ఏంటీ టికెట్ల ధర దోపిడీ? కేంద్రంపై హైకోర్టు సీరియస్

ముంబై ఢిల్లీ మధ్య రద్దీ లైన్లో ఒక ఎకానమీ టికెట్ కు దాదాపు రూ.35వేల దాకా ముక్కుపిండి మరీ వసూలు చేసినట్లు తెలుస్తోంది.;

Update: 2025-12-10 17:30 GMT

ఇండిగో కంపు ఇప్పట్లో వదిలేలా లేదు. కేవలం ఒక సంస్థ సృష్టించిన సంక్షోభం ఎన్నో ప్రకంపనాలు పుట్టిస్తోంది. ఒకవైపు ప్రయాణికులు దుమ్మెత్తిపోస్తుంటే...మరో వైపు ప్రతిపక్షం విరుచుకు పడుతుంటే...ఇంకో వైపు హైకోర్టు సీరియస్...ఊపిరాడకుండా కేంద్రం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇండిగో పుణ్యమా అని అనుకోని యుద్దానికి సిద్ధం కావల్సి వచ్చింది. ఇండిగో సంక్షోభం ఒకవైపు కుతకుతలాడిస్తుంటే మరో వైపు ఇతర విమాన సంస్థలు సందిట్లోసడేమియాల్లా అమాంతంగా టికెట్ ధరలు పెంచేశాయి. ధరలు ఇంత అమానవీయంగా పెంచేస్తుంటే విమానయానశాఖ ఏం చేస్తోంది. అసలు టికెట్ ధర రూ.40వేల దాకా పెంచుకునే అనుమతి ఆ సంస్థలకు ఎలా లభించింది? ఈ మొత్ం సంక్షోభం ఎలా తలెత్తింది? ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే కేంద్రం నిరుత్తరంగా నిలవాల్సి వచ్చింది.

సాధారణంగా బంద్ లు జరుగుతుంటే లోకల్ ఆటోలు, ప్రైవేటు బస్సులు రేట్లు పెంచేస్తున్నట్లు ...ఇండిగో విమానాలు రద్దు చేయడంతో లక్షలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లో చిక్కుకుపోతే ప్రత్యమ్నాయం కోసం నిరీక్షిస్తే వారికి ఎదురైన చేదు అనుభవాలు అన్నీ ఇన్నీ కావు. ఇతర విమానసంస్థలు సందు చూసుకుని రేట్లు అమాంతంగా పెంచేసుకున్నాయి. ఆ సంస్థలు ఇంత కక్కుర్తి పడుతుంటే...కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోలేక పోయిందనేదే హైకోర్టు ప్రశ్న. ముంబై ఢిల్లీ మధ్య రద్దీ లైన్లో ఒక ఎకానమీ టికెట్ కు దాదాపు రూ.35వేల దాకా ముక్కుపిండి మరీ వసూలు చేసినట్లు తెలుస్తోంది. మామూలుగా అయితే ఈ లైన్లో పీక్ అవర్లో టికెట్ బుక్ చేసుకున్నా పోయి రావడానికి రూ.20వేలు మించదు. అలాంటిది ఒకసైడ్ పోవడానికే రూ.35 వేల దాకా టికెట్ ధర పెంచారంటే ఎంత అమానవీయం.

ఇండిగో సంక్షోభాన్ని నివారించేందుకు కేంద్రం చర్యలు తీసుకున్నందుకు అభినందనలు అయితే అసలు సమస్య ఎందుకొచ్చిందనేదే మా ప్రశ్న అంది హైకోర్టు. ఒకవేళ విమానాలు రద్దయినా...ప్రయాణికులకు యుద్ధ ప్రాతిపదికన ప్రత్యమ్నాయ మార్గాలు ఎందుకు అన్వేషించలేదు. వారి సమస్యకో పరిష్కారం చూపాల్సిన బాధ్యత సదరు ప్రభుత్వశాఖకు ఉంటుంది కదా అని హైకోర్టు గుర్తు చేసింది. అడిషనల్ సోలిసిటర్ జనరల్ ప్రభుత్వం తీసుకున్న చర్యల్ని కోర్టుకు వివరించినా ...సంతృప్తి చెందలేదు.

అసలు పైలట్లు ఎందుకు ఎక్కువ గంటలు పనిచేయాల్సి వస్తోంది? ఇండిగో తగినంతమంది పైలట్లను ఎందుకు నియమించుకోలేదు? ఎఫ్ డిటీఎల్ నిబంధనల్ని సంస్థ కచ్చితంగా పాటించేలా కేంద్రం చర్యలు తసుకోవాలని తెలిపింది. కాగా ఈ సంక్షోభం ఫలితంగా కేంద్రం ఇండిగో విమాన సర్వీసుల్లో 10శాతం కోత విధించినట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు స్పైస్ జెట్ ప్రయత్నాలు ప్రారంభించింది. వింటర్ షెడ్యూల్ లో 100 సర్వీసులు చేరుస్తున్నట్లు ప్రకటించింది. ఏదో చేయబోతే మరేదో అయ్యిందన్నట్లు ఇండిగో సంక్షోభంతో ఏదో సాధించేందుకు ప్రయత్నిస్తే అది కాస్త వేరే సంస్థలకు లాభసాటిగా మారుతోంది.

Tags:    

Similar News