నచ్చినోళ్లతో మేజర్ యువతి కలిసి ఉండొచ్చన్న తెలంగాణ హైకోర్టు
ఈ పరిణామానికి హతాశుడైన యువకుడు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి తన వేదనను తెలియజేస్తూ.. వివరాలతో ఒక లేఖ రాశారు.;
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఒక యువకుడు రాసిన లేఖకు స్పందించటం.. దాని తదనంతరం చోటు చేసుకున్న పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. మేజర్ అయిన యువతి తనకు నచ్చిన వ్యక్తితో జీవించే హక్కు ఆమెకు ఉందన్న విషయాన్ని టీ హైకోర్టు తాజాగా మారోసారి స్పష్టం చేసింది. అంతేకాదు.. యువతి నిర్బంధంపై ఆమె ప్రేమికుడు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖపై స్పందించటమేకాదు..తాజాగా ఆ కేసు విచారణను క్లోజ్ చేసి.. కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇంతకూ అసలేం జరిగిందంటే..
వేర్వేరు వర్గాలకు చెందిన ఇద్దరు ప్రేమికులు ఇంటి నుంచి వెళ్లిపోయారు. అయితే.. యువతి కుటుంబం నుంచి సమస్యలు ఉండటంతో తమ భద్రత అంశంపై తుకారం గేట్ పోలీసుల్ని ఈ ప్రేమికులు ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఇరుపక్షాలతో మాట్లాడి సమస్యను పరిష్కరించుకోవాల్సిందిగా సూచన చేసిన పోలీసులు.. సదరు యువతిని కస్తూర్బా గాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న శక్తి సదన్ కు తరలించారు.
ఈ పరిణామానికి హతాశుడైన యువకుడు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి తన వేదనను తెలియజేస్తూ.. వివరాలతో ఒక లేఖ రాశారు. దీంతో ఆ లేఖను సుమోటో హెబియస్ కార్పస్ పిటిషన్ గా స్వీకరించిన హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ పిటిషణ్ పై జస్టిస్ మౌసమీ భట్టాచార్య.. జస్టిస్ గాడి ప్రవీణ్ కుమార్ లతో కూడిన ధర్మాసనం ఇటీవల విచారణ చేపట్టి ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రేమికులతో పాటు యువతి తల్లిని కూడా న్యాయస్థానానికి పిలిపించి విచారణ చేపట్టారు. కోర్టు విచారణలో సదరు యువతి తన తల్లితో కలిసి ఉండటానికి ఇష్టపడలేదు. మేజర్ అయిన ఆమె తన ప్రేమికుడితో కలిసి ఉంటానని స్పష్టం చేసింది. దీంతో.. మేజర్ అయిన యువతి ఇష్టానుసారం జీవించే అవకాశాన్ని కల్పిస్తూ.. తక్షణం ఆమెను శక్తిసదన్ నుంచి విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు.
విచారణ సందర్భంగా యువకుడి నేర చరిత్ర ఉందన్న యువతి తల్లి ఆరోపణలకు స్పందించిన న్యాయస్థానం.. అలాంటి ఏదైనా అవాంఛనీయ సంఘటన ఏర్పడితే మాత్రం చట్టప్రకారం చర్యలు తీసుకోవటానికి యువతి తల్లికి అవకాశం ఉంటుందని పేర్కొంటూ పిటిషన్ విచారణను ముగించారు. దీంతో.. వేర్వేరుగా ఉన్న ప్రేమికులు హైకోర్టు ఆదేశాలతో ఒక్కటైన పరిస్థితి.