ఓటమి వేళ టీడీపీకి అనిత.. సునీతల మాదిరి వైసీపీ ఎవరూ లేరా?
బెల్లం చుట్టూ ఈగల మాదిరి.. అధికారం చేతిలో ఉన్నప్పుడు వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా అందరూ ఎగబడుతుంటారు. అధినేతను తమకు మించి ప్రేమించేవారు.. అభిమానించే వారు ఇంకెవరు ఉండరన్నట్లుగా బిల్డప్ ఇస్తారు.;
బెల్లం చుట్టూ ఈగల మాదిరి.. అధికారం చేతిలో ఉన్నప్పుడు వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా అందరూ ఎగబడుతుంటారు. అధినేతను తమకు మించి ప్రేమించేవారు.. అభిమానించే వారు ఇంకెవరు ఉండరన్నట్లుగా బిల్డప్ ఇస్తారు. ఈ హడావుడిలో నిజంగా.. నిజాయితీగా ప్రేమించేటోళ్లు.. అభిమానించేటోళ్లు పెద్దగా హైలెట్ కారు. అలాంటి ఆణిముత్యాల్ని.. వీర విధేయుల్ని గుర్తించి వారికి సముచిత గౌరవం ఇవ్వాల్సిన అవసరం అధినేత మీదనే ఉంటుంది. ఇప్పుడు అలాంటి వారి కోసం భూతద్దం వేసుకొని వెతకాల్సిన దుస్థితి వైసీపీలో నెలకొంది.
ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు వైసీపీలో ఉన్న మహిళా నేతలు.. వారి అనుభవించిన రాజసాల గురించి ఎంత తక్కువ చెబితే అంత మంచిది. ఇంతమంది మహిళా నేతలు ఉన్న పార్టీ ఇదేనేమో అన్నట్లుగా వైసీపీ వెలిగిపోయింది. వైసీపీలో బాగా హైలెట్ అయిన మహిళా నేతల పేర్లు చెప్పమంటే అందరి నోట ముందు వచ్చే మాట ఆర్కే రోజా.. ఆ తర్వాత విడుదల రజనీ.. వాసిరెడ్డి పద్మ.. ఇలా చెప్పుకుంటూ పోతే పదవుల్ని పొందినోళ్లు మాత్రమే కాదు.. సోషల్ మీడియాను వేదికగా చేసుకొని వైసీపీకి వీర విధేయులుగా ఎంతోమంది చెలరేగిపోయారు.
గత ఏడాది జరిగిన ఎన్నికల్లో వైసీపీ దారున ఓటమి తర్వాత నుంచి పార్టీలో పేరున్న మహిళా నేతలు ఒక్కొక్కరుగా కనిపించకుండా పోతున్న పరిస్థితి. అది ఆర్కే రోజా కావొచ్చు.. విడుదల రజనీ.. వంగా గీత కావొచ్చు.. ఇంకెవరైనా కావొచ్చు. వాసిరెడ్డి పద్మ విషయానికి వస్తే.. ఆమె ఏకంగా పార్టీనే మార్చేశారు. ఇక.. మిగిలిన మహిళా నేతల గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. డిప్యూటీ సీఎంగా పని చేసిన పాముల పుష్పశ్రీవాణి.. మంత్రిగా వ్యవహరించిన ఉష శ్రీచరణ్.. నాగులాపల్లి ధనలక్ష్మి.. బాలయ్య మీద పోటీ చేసిన దీపిక.. లోకేశ్ మీద పోటీ చేసిన మురుగుడు లావణ్య కావొచ్చు.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది వైసీపీ మహిళా నేతలు ఇప్పుడు కనీసం కనిపించని పరిస్థితి.
అధికారం లేని వేళలో తోపు నేతలే అన్ని మూసుకొని ఉంటారు? అలాంటిది మహిళా నేతలు ఎలా బయటకు వస్తారు? ఎలా పోరాడతారు? లాంటి పనికిమాలిన ప్రశ్నలు కొందరు వేయొచ్చు. అదే నిజమైతే.. పార్టీ అధికారంలో లేని వేళలో.. పార్టీ తరఫున పని చేసిన టీడీపీ మహిళా నేతలు అనిత.. సునీతల మాటేమిటి? వీరే కాదు.. మరింత మంది సోషల్ మీడియాలోనూ తమ వాదనల్ని వినిపించటాన్ని మర్చిపోకూడదు.
ఇదంతా చూసినప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఈగల దండులా చుట్టూ చేరిన మహిళా నేతల్లో పార్టీ కోసం.. అధినేత కోసం పోరాడే దమ్మున్న మహిళా నేత ఒక్కరంటే ఒక్కరు కూడా వైసీపీ లేకపోవటాన్ని ఆ పార్టీ వారు జీర్ణించుకోలేకపోతున్నారు. యాంకర్ శ్యామల కొద్దిగా హడావుడి చేసినా.. మారుతున్న పరిణామాల నేపథ్యంలో మౌనాన్ని ఆశ్రయిస్తున్న పరిస్థితి. మొత్తంగా.. టీడీపీ మాదిరి వైసీపీకి కూడా ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొని ఎదురొడ్డి పోరాడే మహిళా నేతల అవసరం ఇప్పుడు చాలా ఉందని మాత్రం చెప్పక తప్పదు.