గవర్నర్లకు ఏమైంది? దేశంలో కలకలం!
మొన్న తమిళనాడు.. నిన్న కేరళ.. నేడు కర్ణాటక.. రాష్ట్రం ఏదైనా.. గవర్నర్లు వ్యవహరిస్తున్న తీరు తీవ్ర వివాదానికి దారితీస్తోంది.;
మొన్న తమిళనాడు.. నిన్న కేరళ.. నేడు కర్ణాటక.. రాష్ట్రం ఏదైనా.. గవర్నర్లు వ్యవహరిస్తున్న తీరు తీవ్ర వివాదానికి దారితీస్తోంది. తమిళనాడులో డీఎంకే ప్రభుత్వానికి అక్కడి గవర్నర్ ఆర్.ఎన్. రవికి మధ్య వివాదం అందరికీ తెలిసిందే. గత రెండేళ్లుగా ఆయన సర్కారును ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఈ విషయాన్ని సాక్షాత్తూ సుప్రీంకోర్టు కూడా చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన బిల్లులను ఆమోదించకపోవడం గత ఏడాది పెద్ద దుమారంగా మారి.. దేశాన్ని సైతం కుదిపేసింది.
దీనిపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇవ్వగా.. దీనిని రాష్ట్రపతి ప్రశ్నిస్తూ.. సుప్రీంకోర్టుకు లేఖ సంధించారు. ఈ మొత్తం వ్యవహారానికి గవర్నర్ ఆర్. ఎన్. రవివ్యవహరించిన తీరే కారణమన్నది అందరికీ తెలిసిందే. ఇక, తాజాగా కేరళ ప్రభుత్వానికి కూడా ఎదురుతిరిగినట్టుగా అక్కడి గవర్నర్ వ్యవహరించారు. కేరళ అసెంబ్లీ నుంచి ఆయన వాకౌట్ చేయడం బుధవారం దేశవ్యాప్తంగా చర్చకు వచ్చింది. వాస్తవానికి కేరళలో ఇప్పటి వరకు గవర్నర్ వర్సెస్ ప్రభుత్వానికి మధ్య వివాదం లేదు.
ఇక, ఇప్పుడు కర్ణాటకలో గవర్నర్ వర్సెస్ సర్కారుకు మధ్య వివాదం తెరమీదికి వచ్చింది. తాజాగా గురు వారం ప్రత్యేకంగా భేటీ అయిన అసెంబ్లీలో ప్రభుత్వం రాసిచ్చిన ప్రసంగాన్ని చదవకుండానే గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ సభ నుంచి వాకౌట్ చేశారు. ఈ పరిణామంతో సీఎం సిద్దరామయ్య సహా.. మంత్రులు కూడా ఖిన్నులయ్యారు. కేంద్రం ఇటీవల తెచ్చిన జీ-రామ్‌జీ చట్టాన్ని రాష్ట్రాల్లో అమలు చేసేందుకు సభ లో చర్చించి.. ఆమోదించాల్సి ఉంది.
అయితే.. బీజేపీ యేతర పార్టీల ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలు.. జీ-రామ్‌జీ బిల్లును తప్పుబడుతున్నాయి. దీంతో గవర్నర్లు.. సభలను వాకౌట్ చేస్తున్నారు. అయితే.. వాస్తవానికి గవర్నర్‌లు రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించాలని రాజ్యాంగం చెబుతోంది. ఇక, పలు సందర్భాల్లో సుప్రీంకోర్టు కూడా గవర్నర్‌లను ఉద్దేశించి పలు కీలక వ్యాఖ్యలు చేసింది. అయినప్పటికీ కేంద్రం కనుసన్నల్లో పనిచేస్తున్న గవర్నర్లు స్వతంత్రంగా వ్యవహరించలేక పోతుండడం గమనార్హం. ఇదిలావుంటే.. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో ఈ రగడ మరింత ఎక్కువగా ఉంది.