కష్టంగా జైలు జీవితం.. బెయిలు కోసం గాలి తాపత్రయం
ఓబులాపురం మైనింగ్ కేసులో శిక్ష అనుభవిస్తున్న కర్ణాటక మాజీ మంత్రి, ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి బెయిలు కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.;
ఓబులాపురం మైనింగ్ కేసులో శిక్ష అనుభవిస్తున్న కర్ణాటక మాజీ మంత్రి, ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి బెయిలు కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన వయసు, సామాజిక సేవా కార్యక్రమాలను చూసి బెయిల్ మంజూరు చేయాలని న్యాయమూర్తిని కోరారు. తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉండటంతో జైలులో ఉండలేకపోతున్నానని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. గాలి బెయిల్ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ఎలాంటి తీర్పు వెలువరించనుందనేది ఆసక్తిరేపుతోంది.
ఓబులాపురంలో అక్రమ మైనింగ్ నిర్వహించారని, ఏపీ, కర్ణాటక సరిహద్దులు చెరిపేయడంతోపాటు నిబంధనలకు విరుద్ధంగా ఇనుప ఖనిజం ముడిసరుకు తవ్వుకున్నారని గాలిపై అభియోగాలు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయనపై దర్యాప్తు జరిపిన సీబీఐ పోలీసులు అక్రమ తవ్వకాలతో ప్రభుత్వానికి రూ.1,200 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందని గుర్తించారు. సుదీర్ఘ విచారణ తర్వాత గత వారం ఓపులాపురంలో అక్రమ మైనింగుపై హైకోర్టు తీర్పు వెలువరించింది. నిందితుల జాబితాలో ఉన్న గాలి జనార్దన్ రెడ్డితోపాటు ఆయన బావమరిది బీ.వీ.శ్రీనివాసులరెడ్డి, రాజగోపాలరెడ్డి, అలీఖాన్ సహా ఇతరులకు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. దీంతో మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డిని చంచల్ గూడ జైలుకు తరలించారు.
అయితే వయసు మీద పడటం, పలు అనారోగ్య సమస్యలు వల్ల తాను జైలులో ఉండలేకపోతున్నానని, తన పరిస్థితిని గమనించి బెయిల్ మంజూరు చేయాలని ముద్దాయి గాలి జనార్దన్ రెడ్డి హైకోర్టులో బెయిలు పిటిషన్ దాఖలు చేశారు. బీపీ, షుగర్ వంటి దీర్ఘ కాలిక సమస్యలతో బాధపడుతున్న తనకు గతంలో బెయిల్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. న్యాయ వ్యవస్థకు సహకరిస్తానని హామీతో గతంలో తన ప్రవర్తనను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలని అభ్యర్థించారు.
సీబీఐ అరెస్టు, చార్జిషీటు దాఖలు చేసిన తర్వాత బెయిలు తీసుకున్న ముద్దాయి గాలి జనార్దన్ రెడ్డి శిక్ష పడేవరకు న్యాయవ్యవస్థకు సహకరించారని ఆయన తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన ఆరోగ్యం, వయసును పరిగణనలోకి తీసువాలని గాలి న్యాయవాదులు అభ్యర్థించారు. అయితే ప్రభుత్వం తరపు న్యాయవాదులు మాత్రం గాలి బెయిల్ పిటిషన్ ను తీవ్రంగా వ్యతిరేకించారు.
బీపీ, షుగర్ వంటి వ్యాధుల పేరుతో ముద్దాయికి బెయిలు ఇస్తే కేసులో మిగిలిన దోషులు సైతం అవే కారణాలు చూపే అవకాశం ఉందని సీబీఐ తరపు న్యాయవాదులు వాదించారు. ముద్దాయిలు చేసిన నేరాన్ని తేలిగ్గా తీసుకోరాదని కోర్టుకు నివేదించారు. ఇరుపక్షాల వాదనను విన్న తెలంగాణ హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. దీంతో కోర్టు నిర్ణయంపై అందరిలోనూ ఉత్కంఠ పెరుగుతోంది.