీపక్ మిత్రుడు.. ఎన్ హెచ్ ఏఐ ఆర్థిక సలహాదారు నీలేశ్ సాథె తన ఫేస్ బుక్ ద్వారా పంచుకున్న వివరాలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

ల్యాండింగ్ గేర్లు పని చేయలేదేమో? అందుకే ఇంధనాన్ని పూర్తిగా ఖర్చు చేసేందుకువిమానాశ్రయం చుట్టూ మూడుసార్లు విమానాన్ని తిప్పారు. అదే నిప్పు రాజుకోకుండా కాపాడింది. అందుకే విరిగిపోయిన విమానంలో నుంచి కనీసం పొగ.. దుమ్ము కూడా రాలేదు.. విమానం జారిపోవటానికి ముందే ఆయన విమానం ఇంజిన్లను ఆఫ్ చేశారని పేర్కొన్నారు.
కాక్ పిట్ లో ఆయన పొట్ట ముందుకు వంగింది. విమానం కుడిరెక్క విరిగిపోయింది. పైలెట్ ప్రాణాలు వదిలి 180 మందిని కాపాడారని పేర్కొన్నారు. వారం క్రితమే తనతో మాట్లాడినట్లు పేర్కొన్నారు. ఎప్పటిలానే ఉత్సాహంగా మాట్లాడినట్లు చెప్పారు. దీపక్ కు చెందిన కొత్త విషయాన్ని ఆయన వెల్లడించారు. ఎయిర్ ఫోర్సులో చేరిన చాలా కొద్ది కాలానికే ఒక ప్రమాదంలో గాయపడ్డారని.. అప్పుడు ఆయన వయసు 19ఏళ్లు ఉండొచ్చన్నారు. తలకు దెబ్బ తగలటంతో ఆర్నెల్లు ఆసుపత్రిలో ఉన్నారన్నారు.

ఆ సమయంలో ఆయన మళ్లీ విమానం నడుపుతారని ఎవరూ అనుకోలేదని.. పట్టుదల.. ఆత్మవిశ్వాసంతో ఆయన మళ్లీ పరీక్షలో పాస్ అయి అర్హత సాధించారన్నారు. అలాంటి ఆయన తాజాగా కోజికోడ్ ప్రమాదంలో చనిపోయారన్నారు. కానీ.. తాను మరణించినా.. వీలైనంత ఎక్కువమందిని కాపాడాలని ఆయన చేసిన ప్రయత్నం ఫలించిందనే చెప్పాలి. ఒక సైనికుడు తన దేశ ప్రజల్ని కాపాడేందుకు ముందుంటారు. ఆ విషయాన్ని దీపక్ మరోసారి నిరూపించారు. హేట్సాఫ్ కెప్టెన్ దీపక్ సాథె. మీకు మా జోహార్లు.
Tags:    

Similar News