'భార్యను ఖర్చుల లెక్క అడగటం క్రూరత్వం కాదు'

అమెరికాలో ఐటీ ఉద్యోగం చేస్తున్న భర్త.. ఆయన కుటుంబ సభ్యులపై హైదరాబాద్ లో ఉంటున్న మహిళ 2022లో సరూర్ నగర్ మహిళా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.;

Update: 2025-12-21 07:30 GMT

తాను ఇచ్చిన డబ్బులకు సంబంధించిన లెక్కను భర్త అడిగితే.. అది క్రూరత్వం కిందకు వస్తుందా? దీనికి సంబంధించి హైదరాబాద్ కు చెందిన భార్యభర్తల వివాదం ఏకంగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం వరకు చేరింది. ఈ ఇష్యూకు సంబంధించిన కేసుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆసక్తికరంగా మారింది. ఇంతకూ అసలు వివాదం ఏమిటి? దానిపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఏమిటి? అన్న వివరాల్లోకి వెళితే..

అమెరికాలో ఐటీ ఉద్యోగం చేస్తున్న భర్త.. ఆయన కుటుంబ సభ్యులపై హైదరాబాద్ లో ఉంటున్న మహిళ 2022లో సరూర్ నగర్ మహిళా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐటీ ఉద్యోగులైన వీరిద్దరికి 2016లో పెళ్లైంది. 2019 వరకు అమెరికాలోనే కలిసి ఉన్నారు. అక్కడే వీరికి బాబు పుట్టాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య గొడవ తలెత్తటంతో ఆమె కొడుకును తీసుకొని హైదరాబాద్ లోని పుట్టింటికి వచ్చేసింది.

దాంపత్య హక్కుల పునరుద్ధరణ కోరుతూ 2022లో ఆమెను అమెరికాకు తిరిగి రావాలని కోరుతూ భర్త నోటీసు పంపారు. దీనికి ప్రతిగా భార్య.. భర్త అతని కుటుంబ సభ్యులపై వరకట్న వేధింపుల నిరోధక చట్టం కింద సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. తాను భారత్ కు తిరిగి వచ్చిన తర్వాత భర్త తనకు.. తన బిడ్డకు ఆర్థికంగా సాయం చేయటం లేదని.. కుటుంబ అవసరాల కోసం ఎప్పుడు డబ్బులు అడిగినా ప్రతి పైసాకూ లెక్క అడుగుతున్నట్లుగా పేర్కొన్నారు.

అదే సమయంలో ఇండియాలో ఉన్న తన తల్లిదండ్రులకు తన భర్త లక్షలాది రూపాయిలు పంపుతారని ఆరోపించారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఆమె భర్తకు వ్యతిరేకంగా లుకౌట్ నోటీసులు జారీ చేయటంతో పాటు.. అతను.. అతని కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో భర్త హైకోర్టును ఆశ్రయించగా అక్కడ చుక్కెదురైంది. దీంతో అతను సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ ఉదంతంపై విచారించిన సుప్రీం.. ఎఫ్ఐఆర్ ను కొట్టేయటంతో పాటు సెక్షన్ 498ఎ కింద ఏయే అంశాల్నిపరిగణలోకి తీసుకోవాలో స్పష్టం చేసింది.

తాజా కేసులో భర్తపై మహిళ చేసిన ఆరోపణలు రోజువారీ సంసారంలో జరిగే కీచులాటల్లానే కనిపిస్తున్నాయని.. వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ క్రూరత్వం కింద పరిగణించటానికి వీల్లేదని స్పష్టం చేసింది. అమెరికాలో ఉంటున్న భర్త తన కుటుంబ సభ్యులకు డబ్బులు పంపడాన్ని అపారథం చేసుకోవటానికి వీల్లేదని సుప్రీం పేర్కొంది. లెక్కలు అడగటం క్రూరత్వ నిర్వచనంలోకి రాదని భర్త తీరును తప్పు పట్టిన భార్యను ఉద్దేశించి పేర్కొన్నారు.

తాను గర్భవతిగా ఉన్నప్పుడు తన భర్త సరిగా చూసుకోలేదని.. కాన్పు అయిన తర్వాత లావు తగ్గమని వేధించాడని భార్య ఆరోపిస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఒకవేళ అది నిజమే అనుకుంటే అది సదరు వ్యక్తి గుణానని ప్రతిబింబిస్తుందే తప్పించి క్రూరత్వం కిందకు రాదని పేర్కొంది. ఎఫ్ఐఆర లో భార్య చేసిన ఆరోపణలు ఆధారాలు లేని రీతిలో ఉన్నట్లుగా పేర్కొంటూ కేసును కొట్టేసింది.

Tags:    

Similar News