వైసీపీపై మంటెత్తి పోతున్న వలంటీర్లు.. రీజన్ ఇదే... !
వలంటీర్లు. ఈ మాట వినగానే వైసీపీ ప్రభుత్వం గుర్తుకు వస్తుంది. అయితే.. వలంటీర్ల వ్యవస్థను పుట్టిన వైసీపీపైనే వారు ఇంకా ఆగ్రహంతో ఉన్నారు.;
వలంటీర్లు. ఈ మాట వినగానే వైసీపీ ప్రభుత్వం గుర్తుకు వస్తుంది. అయితే.. వలంటీర్ల వ్యవస్థను పుట్టిన వైసీపీపైనే వారు ఇంకా ఆగ్రహంతో ఉన్నారు. వాస్తవానికి వారిని ఉద్యోగాలనుంచి తొలగించిన ప్రస్తుతకూటమి ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారని.. వారు వచ్చే ఎన్నికల్లో తమకు అనుకూలంగా పనిచేస్తారని వైసీపీ లెక్కలు వేసుకుంటోంది. కానీ, దీనికి భిన్నంగా క్షేత్రస్థాయిలో వలంటీర్లు.. వైసీపీపైనే నిప్పులు చెరుగుతున్నారు. వైసీపీ అంటేనే అసహ్యిం చుకుంటున్నారని తాజాగా వెల్లడైంది. మరి దీనికి రీజనేంటి? అనేది ఆసక్తిగా మారింది.
వైసీపీ అధినేత జగన్ 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత.. అదేసంవత్సరం ఆయన.. వలంటీర్ల వ్యవస్థను తీసు కువచ్చారు. తద్వారా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వలంటీర్లు వారధిగా పనిచేసేలా చేశారు. దీంతో సంక్షేమ కార్య క్రమాల నుంచి అభివృద్ది కార్యక్రమాల వరకు కూడా వలంటీర్లను వాడుకున్నారు. దీనివల్ల పార్టీకి-ప్రజలకు మధ్య సబంధాలు కట్ అవుతున్నాయని చెప్పినా.. ఆనాడు సీఎంగా ఉన్న జగన్ పట్టించుకోలేదు. పైగా.. వలంటీర్ల వ్యవస్థ తనను మరోసారి విజయం దక్కించుకునేలా చేస్తుందని అనుకున్నారు.
కానీ, జగన్ ఆలోచన చేసినట్టుగా వలంటీర్ల వ్యవస్థ ఆయనకు, పార్టీకి కూడా కలిసి రాలేదు. పైగా.. ఎన్నికల్లో వలంటీర్లు యూటర్న్ తీసుకున్నారన్న వాదన కూడా ఉంది. దీని ఫలితంగానే వైసీపీ పరాజయం పాలైంది. అయితే.. కూటమి ప్రభుత్వం వలంటీర్లకు రూ.10 వేల చొప్పున ఇస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినా.. అసలు ఈ వ్యవస్థను ఇప్పటి వరకు రెన్యువల్ చేయలేదు. దీంతో వలంటీర్లు కొన్నాళ్లు ఆవేదన వ్యక్తం చేశారు. నిరసనలు చేపట్టారు. తర్వాత సైలెంట్ అయ్యారు. తమకు కూటమి సర్కారు అన్యాయం చేసిందని కూడా కొందరు వ్యాఖ్యానించారు.
అయితే.. తాజాగా సీఎం చంద్రబాబు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. వలంటీర్ల వ్యవస్థను తాము ఎందుకు కొనసాగించలేదో వివరించారు. ''వైసీపీ నాయకులు ఆ నాడు శపథం చేశారు. వలంటీర్ల వ్యవస్థ లేకుండా ఇంటింటికీ.. పింఛన్లు పంపిణీ చేయలేరని అన్నారు. ప్రభుత్వ పథకాలు చేరువ కావన్నారు. కానీ, మేం అన్నింటినీ చేసి చూపిస్తున్నాం. వలంటీర్లు లేకుండానే పింఛన్లు, పథకాలను ఇస్తున్నాం. అందుకే.. వలంటీర్లను పక్కన పెట్టాం'' అని తేల్చి చెప్పారు. దీంతో వలంటీర్లకు అసలు విషయం బోధపడింది. తమను తొలగించడానికి కారణం.. వైసీపీ చేసిన శపథమే కారణమని గుర్తించిన వలంటీర్లు.. ఇప్పుడు ఆ పార్టీపై మండిపడుతున్నారు. ఇలాంటి పార్టీ వల్ల తమ ఉపాధికి గండిపడిందని కూడా వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే ఇప్పుడు వైసీపీకి మరో మైనస్ అయింది.