111 ఏళ్ల న‌డిచే దేవుడు...శివైక్యం చెందారు

Update: 2019-01-21 10:51 GMT
నడిచే దేవుడిగా క‌ర్నాట‌క‌లోకి భ‌క్తులు కీర్తించే సిద్దగంగ మఠాధిపతి శివకుమార స్వామీజీ సోమవారం కన్నుమూశారు. ఆయన వయసు 111 ఏళ్లు. కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం ఉదయం 11:44 గంటల సమయంలో తుది శ్వాస విడిచినట్లు కర్ణాటక ముఖ్యమంతి హెచ్‌ డీ కుమారస్వామి, డిప్యూటీ సీఎం పరమేశ్వర, కర్ణాటక బీజేపీ చీఫ్ యడ్యూరప్ప వెల్లడించారు. మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు స్వామీజీ అంత్యక్రియలు జరగనున్నాయి. మూడు రోజుల పాటు సంతాప దినాలుతోపాటు అన్ని స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలకు ఒక రోజు సెలవు ప్రకటించారు.

గ‌త కొద్దికాలంగా అనారోగ్యంగా ఉన్న శివకుమార స్వామీజీ ఆరోగ్యం సోమవారం ఉదయం నుంచి క్షీణిస్తూ వచ్చింది. ఆయనను వెంటిలేటర్‌ పై ఉంచి వైద్యం అందించారు. ఆయన ప్రొటీన్ లెవల్స్, బీపీ పూర్తిగా తగ్గిపోయినట్లు సిద్దగంగ హాస్పిటల్ డాక్టర్ పరమేష్ శివన్న తెలిపారు. ఆయన మృతి వార్త తెలియగానే యడ్యూరప్ప, కేంద్ర మంత్రి సదానంద గౌడ, బీజేపీ ఎంపీ శోభా కరాండ్లజె తమ కార్యక్రమాలను రద్దు చేసుకొని మఠానికి చేరుకున్నారు. మఠంతోపాటు తుముకూరు ప్రాంతంలో ఇప్పటికే వీఐపీల కోసం హెలిప్యాడ్లు ఏర్పాట్లు చేస్తున్నారు.

కర్ణాటకలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తుముకూరుకు చేరుకుంటున్నారు. న‌డిచే దేవుడిగా శివకుమార స్వామీజీని భక్తులు కీర్తించేవాళ్లు. సిద్దగంగ మఠంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా 100కుపైగా విద్యాసంస్థలను నడిపే సిద్దగంగ ఎడ్యుకేషన్ సొసైటీని కూడా స్వామీజీయే చూసుకునేవాళ్లు. 2007లో వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు కర్ణాటక ప్రభుత్వం కర్ణాటక రత్న బిరుదుతో సత్కరించింది. 2015లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మ భూషణ్ అవార్డు ఇచ్చింది. శివకుమారకు భారతరత్న ఇవ్వాలని ముఖ్యమంత్రి కుమారస్వామి కేంద్రాన్ని కోరుతున్నారు.


Full View
Tags:    

Similar News