ఏపీ లిక్కర్ కేసులో మరో అప్డేట్.. ఆ ముగ్గురిపై సుప్రీం సంచలన నిర్ణయం
ఏపీ లిక్కర్ కేసులో డీఫాల్ట్ బెయిలు పొందిన ముగ్గురు నిందితులపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.;
ఏపీ లిక్కర్ కేసులో డీఫాల్ట్ బెయిలు పొందిన ముగ్గురు నిందితులపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. స్కాంలో నిందితులు అయిన రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయరెడ్డి, మాజీ సీఎం జగన్ రెడ్డి ఓఎస్డీ కృష్ణమోహనరెడ్డి, భారతీసిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పకు డీఫాల్ట్ బెయిలు మంజూరు చేయడంపై సోమవారం సుప్రీంలో విచారణ జరిగింది. ఈ ముగ్గురు ఏసీబీ కోర్టు ఇచ్చిన డీఫాల్ట్ బెయిలుతో విడుదలయ్యారు. అయితే ఏసీబీ కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లడంతో డీఫాల్ట్ బెయిలు రద్దు అయింది.
హైకోర్టు నిర్ణయంతో ముగ్గురు నిందితులు గత నెలలోనే కోర్టులో లొంగిపోవాలి. అయితే నిందితులు హైకోర్టు తీర్పుపై సుప్రీంలో అప్పీలు చేయడంతో కోర్టు సోమవారం వరకు హైకోర్టు తీర్పుపై స్టే విధించింది. ఇక సోమవారం మరోసారి నిందితుల అప్పీలుపై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం కీలక నిర్ణయం తీసుకుంది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. విచారణను వచ్చేనెల 21వ తేదీకి వాయిదా వేసింది. అయితే అప్పటి వరకు నిందితులు లొంగిపోవాల్సిన అవసరం లేదని, ఏసీబీ కోర్టు ఉత్తర్వులను కొనసాగించవచ్చని స్పష్టం చేసింది.
సుప్రీంకోర్టు నిర్ణయంతో నిందితులు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పకు మరో నెల రోజుల పాటు ఉపశమనం లభించింది. ఇదేసమయంలో సిట్ కు ఎదురుదెబ్బ తగిలిందని న్యాయవాద వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఏపీ లిక్కర్ స్కాంలో రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయరెడ్డి ఏ31గా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈయనను మే 13న సిట్ అరెస్టు చేసింది. ఇక ఏ32 కృష్ణమోహన్ రెడ్డి, ఏ33 బాలాజీ గోవిందప్పను మే 16న అరెస్టు చేశారు. ఈ ముగ్గురికి సెప్టెంబరు 7న డీఫాల్ట్ బెయిలు మంజూరు చేస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు ఆదేశాలిచ్చింది.
కోర్టు ఉత్తర్వులతో ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప విడుదల అయ్యారు. అయితే ఏసీబీ కోర్టు తీర్పుపై సిట్ అప్పీలు చేయడం, హైకోర్టులో సిట్ కు అనుకూలంగా తీర్పు రావడంతో నిందితులు మళ్లీ జైలుకు వెళ్లే పరిస్థితి వచ్చింది. కానీ, నిందితులు హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్ వేసి ఊరట దక్కించుకున్నారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు రెండు సార్లు ఏసీబీ కోర్టు నిర్ణయాన్ని పరిగణనలోకి తీసుకుని, హైకోర్టు తీర్పుపై స్టే విధించడంతో నిందితులు మరికొన్నాళ్లు స్వేచ్ఛగా బయట తిరిగే అవకాశం దక్కించుకున్నారు. ఇక వచ్చేనెల 21న విచారణ జరగనుండటంతో సిట్ వాదనలపై ఉత్కంఠ నెలకొంది.